Happy Sri Rama Navami: నైవేద్యంగా పానకం... వడపప్పు ఎందుకు?

Sri Rama Navami 2022: Significance Of Vadapappu Panakam Recipe - Sakshi

శ్రీరామనవమి రోజు దేవుడికి పానకం, వడపప్పు నైవేద్యంగా పెడతారు. ఈ ప్రసాదాల వెనుక ఆయుర్వేదిక పరమార్థం కూడా ఉంది. శ్రీరామనవమి వేసవి కాలం ప్రారంభంలో వస్తుంది కాబట్టి శ్రీరాముడిని పూజించిన తరువాత కొత్తకుండలో మిరియాలు, బెల్లంతో చేసిన పానకం, వడపప్పు నైవేద్యంగా పెట్టి పంచి పెడతారు. భగవంతుడికి నివేదించే ప్రసాదాలు అన్నీ సమయానుకూలంగా, ఆరోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే.

పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు వసంత రుతువులో వచ్చే గొంతు సంబంధిత వ్యాధులకు ఉపశమనాన్ని ప్రసాదిస్తూ, ఔషధంలా పనిచేస్తాయని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. అదే కాకుండా పానకం శ్రీమహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది.

అలాగే పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది, జీర్ణశక్తిని వృద్ధి పరుస్తుంది. అంతేకాదు... ఇది దేహకాంతి, జ్ఞానానికి ప్రతీక కూడా. పెసరపప్పునే వడపప్పు అంటారు ఇది మండుతున్న ఎండలలో ‘వడదెబ్బ’ కొట్టకుండా కాపాడుతుంది. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది కాబట్టి వడపప్పు తినడం వల్ల బుధుడి అనుగ్రహం లభిస్తుంది.

పానకం
కావలసినవి: నీళ్లు –  ఆరు కప్పులు, బెల్లం తరుగు – ఒకటిన్నర కప్పు, మిరియాలు – ముప్పై, యాలకులు – ఆరు, శొంఠి – ముప్పావు టీస్పూను, నిమ్మకాయ – మూడు చెక్కలు, తులసి ఆకులు – గుప్పెడు, ఉప్పు – చిటికెడు, పచ్చకర్పూరం – చిటికెడు.

 తయారీ...
► ముందుగా మిరియాలు, యాలకులను విడివిడిగా దంచి పొడిచేసుకుని జల్లెడ పట్టి పక్కన పెట్టుకోవాలి.
► పానకం తయారీ గిన్నెలో నీళ్లు పోసి అందులో ముందుగా తరిగి పెట్టుకున్న బెల్లం వేయాలి. బెల్లం నీటిలో కరిగేంత వరకు చక్కగా కలుపుకోవాలి
► ఇప్పుడు మిరియాలపొడి, ఉప్పు, పచ్చకర్పూరం వేయాలి. తులసి ఆకులను శుభ్రంగా కడిగి సన్నగా తరిగి వేయాలి.
► నిమ్మరసం, శొంఠి పొడి వేసి బాగా కలిపితే పానకం రెడీ.
 
వడపప్పు
కావలసినవి: పొట్టుతీసిన పెసర పప్పు – ఒకటిన్నర కప్పులు, పచ్చిమిర్చి – ఒకటి(సన్నగా తరగాలి), పచ్చికొబ్బరి తురుము – మూడు టేబుల్‌ స్పూన్లు, మామిడికాయ ముక్కలు – పావు కప్పు, కీరా తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్‌ స్పూన్లు, ఉప్పు – టీస్పూను, నిమ్మరసం – టీస్పూను.

తయారీ...
► ముందుగా పెసరపప్పుని శుభ్రంగా కడిగి గంటపాటు నానబెట్టుకోవాలి.
► నానబెట్టిన పప్పులో నీళ్లు వంపేసి ఒక గిన్నెలో వేసుకోవాలి. దీనిలో పచ్చిమిర్చి, పచ్చికొబ్బరి తురుము, మామిడికాయ ముక్కలు, కీరా తరుగు, కొత్తిమీర తరుగు వేసి కలపాలి
► చివరిగా ఉప్పు, నిమ్మరసం వేసి కలిపితే వడపప్పు రెడీ.
 
చలిమిడి
కావలసినవి:  రాత్రంతా నానబెట్టిన బియ్యం – కప్పు, పంచదార పొడి – ముప్పావు కప్పు, పచ్చికొబ్బరి తురుము – రెండు టేబుల్‌ స్పూన్లు, యాలకుల పొడి – అరటీస్పూను, పాలు – మూడు టేబుల్‌ స్పూన్లు, నెయ్యి – టేబుల్‌ స్పూను.

తయారీ..
► తడిబియ్యాన్ని వడగట్టుకుని..మిక్సీజార్‌లో వేసి పొడిచేసుకోవాలి. ఈ పిండిని మెత్తగా జల్లెడ పట్టుకోవాలి.
► జల్లెడ పట్టి తీసిన మెత్తటి బియ్యప్పిండిని ఒక గిన్నెలో తీసుకుని పచ్చికొబ్బరి తురుము, పంచదార పొడి, యాలకుల పొడి వేసి కలపాలి.
► ఈ మిశ్రమంలో నెయ్యి, పాలు పోసి ముద్దలా కలుపుకోవాలి.
► ఈ ముద్దను పానకం, వడపప్పుతో దేవుడికి నైవేద్యంగా సమర్పించవచ్చు.

– డి.వి.ఆర్‌. భాస్కర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top