Singer Parvathy: ఈ కాలం మెచ్చిన కోయిలమ్మలు... సినిమాల్లో పాడే అవకాశాలూ వస్తున్నాయన్న పార్వతి

Sakshi Interview About Lady Singers Dasari Parvati, Divyajyoti, Durgavva

వసంతకాలం అనగానే   విరబూసిన పూలు, లేలేత మావి చిగుళ్లు కోయిలమ్మల రాగాలు మదిలో మెదులుతాయి.   అలాగే, ఈ సీజన్‌లో తమ గానామృతంతో   మనల్ని అలరిస్తూ సందడి చేస్తున్నారు   దాసరి పార్వతి, దివ్యజ్యోతి, దుర్గవ్వలు.   టాలెంట్‌ ఉంటే ఏ మూలన ఉన్నా అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తాయి   అనే మాటలకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు.  

పని కష్టం మర్చిపోవడానికి నోటినుండి వెలువడే పదాలే పాటలుగా ఆకట్టుకుంటాయి. అవే జానపదాలై గ్రామీణుల గొంతుల్లో విరాజిల్లుతాయి. అలా మట్టిపరిమళం నుంచి వచ్చిన గొంతుక దుర్గవ్వది. తను పాట పాడితే వెన్నెల చల్లదనమంతా కురుస్తుందా అనిపించే గొంతుక పార్వతిది. అలసిన వేళ పాటే తోడు అంటూ విరిసిన గొంతుక జ్యోతి ది. తెలుగువారి హృదయాలను గెలుచుకున్న ఈ కోయిలమ్మలు తమ కమ్మటి రాగాల వెనక దాగి ఉన్న కష్టాన్ని, తమ పాట తమను నిలబెట్టిన తీరును సాక్షితో పంచుకున్నారు.  

 ఊరంతా వెన్నెల... పార్వతి
ఓ టీవీ కార్యక్రమంలో ‘ఊరంతా వెన్నెల మనసంతా చీకటి...’ పాటతో యావత్‌ తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది దాసరి పార్వతి. తమ ఊరికి బస్సు రావాలని కోరిన ఆమె మంచి మనసుకు ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంది. తెలుగునాట నెట్టింట పార్వతి పాడిన పాటను సెర్చ్‌ చేయని వాళ్లు లేరు అనేంతగా గుర్తింపు పొందింది. పార్వతి స్వస్థలం కర్నూల్‌ జిల్లా, లక్కసాగర గ్రామం. వ్యవసాయ కుటుంబం. ‘చిన్నప్పటి నుంచి పాటలు పాడుతుండేదాన్ని. ఊళ్లో అందరూ గొంతు కోయిలలా ఉందని మెచ్చుకుంటుండేవారు. స్కూల్లో ఏ కార్యక్రమం జరిగినా నా పాట ఉండేది. చదువుకుంటూనే పొలం పనులకు వెళ్లేదాన్ని.

పొలం పనులకు వచ్చేవాళ్లు కూడా నా చేత పాటలు పాడించుకునేవారు. ఇంటర్మీడియెట్‌ తర్వాత ఏం చేస్తే బాగుంటుందని ఆలోచించినప్పుడు మా అన్నయ్యల స్నేహితులు మ్యూజిక్‌ కాలేజీలో చేరమన్నారు. అలా ఇప్పుడు తిరుపతి మ్యూజిక్‌ కాలేజీలో ఎం.ఎ చేస్తున్నాను. టీవీ ప్రోగ్రామ్‌ వాళ్లు పెట్టిన ఆడిషన్స్‌లో సెలక్ట్‌ అయ్యాను. ఆ సందర్భంగా పాడిన పాటకు మంచి గుర్తింపు వచ్చింది. ఎంతో మంది ప్రశంసిస్తున్నారు. సినిమాల్లో పాడే అవకాశాలూ వస్తున్నాయి. ఇంత గుర్తింపు రావడం అదృష్టంగా భావిస్తున్నాను’’ అని అలనాటి జ్ఞాపకాలను ఆనందంగా పంచుకుంది పార్వతి.  

