
ఇటీవలే విడుదలై సూపర్ హిట్ అయిన కోర్ట్ సినిమాలో చివరి దాకా ఒక సస్పెన్స్ ఉంటుంది. హీరో హీరోయిన్లు ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుని కొన్ని నిమిషాల సేపు గడిపి వస్తారు. అయితే అక్కడ ఏం చేశారు అనే సస్పెన్స్. దీన్ని చివరిదాకా కొనసాగిస్తారు. చివర్లో తెలుస్తుంది. వారిద్దరూ ఫేక్ పెళ్లి చేసుకున్నారని... ఇప్పుడు దాదాపుగా అలాంటి ఫేక్ పెళ్లిళ్లే మెట్రో నగరాలకు వచ్చేస్తున్నాయి. అయితే అవి ఇద్దరు టీనేజర్లు చేసుకునే అమాయకపు పెళ్లిళ్లు కాదండోయ్... బాగా డబ్బున్న సంపన్నులు చేసుకునే పార్టీ పెళ్లిళ్లు. అవేమిటి అంటారా?అయితే ఆ పార్టీ సారీ స్టోరీలోకి వెళ్లాల్సిందే...
ఢిల్లీ పార్టీ సీన్లో ఇప్పుడు ఓ కొత్త ట్రెండ్ వచ్చేసింది. దాని పేరే నకిలీ పెళ్లి వేడుకలు, ఈ వేడుకల్లో నిజమైన వధూవరులు ఉండాల్సిన అవసరం లేదు. కానీ అంతకు మించిన హంగు, ఉత్సాహం మాత్రం ఉండాలి. అతిథులు సంప్రదాయ దుస్తులు ధరించి, పెళ్లి వేదికలా అలంకరించబడిన స్థలానికి వెళ్తారు. అక్కడ డీజే మ్యూజిక్, ఢోల్స్, పెళ్లి పాటలతో రాత్రంతా నృత్య విహారం సాగుతుంది. ఢిల్లీకి చెందిన సోషల్ మీడియా ప్రొఫెషనల్ అవంతిక జైన్ ఇన్‌స్ట్రాగామ్‌లో ‘‘ఫేక్ సంగీత్’ ప్రకటనను చూసి తన మిత్రులతో వెంటనే షేర్ చేసింది. ‘‘కాలేజీలో చదువుతున్నప్పుడు ఇలాంటి పెళ్లి థీమ్ పార్టీ చేయాలని కలలు కంటూ ఉండేవాళ్లం. ఇప్పుడు అది నిజం అయ్యే ఛాన్స్ లాగా అనిపించింది,’’ అని ఆమె ఓ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక్కొక్కరికి సుమారు రూ.550 చొప్పున ఎంట్రీ ఫీజు చెల్లించి ఈ ఈవెంట్‌కు జైన్ ఆమె మిత్రులతో కలిసి వెళ్లారు. , సుమారు వందమంది యువతతో పాటు, ఢిల్లీ మెహ్రౌలీ లేన్ లోని పాప్యులర్ క్లబ్ అయిన జైలో రూఫ్‌టాప్ రెస్టారెంట్‌లో జరిగిన ఈ నకిలీ సంగీత్‌కు హాజరయ్యారు. ఈ ఈవెంట్‌కు ‘‘దేశీ’’ డ్రస్ కోడ్ తప్పనిసరి. తన శరీరానికి బ్లాక్ బ్లౌజ్, ప్లమ్ కలర్ లెహంగా ధరించి అవంతిక హాజరయ్యారు. కానీ అక్కడ అంతా పెళ్లికి తగ్గ దుస్తులు ధరించి కనిపించారు. నిజమైన పెళ్లి వేడుకలే గుర్తుకొచ్చేలా కుర్తా–షెర్వానీలు, చున్నీలు, మెరిసే ఆభరణాలు ధరించారు. వేదికలో పసుపు–గులాబి రంగు డెకరేషన్లు, మారిగోల్డ్ పూల అలంకరణలు, ఫోటో బూత్‌లు, మెహందీ ఆర్టిస్ట్‌లతో పక్కా పెళ్లి మూడ్ క్రియేట్ చేశారు. పెళ్లి పాటలతో నృత్యం ఓ హైలైట్. ‘‘పంజాబీ, హిందీ బీట్స్‌పై మనసు పెట్టి డ్యాన్స్ చేశాం. మధ్యలో ఢోల్వాలాలు వచ్చి వాతావరణాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చారు,’’ అని అవంతిక చెప్పారు. ఈ ఈవెంట్‌కి కేవలం యువతే కాదు, మధ్య వయస్కులు, పెద్దలు కూడా హాజరయ్యారు. అంతా కలిసిమెలిసి ఎంజాయ్ చేశారు. ‘‘ఈవెంట్ అయిపోయినా ఎవరికీ వెళ్లాలనిపించలేదు,’’ అని అవంతిక గుర్తు చేసుకున్నారు.
