‘ట్రీ వాక్‌’ చేద్దాం.. మర్రిచెట్లను కాపాడుదాం!

Peoples protest against felling of Banyan Trees on the Chevela-Vikarabad road - Sakshi

ఊడలుగా విస్తరిస్తుంది. ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొంటూ వందల ఏళ్లు జీవిస్తుంది ఎన్నో జీవ రాశులకు ఆశ్రయమిస్తుంది అందుకే, భగవద్గీతలో పరమాత్మ  చెట్లలో నేను మర్రిచెట్టును అన్నాడు.   మనిషి ఎదుగుదలలో మర్రిచెట్టును శిఖరమంతగా పోల్చవచ్చు.  అలాంటి మర్రిచెట్టుకు రక్షణ కరువైతే ...!! రోడ్లు అనో, డబ్బు వస్తుందనో... మనిషి తన స్వార్థం కోసం మర్రిచెట్లను తొలగించుకుంటూ పోతే...  మన మనుగడ మాత్రమే కాదు ఎన్నో జీవరాశుల ఆశ్రయానికి గొడ్డలిపెట్టు కాదా?! చెట్లను కాపాడితే మనల్ని మనం కాపాడుకున్నట్టే. ఈ నినాదంతో మర్రిచెట్లను కాపాడుదాం.. అని బయల్దేరారు. హైదరాబాద్‌వాసులు ఆసియా ఖాన్, కోబితా దాస్‌ కొల్లి, సాధన రాంచందర్‌. వీరి ఆలోచనకు మద్దతునిస్తూ మరికొందరు జత కలిశారు.


ఒక చెట్టు ఊడలు ఊడలుగా విస్తరిస్తుందంటే ఆ చెట్టు మనకేదో సందేశం ఇస్తుందని అర్థం. కానీ, ఈ రోజుల్లో ఇది అనర్థం వైపుగా కదులుతోంది. దీనికి అడ్డుకట్టవేయడానికే మేం బయల్దేరాం అన్నారు అసియా, సాధన, కోబితా దాస్‌.  
 
కదిలించిన వార్త
ప్రకృతి ప్రేమికులుగా ఉన్న వీరంతా కొన్నాళ్లుగా ‘ట్రీ వాక్‌’ పేరుతో నగరంలోని ముఖ్యమైన ప్రాంతాలకు వెళ్లి, వందలనాటి చెట్లను గమనించి, వాటి గురించి తెలుసుకుని వచ్చేవారు. స్కూల్‌ పిల్లలతో అవగాహన సదస్సులు ఏర్పాటు చేసేవారు. ‘కొన్నాళ్లుగా చెట్లను స్టడీ చేయడంలో ఉండే మా ఆసక్తి ఒక రోజు వచ్చిన వార్త కదిలించింది. 2019లో రోడ్డు వెడల్పు కోసం ప్రభుత్వం చేవెళ్ల నుంచి వికారాబాద్‌ వెళ్లే రోడ్డులో ఉన్న 9 వేల చెట్లను కట్‌ చేయడం లేదా వేరే చోటకు తరలించబోతున్నారు..’ అనేది ఆ వార్త సారాంశం. దీంతో వెంటనే ఆ ప్రాంతానికి వెళ్లాం. చేవెళ్ల రోడ్డులో ఉన్న ఆ చెట్ల సౌందర్యం చూడటానికి మాటలు చాలవు.


అంతటి అనుభూతిని ఎలా దూరం చేస్తారు..? మాలో ఎన్నో అలజడులు. మాతో కలిసిన మరికొంత మందితో ఈ విషయాన్ని చర్చించాం. వారూ మా ఆలోచనకు మద్దతునిచ్చారు. వారం వారం ఆ చెట్లకిందనే జనాలను పోగుచేసి కార్యక్రమాలు చేపట్టడం మొదలుపెట్టాం. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఆ వెయ్యి మర్రి చెట్లను రక్షించడానికి ఒక ఆన్‌లైన్‌ పిటిషన్‌ పెట్టాం. 63 వేల మంది ఈ పిటిషన్‌ మీద సంతకాలు చేసి, మద్దతు ఇచ్చారు. నేషనల్‌ హైవే అథారిటీ, నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్, ఇతర ప్రభుత్వ అధికారులనే కలిసి మర్రిచెట్ల సంరక్షణ గురించి వివరించాం. ప్రోగ్రామ్‌లు ఏర్పాటు చేయడం మొదలుపెట్టాం’ అని వివరించారు ఈ పర్యావరణ ప్రేమికులు.
 