మట్టిగొంతుక... దుర్గవ్వ
పల్లె పాటలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యలపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గవ్వ. కూలిపనులు చేసుకుని, జీవనం సాగించే దుర్గవ్వకు ఇటీవల ఓ స్టార్‌ హీరో సినిమాలో పాట పాడే అవకాశం దక్కింది. ఆమె పాడిన ‘అడవి తల్లి..’ పాట రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ మార్మోగింది. సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. పల్లె పాటను ప్రాణం పెట్టి పాడిన ఈ సింగర్‌ కోసం నెటిజన్లు తీవ్రంగా వెతుకుతున్నారు. దుర్గవ్వ పాటకు ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. కొడుకు, కూతురు ఉన్న దుర్గవ్వ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తుంటుంది.

కాయకష్టంలో వచ్చే పల్లె పదాలు ఎన్నో. ‘‘చిన్నతనం నుంచి పాటెన్నడూ నన్ను వీడలేదు. ఓ రోజు నా బిడ్డ నా చేత నాలుగు పాటలు పాడించి చానళ్లలో పెట్టింది. ముందు వద్దన్న. కానీ, పిల్లలు వినలేదు. ఆ పాటలకు మంచి గుర్తింపు వచ్చింది. దీంతో మా దగ్గర కొంతమంది జానపద కళాకారులు నా చేత ఇంకొన్ని పాటలు పాడించారు. అక్కడి నుంచి సినిమాలో పాడే అవకాశం వచ్చింది. ఎక్కడో కూలి చేసుకుని బతికే నేను ఇలా అందరి ముందు పాటలు పాడటం, పేరు రావడం ఆనందంగా ఉంది’ అని వివరిస్తుంది దుర్గవ్వ. ప్రైవేట్‌ ఆల్బమ్‌లలో దుర్గవ్వ పాడిన పాటల్లో ‘సిరిసిల్ల చిన్నది..’, ‘నాయితల్లే.., ఉంగురమే.. రంగైనా రాములాల టుంగూరమే’ అనే పాటలకు మంచి గుర్తింపు వచ్చింది.  
 
ఊరటనిచ్చిన పాట..
అనుకోకుండా ఎగిసిన గొంతుకలా నెట్టింట వైరల్‌ అయ్యింది దివ్యజ్యోతి. కరీంనగర్‌ జిల్లా నర్సింగపురం నుంచి పొట్ట చేతపట్టుకొని హైదరాబాద్‌ చేరిన కుటుంబం జ్యోతిది. భర్త కారు డ్రైవర్‌గా పనిచేసేవాడు. జ్యోతి ప్రైవేట్‌ కంపెనీలలో హౌస్‌ కీపర్‌గా ఉద్యోగం చేస్తుంది. ఇద్దరు కూతుళ్లు చదువుకుంటున్నారు. యాక్సిడెంట్‌ అయ్యి భర్త కాలు తీసేయడంతో కుటుబానికి జ్యోతి సంపాదనే ఆదరవు అవుతోంది. ‘‘కష్టంలో నాతో పాటు ఎప్పుడూ తోడుండేది పాటనే.

ఆనందమేసినా నోటికొచ్చిన పాటలు పాడుకునేదాన్ని. చాలాసార్లు మాటలే పాటలవుతుంటాయి. నేను పనిచేసే చోట నాగవల్లి మేడం నాచేత పాట పాడించింది. ఆ పాటను సోషల్‌ మీడియాలో పెట్టడంతో నా గొంతుకు మంచి పేరొచ్చింది. ఇప్పుడు ప్రైవేట్‌ ఆల్బమ్‌లలో పాటలు పాడుతున్నాను. ఉదయం పూట డ్యూటీ చేస్తున్నాను. రాత్రిపూట పాటలు ప్రాక్టీస్‌ చేసుకుంటున్నా. నీ గొంతు చాలా బాగుంది. సినిమాల్లోనూ నీ చేత పాటలు పాడిస్తామని పెద్దోళ్లు చెబుతున్నరు’’ అని ఆనందంగా వివరిస్తుంది జ్యోతి.  

మనసు పెట్టి వినాలే కానీ, మన ఇరుగు పొరుగు, మనతోపాటు పని చేసేవారి గొంతుకలలో గమకాలు పలుకుతుంటాయి. గుర్తించి ఆస్వాదించాలి. పదిమందికీ వినిపించాలి. అప్పుడే పాటకు పట్టాభిషేకం జరుగుతుంది.  
 – నిర్మలారెడ్డి  

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top