విధ్వంసంలో వివేచన

N Gopi telugu Poet New Book Based On Corona Introduction - Sakshi

ప్రపంచీకరోనా (కవిత్వం)

రచన: ఆచార్య ఎన్‌.గోపి

కవి ఫోన్‌: 040–27037585

శతాబ్దాలుగా మానవజాతి మనుగడను ప్రశ్నించి, సవాలు విసిరిన మహమ్మారులు చరిత్ర పుటల్లో ఎన్నో ఉన్నాయి. సాంకేతికంగా ఎంతో పురోగతి సాధించిన ఈ ఆధునిక యుగంలో కూడా మానవాళిని కరోనా వణికించింది. ‘‘ఎన్నడూ ఏకంకాని మానవజాతి/ ఇప్పుడు ఒకే శ్రుతిలో స్పందిస్తున్నది’’ అంటారు ఆచార్య గోపి. వారు లాక్‌డౌన్‌ కాలంలో రాసిన కవితలను, ‘ప్రపంచీకరణ’, ‘కరోనా’ పదాల మేళవింపుతో ప్రపంచీకరోనా పేరుతో కవితాసంపుటిగా తెచ్చారు.

ప్రపంచీకరణ లాభనష్టాలను పక్కనపెడితే, దాని వలన ప్రపంచం ఒక గ్లోబల్‌ విలేజ్‌గా మారిపోయింది. ‘‘ఒకప్పుడు విదేశీ యాత్రలు/ జ్ఞానాన్ని మోసుకొచ్చేవి/ ఇప్పుడు/ రోగాలను వెంట తెస్తున్నాయి/ వైశ్వీకరణం అంటే ఇదే కాబోలు!’’ అంటారు. ‘గృహమే కదా స్వచ్ఛందసీమ’ కవిత గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ‘‘ఇంట్లో ఇంత దుమ్ము పేరుకుందా!/ ఇన్నాళ్లుగా చిన్నబుచ్చుకున్న వస్తుజాలం/ వన్నెచిన్నెలతో బయటపడుతుంది’’ అంటూ అపురూపంగా ఇంట్లోకి తెచ్చుకున్న వస్తువులని చూడలేకపోయిన మన చూపుల పొరలను తొలగిస్తారు.

‘‘బల్లమీద వజ్రవైడూర్యాల్లాంటి పుస్తకాలున్నాయి/ జ్ఞానాన్వయ నైపుణ్యంతో/ కాసేపయినా పుణుకులాడొచ్చు’’ అంటూ కంప్యూటర్‌ కాలం అని కాలర్‌ ఎగరేసే కొత్తతరాన్ని  ఆలోచింపజేస్తారు. యాత్రికమైన జీవితయానంలో మనం చూడలేకపోయిన ఎన్నో విషయాలను పరిచయం చేస్తూనే– ‘‘ఇవాళ ఇంట్లో కూర్చుంటే/ ఇల్లులేనివాళ్లు గుర్తుకొస్తున్నారు/ తిండికోసం కండలు కరిగించే/ కష్టజీవులు కళ్లలో మెదుల్తున్నారు’’ అని శ్రమజీవులను ఆదుకోవాలనే విశ్వచైతన్యాన్ని కలిగిస్తారు.
కవి ఎప్పుడూ ఒంటరి కాదు. ఎన్నో మూగగొంతుకల స్పందనలను తన అక్షరాల్లో పలికిస్తాడు. ‘వైద్యుడికే మన దండం’’కవితలో ‘‘చేతుల్నే కాదు/ మనసుల్నీ కడుక్కొని/ మరోసారి మరోసారి మరోసారి/ ఆ మానవోత్తమునికి/ నమస్కరిద్దాం’’ అంటారు. ‘‘భయంలోనైనా సరే/ నేను కవిత్వమే రాస్తాను/ అదే నా ధైర్యం’’ అంటారు. ఒకానొక కాలంలో ప్రాణాంతకమైన వ్యాధిగా పరిగణింపబడి, ఎన్నో ప్రాణాలను బలితీసుకున్న కలరా నిర్మూలన జ్ఞాపకాలను తన మూలల్లో నిలుపుకొని, సజీవచిత్రంగా మనముందు నిలిచిన ‘చార్మినార్‌’లాగే, ఈ ప్రపంచీకరోనా కవితాసంపుటి కూడా ఈ కరోనా విపత్తు కాలంలో జనావళి భావచిత్రాలను ముందుతరాలకు అందిస్తుంది.
-కుడికాల వంశీధర్‌

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top