తరలింపు సరైనదేనా?!
రోడ్డు వెడల్పు కోసం ఇక్కడి మర్రిచెట్లను మరో చోటకు తరలించాలనుకుంటే.. వాటిని యధాతధంగా చేయలేరు. వాటి కొమ్మలను నరికేస్తారు. కేవలం మధ్యలో ఉన్న భాగాన్నే తీసుకెళ్లి నాటుతారు. వందల ఏళ్లుగా పాతుకుపోయిన వేళ్లు లేకపోతే, ఆ చెట్టు ఎలా బతుకుతుంది. మోడుపోయినట్టుగా ఉన్న చెట్టు చిగురించినా ఎన్నాళ్లు బతుకుతుంది? అందుకే నేషనల్‌ (ఎన్‌హెచ్‌ఎ) వాళ్లను కలిశాం.

కాపాడమని లెటర్లు ఇచ్చాం. తర్వాత ఈ చెట్లను కట్‌ చేయడం లేదని, ఈ రోడ్డు వెడల్పు చేయరు అని అదే ఏడాది వార్త వచ్చింది. సంతోషమేసింది. అయితే, అంతటితో వదిలేయలేదు. రెగ్యులర్‌గా వెళ్లి చెట్లు అన్నీ ఉన్నాయా లేదా అని చెక్‌ చేస్తున్నాం. మళ్లీ కిందటేడాది రోడ్డు వెడల్పుకు చెట్లను కొట్టేస్తారన్నారు. దీంతో అవగాహన కార్యక్రమాలు ఎక్కువ ఏర్పాటు చేస్తున్నాం. అధికారులను కలిసి, ప్రపంచంలో మరెక్కడా లేని ఈ మర్రి చెట్ల మార్గాన్ని తొలగించవద్దని అర్జీలు పెడుతున్నాం.  

 అవగాహన అవసరం
చెట్టుకు ఇవ్వాల్సిన రక్షణ గురించి తెలిస్తే, కాపాడే గుణం కూడా వస్తుంది. అందుకే, అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నాం. దీపావళి సమయంలో చెట్లకింద దీపాలు పెట్టడం, మరోసారి చెట్లకింద నిల్చొని పద్యాలు చదవడం, ఇంకోసారి నిశ్శబ్దంగా ఉండటం, చెట్టుకు స్వాతంత్య్రం .. ఇలా రకరకాల థీమ్‌లతో చెట్ల వద్దే కాదు, నగరంలో పలు చోట్ల అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. వీటిలో ప్రాచీన వృక్షాలను కాపాడటం ఎలాగో వివరిస్తున్నాం. మొత్తం పర్యావరణ వ్యవస్థను కలిగి ఉన్న మర్రిచెట్టును రక్షిస్తే సకల జీవరాశిని రక్షించినట్టే. ఇటీవలే ఢిల్లీలో ఒకచోట ఇలాగే చెట్లను మరో చోట నాటే ప్రయత్నం చేస్తే, వాటిలో చాలా చెట్లు బతకలేదని తెలిసింది. ప్రభుత్వం ఈ చెట్ల మార్గాన్ని నేచురల్‌ హెరిటేజ్‌గా మార్చాలన్నది మా ప్రయత్నం.  
 
కొన్నిసార్లు నెమ్మది అవసరమే!  
‘జీవితంలో అన్ని చోట్లా వేగం సరికాదు. కొంత నెమ్మది కూడా మంచిది. వేగంగా వెళ్లాలనుకునేవారు ఇతర హైవేల నుంచి వెళ్లచ్చు. ఈ ఒక్క రోడ్డును మాత్రం వదిలేయమని మేం కోరుతున్నాం’ అంటారు ఆసియా ఖాన్‌. ‘మాతోపాటు మా బృందంలో మరో ఎనిమిది మంది ఉన్నారు. మాకు సపోర్ట్‌ చేసే మగవారు కూడా మా బృందంలో చేరారు. స్వచ్ఛందంగా చేసే ఈ నేచర్‌ అందరినీ ఆకట్టుకుంటోంది. మర్రిచెట్లను కాపాడటం కోసం చేసే అవగాహన సదస్సులలో పాల్గొనేవారి సంఖ్య ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. (క్లిక్‌: ఆటకు అనుబంధాలు జోడించి.. మొదటి ఏడాదిలోనే లాభాల బాట!)

ఈ యేడాది జూన్‌లో 914 మర్రి చెట్లకు జియో ట్యాగ్‌ చేయడానికి, డాక్యుమెంట్‌ చేయడానికి వాలెంటీర్ల చాలా రోజులపాటు పనిచేశారు. చెట్టు ఏ దిశలో, ఎలా ఉంది..అనే వివరాలతో ఫొటోలతో సహా ప్రతి మర్రి చెట్టు డేటా ఏర్పాటు చేశాం. దీనిని ఆన్‌లైన్‌లో కూడా పెట్టాం. ఇదే కాదు, తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా వందల ఏళ్ల నాటి చెట్లు ఉంటే, వాటి గురించి సమాచారం సేకరించి, వాటిని కాపాడటానికి కృషి చేస్తున్నాం’ అని వివరించారు ఈ పర్యావరణప్రేమికులు.  
అనవసర ఆలోచనలు, అవసరాల నుంచి దూరమై, చెట్టును కాపాడుదాం.  

– నిర్మలారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top