పేదరికం తగ్గిన ఆహార వినియోగం పెరగలేదు!

Poverty Decreased Consumption Of Energy Giving Food Decreased - Sakshi

మన దేశంలో ప్రపంచ దేశాలకు భిన్నమైన ధోరణి

తక్కువ తింటే ఆరోగ్యం అనుకోవటమే ఇందుకు కారణమా?

ఎఫ్‌పిఓ, ఎన్‌ఐఎన్‌ గణాంకాల మధ్య భారీ వ్యత్యాసం

పోషకాల సాంద్రత గల ఆహారోత్పత్తిపై దృష్టి పెట్టాలి

నీతి ఆయోగ్‌ సభ్యుడు డా. రమేశ్‌ చంద్‌ వ్యాఖ్య

సాక్షి సాగుబడి, హైదరాబాద్‌: తలసరి ఆదాయం పెరిగి పేదరికం తగ్గిన దశలో శక్తినిచ్చే ఆహార వినియోగం పెరగటం ప్రపంచదేశాల్లో సర్వసాధారణం కాగా, భారత్‌లో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి ఉందని నీతి ఆయోగ్‌ సభ్యుడు, ప్రముఖ వ్యవసాయ ఆర్థిక వేత్త డాక్టర్‌ రమేశ్‌ చంద్‌ అన్నారు. 2012కు ముందు 30 ఏళ్లలో తలసరి ఆదాయం పెరిగి, పేదరికం తగ్గినప్పటికీ శక్తినిచ్చే ఆహార వినియోగం మాత్రం తగ్గిందన్నారు. పేదరికాన్ని తగ్గించినంత సులువుగా శక్తినిచ్చే ఆహార వినియోగాన్ని పెంపొందించలేకపోవటం అనే విచిత్ర పరిస్థితి మన దేశంలో నెలకొన్నదన్నారు. ప్రపంచ దేశాల పోకడకు భిన్నమైన ఈ ఆహార వినియోగ ధోరణికి మూలకారణాన్ని శోధించాలన్నారు.

శనివారం సాయంత్రం ఇక్కడి జాతీయ పోషకాహార సంస్థలో ఆయన డా. గోపాలన్‌ స్మారకోపన్యాసం చేశారు. ఆహార లభ్యత గత 50 ఏళ్లలో గణనీయంగా పెరిగినప్పటికీ శక్తినిచ్చే ఆహార వినియోగం తగ్గటం వెనుక మర్మాన్ని మన పౌష్టికాహార నిపుణులు శోధించాల్సిన అవసరం ఉందని డా. రమేశ్‌ చంద్‌ తెలిపారు. 1980 నుంచి 2012 నాటికి భారత్‌లో పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న వారి శాతం 38 నుంచి 16కి తగ్గిందని ఐక్యరాజ్యసమితికి చెందిన ఆహార-వ్యవసాయ సంస్థ (ఎఫ్‌.ఎ.ఓ.)చెబుతున్నదన్నారు. అయితే, హైదరాబాద్‌లోని జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌.ఐ.ఎన్‌.) గణాంకాల ప్రకారం మాత్రం వీరి శాతం 2012 నాటికి 77%గా ఉందన్నారు. ఎన్‌.ఐ.ఎన్‌. విశ్లేషణ నమూనాను ఎఫ్‌.ఎ.ఓ. నమూనాతో అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

గతంతో పోల్చితే ప్రజలకు యాంత్రీకరణ పెరిగి, శారీరక శ్రమ చేయాల్సిన అవసరం తగ్గింది. కాబట్టి, ప్రొటీన్లు, ఐరన్‌ వంటి పోషకాలు తీసుకోవటం పెరిగినా శక్తినిచ్చే ఆహార ధాన్యాల వినియోగం తగ్గి ఉంటుందన్నారు. భారతీయ సంస్కృతిలోని ఆహారం తక్కువగా తినటం ఆరోగ్యదాయకం అన్న భావన కారణంగానే కేలరీల వినియోగం తగ్గిందని ఫ్రెంచ్‌ ఆంత్రపాలజిస్ట్‌ ఫ్రెడరిక్‌ లెండి విశ్లేషించారని, ఈ కోణంలో పరిశోధనలు చేయాలని డా. రమేశ్‌ చంద్‌ అన్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే ఆహార ధాన్యాలు మనుషులతో పాటు పశువులకు మేపుతున్నామా? లేకపోతే ఆహారధాన్యాలు ఏమవుతున్నాయన్నది అర్థం చేసుకోవాల్సి ఉందన్నారు.

తక్కువ పరిమాణంలో ఆహార వినియోగం జరుగుతున్నందున పోషకాల సాంద్రత ఎక్కువగా ఉన్న ఆహారోత్పత్తి చేపట్టాలి. స్థానిక / సంప్రదాయ ఆహారాన్ని వినియోగించే దిశగా ప్రోత్సహించాలన్నారు. చిరుధాన్యాలను మధ్య, ఉన్నతి తరగతి ప్రజలు మరింతగా తింటున్నారని, అంటూ చిరుధాన్యాలకు మరింత ధర చెల్లిస్తే సాగుతో పాటు లభ్యత పెరుగుతుందని డా. రమేశ్‌ చంద్‌ అన్నారు. ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హేమలత తదితరులు పాల్గొన్నారు. దేశీయంగా గత పదేళ్ల నేషనల్‌ శాంపుల్‌ సర్వే గణాంకాల సేకరణ ఫలితాలు వెలువడాల్సి ఉందన్నారు. 2012 తర్వాత ప్రజల ఆదాయం బాగా పెరిగిందని అంటూ.. ఈ గణాంకాల్లో ఎంత మార్పు కనిపిస్తుందో వేచిచూడాలన్నారు.
– పంతంగి రాంబాబు, సీనియర్‌ జర్నలిస్టు

(చదవండి: సహకార ‘భారత్‌ ఆర్గానిక్స్‌’!

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top