చదవండి: తీవ్ర నష్టాల్లో లగ్జరీ ఫ్యాషన్ హౌస్, 1700 మందికి ఉద్వాసన
భారతీయ సమాజంలో పెళ్లిళ్లు అనేవి ఒక పెద్ద వేడుక. అలాంటి వేడుకల మూడ్‌ను ఎప్పుడైనా సరే అంటే ముహూర్తాలు లేని టైమ్‌లో కూడా ఎంజాయ్ చేయాలనుకునే వారికి ఇది ఆహ్వానించదగ్గ ట్రెండ్ అని చెప్పాలి. నిజమైన పెళ్లి ఆహ్వానాన్ని అందుకోవాలని ఎదురు చూడాల్సిన అవసరం లేకుండానే పెళ్లిళ్లకు వెళ్లవచ్చు. ఢిల్లీకి చెందిన‘‘జుమ్మీకీ రాత్’’ అనే ఈవెంట్ కంపెనీ ఇప్పటివరకు ఇలాంటి రెండు నకిలీ పెళ్లి ఈవెంట్‌లు నిర్వహించింది.
అంతేకాదు గత 2024 అక్టోబరులో షంగ్రీలా గ్రూప్ ‘బంధన్’ పేరుతో వెడ్డింగ్ సర్వీసును లాంచ్ చేసినప్పుడు కూడా మాక్ వెడ్డింగ్ పార్టీ నిర్వహించారు. డిజైనర్ తరుణ్ తహిలియానీ డిజైన్ చేసిన పెళ్లి వస్త్రధారణలో మోడల్ జంట, లైవ్ సుఫీ మ్యూజిక్, గజ్రా స్టాళ్లు, భోజన విందుతో ఈ ఈవెంట్‌ను రక్తి కట్టించారు.
చదవండి: Cannes: అరంగేట్రంలోనే ఎదురు దెబ్బ, లగేజీ మొత్తం గాయబ్!
సాధారణంగా వెడ్డింగ్ కొరియోగ్రఫీ సంస్థలు కూడా వీడియో కంటెంట్ కోసం నకిలీ పెళ్లిళ్లు ప్లాన్ చేస్తుంటాయి. ఎందుకంటే... స్టూడియో కంటే, పెళ్లి వేదికలపై తీసిన వీడియోలకే సోషల్ మీడియాలో ఎక్కువ క్రేజ్ ఉంటుంది. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు కూడా అక్కడే ఈ తరహా మాక్ వెడ్డింగ్‌లు జరుపుకుంటూ కల్చరల్ కనెక్షన్‌ను కొనసాగిస్తారు. ఇప్పుడు ఇవి పార్టీ మార్గాలుగా కూడా మారిన నేపధ్యంలో ఈ ఫేక్ వెడ్డింగ్ పార్టీ కల్చర్ మన దాకా వచ్చేస్తుందేమో...చూడాలి.