మీ చెప్పుకు స్ట్రిప్ ఉందా?.. ఇదేంటి.. మీ పేస్టులో ఉప్పుందా అని యాడ్ చూశాం కానీ చెప్పు స్ట్రిప్ గురించి అడుగుతున్నారేంటి? అనుకుంటున్నారా? అంతే కాదండోయ్.. మీరు వేసుకుంది చెప్పులా? శాండిల్సా? ఇవేం ప్రశ్నలని ఆశ్చర్యపోతున్నారా? కానీ, ఇదే ప్రశ్న దేశ రాజధానిలో సుమారు 14 ఏళ్ల పాటు ఓ సంస్థను కార్యాలయాల చుట్టూ తిప్పింది. కోర్టు మెట్లు ఎక్కించింది. న్యాయపోరాటానికి కారణమైంది. చెప్పులు అని వేటిని అంటారు. శాండిల్స్‌కు ఉండాల్సిన అర్హత ఏంటనే దానిపై సుదీర్ఘంగా చర్చ సాగింది. ఏవి చెప్పులో.. ఏవి శాండిల్సో చివరికి ఢిల్లీ హైకోర్టు తేల్చింది. ఓ పరిష్కారం లభించింది.
చెన్నైకి చెందిన విశాల్ ఇంటర్నేషనల్ సంస్థ 2003 మే 15న మహిళల పాదరక్షలను విదేశాలకు ఎగుమతి చేసింది. కంపెనీ వాటిని ‘లేడీస్ లెదర్ శాండిల్స్’గా పేర్కొంటూ, ఆ కేటగిరీకి వర్తించే 10 శాతం డ్రా బ్యాక్ రాయితీని కోరింది. అయితే ఇవి శాండిల్స్ కాదు చెప్పులు అని కస్టమ్స్ శాఖ సుంకం రాయితీని ఐదు శాతానికి తగ్గించింది. దీంతో అవి ఏ కేటగిరీ కిందకు వస్తాయనే చర్చ మొదలైంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ‘చప్పల్’ నిర్వచనాన్ని సంస్థ అంగీకరించలేదు. దీంతో న్యాయ పోరాటానికి సిద్ధమైంది. ఇది దేశవ్యాప్తంగా ఎగుమతిదారుల్లో చర్చనీయాంశంగా మారింది.
రెండు సంస్థలు.. విభిన్న నివేదికలు
ఎగుమతి వస్తువు ఏ కేటగిరీ కిందికి వస్తుందనేది నిర్ధారించేందుకు పాదరక్షల నమూనాను న్యూఢిల్లీలోని లెదర్ ఎక్స్‌పోర్టు కౌన్సిల్‌కు విశాల్ సంస్థ పంపింది. ఆ కౌన్సిల్‌లోని సభ్యులు వాటిని పరిశీలించి అవి లెదర్ శాండిల్స్‌గా నిర్ధారించారు. ఈ మేరకు ధ్రువీకరణ పత్రం ఇచ్చారు. దీనిపై ఎస్‌ఐఐబీ ఆ నమూనాను కౌన్సిల్ ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థకు(ఎఫ్‌డీడీఐ) పంపించింది. ఆ ఎగుమతి వస్తువులు ‘చెప్పుల’ కేటగిరీకి చెందినవిగా పేర్కొంది. ఈ కేటగిరీకి 10% సుంకం రాయితీ రాదని, 5% మాత్రమే వర్తిస్తుందని తెలిపింది.
సంస్థకు షోకాజ్ నోటీసు జారీ
లెదర్ ఎక్స్‌పోర్టు కౌన్సిల్ లేఖ ఆధారంగా కస్టమ్స్ శాఖ విశాల్ ఇంటర్నేషనల్ సంస్థకు షోకాజ్ నోటీసు జారీ చేసింది. కేటగిరీని తప్పుగా నమోదు చేసి చెల్లించిన వ్యత్యాస డ్యూటీ డ్రా బ్యాక్ మొత్తం రూ. 1,30,800 నెలకు 15% వడ్డీతో కలిపి ఎందుకు తిరిగి వసూలు చేయకూడదో వివరణ ఇవ్వాలని ఆ నోటీసులో కోరింది. కస్టమ్స్ చట్టంలోని సెక్షన్ 114 ప్రకారం జరిమానా విధించే ప్రతిపాదన కూడా నోటీసులో పేర్కొంది. వ్యక్తిగత విచారణకు కూడా అవకాశం కల్పించింది.
జరిమానా విధింపు
ఎఫ్‌డీడీఐ నిర్ణయంతో ఏకీభవించడం లేదంటూ విశాల్ సంస్థ షోకాజ్ నోటీసుకు సమాధానం ఇచ్చింది.
అనంతరం డ్రా బ్యాక్ మొత్తాన్ని తిరిగి వసూలు చేయాలని, అదనంగా రూ. 1.25 లక్షల జరిమానా చెల్లించాలని కస్టమ్స్ అదనపు కమిషనర్ ఆర్డర్ జారీ చేశారు. దీనిపై సంస్థ కస్టమ్స్ కలెక్టర్ (అప్పీల్స్) వద్ద అప్పీలు దాఖలు చేసింది. ఆ అప్పీల్‌ను తిరస్కరించారు. దీంతో కేంద్ర ప్రభుత్వానికి రివిజన్ దరఖాస్తు సమర్పించింది. ఫుట్‌వేర్ డిజైన్ అండ్ డెవలప్‌మెంట్ సంస్థ నైపుణ్యం కలిగిన సంస్థ కావున ఆ అభిప్రాయాన్నే పరిగణనలోకి తీసుకుంటున్నట్టు కేంద్రం తెలిపింది. జరిమానా మొత్తాన్ని రూ. 10,000కు తగ్గించింది. ఎన్నో ఏళ్లుగా వ్యాపారపరంగా ఆ పుట్‌వేర్‌ను ‘లెదర్ శాండల్స్’గానే వర్గీకరిస్తున్నారని విశాల్ సంస్థ పేర్కొంది.
ఢిల్లీ హైకోర్టులో పిటిషన్
చివరకు సంస్థ 2013లో ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. కస్టమ్స్ శాఖ వర్గీకరణ సరైంది కాదని, తాము ఎగుమతి చేసిన పుట్‌వేర్‌ను శాండిల్స్‌గా పరిగణించాలని, శాండిల్స్‌కు వర్తించే సుంకం రాయితీ వర్తింపజేయాలని, కస్టమ్స్ శాఖ ఆదేశాలను కొట్టివేయాలని కోర్టును అభ్యర్థించింది.
ఏది చప్పల్? ఏది శాండల్?
వెనుక భాగంలో స్ట్రిప్ లేకపోతే అది శాండిల్ కాదు చప్పల్‌గానే పరిగణించాలన్న కస్టమ్స్ శాఖ వాదనను కోర్టు అంగీకరించలేదు. ఒకే ఒక లక్షణం ఆధారంగా నిర్ణయం తీసుకోకూడదని పేర్కొంది. వ్యాపారులు, వినియోగదారులు ఒక ఉత్పత్తిని ఎలా పిలుస్తారో అదే ప్రామాణికమని పేర్కొంది. టెక్నికల్‌గా అధికారులు ఏ పేరు పెట్టినా మార్కెట్‌లో అది లేడీస్ లెదర్ శాండిల్స్‌గానే గుర్తింపు పొందిందనే అంశాన్ని గుర్తించాలని పేర్కొంది.
కోర్టు తీర్పు ఇలా..
లెదర్ ఫుట్‌వేర్ వర్గీకరణపై దాదాపు 14 ఏళ్లుగా కొనసాగుతున్న వివాదానికి ఢిల్లీ హైకోర్టు 2017లో ముగింపు పలికింది.
కస్టమ్స్ శాఖ తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేసింది. ఎగుమతి చేసిన ఉత్పత్తిని చప్పల్స్’గా వర్గీకరించిన విధానాన్ని తప్పు పట్టింది. మహిళల పుట్‌వేర్‌లో అనేక నమూనాలు ఉంటాయని, వాటన్నింటికీ ఒకే కొలమానం పెట్టలేమని స్పష్టం చేసింది. చెప్పులు, శాండిల్స్‌కు ఉన్న టెక్నికల్ తేడాలను పేర్కొంది. సంబంధిత శాఖ ఆదేశాల్ని కొట్టేస్తూ తుది తీర్పు ఇచ్చింది.
సాధారణంగా చట్టంలో ఒక ఉత్పత్తికి స్పష్టమైన నిర్వచనం లేని సందర్భంలో ‘కమర్షియల్ పారాలెన్స్ టెస్ట్’ను కోర్టులు ప్రామాణికంగా భావిస్తాయి.. కానీ, కొన్ని కేసుల్లో మాత్రం కాంపోజిషన్, టెక్నికల్ స్టాండర్డ్స్‌ను కూడా చూడాలని న్యాయ స్థానాలు పలు కేసుల్లో స్పష్టం చేశాయి.
∙దిలీప్ మాదిరెడ్డి


