
పండుగ
శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజమ్
ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోప శాంతయే...
వినాయక చవితి వస్తే అందరి నోటా ఈ ప్రార్థనా శ్లోకం వినిపిస్తుంది. దీని అర్థం చాలా మందికి తెలియకపోవచ్చు. తెలియాల్సిన పద్ధతిలో తెలిసి ఉండకపోవచ్చు. తెలుగువారి మహాకవి విశ్వనాథ సత్యనారాయణ తనే స్వయంగా ఒక సందర్భంలో ఆ శ్లోకానికి అర్థం విడమర్చారు. అదేమిటో ఈ వినాయక చవితి సందర్భంగా తెలుసుకుందాం...
ఈ విఘ్నేశ్వర స్తోత్రం మహా వేదాంతార్థం కలిగిన శ్లోకం. దీని అర్థం సర్వము నందు అభివ్యాప్తమైయున్న మహాచైతన్యం ప్రథమావతారాన్ని బోధిస్తుంది. పురాణదశకు వచ్చేసరికి దీని అర్థం వేరు. విఘ్నేశ్వరుడు పార్వతీదేవి కుమారుడు. తెల్లని వస్త్రములు ధరించెడివాడు. విష్ణుమూర్తితో సమానుడు. శశియనగా చంద్రుడు. చంద్రవర్ణము కలవాడు. అనగా తెల్లనివాడు. చతుర్భుజుడు నాలుగు భుజములు కలవాడు. ఆయన ప్రసన్నవదనుడు. మొగము ప్రసన్నమై ఉండునని అర్థం. సర్వ విఘ్నములు ఉపశమించుట కొరకు ధ్యానించవలెను. ఇది శ్లోకార్థం.
పురాణ విఘ్నేశ్వరుడు ఉన్నట్టే తత్త్వభూతుడైన విఘ్నేశ్వరుడు ఉన్నాడు. తత్త్వమైన విఘ్నేశ్వరుణ్ణి ప్రార్థించడం ఉండదు. తత్వమైన భగవంతుణ్ణి ప్రార్థించుట ఉండదు. సాధ్యం కాదు. అది మనసున ఏకాగ్రస్థితి వచ్చినప్పుడు అంటే సర్వమైన ఇతర భావాలు తొలగించుకొన్నప్పడు సాధ్యం కావచ్చు బహుశా.
భగవంతునకు మూర్తి లేదు. మరి నీవు ఎవరిని ధ్యానించుచున్నావు? ఒక భావమును ధ్యానించు చున్నావా? భావమనగా ఊహ. ఆ ఊహæ నిలుచునా? ఎట్లు నిలుచును? అందుకే సృష్టి అంటే నామరూపాలు కాబట్టి భగవంతుని గుణాలకు రూపనామాలు ఇచ్చి ధ్యానించడం మనిషి బుద్ధికి సాధ్యం అయ్యింది.
అందుచేత విఘ్నములు పరిహరించు దేవునికి రూపకల్పన చేసి దానిని ధ్యానిస్తున్నాము. శుక్లాంబరధరుడని, చతుర్భుజుడని, శశివర్ణుడని చె΄్తామే కాని వెనుక వున్న అర్థం వేరు.
ఆ అర్థం తెలిసి ధ్యానిస్తే ఫలం అధికం.
శుక్లాంబరము అంటే తెల్లని ఆకాశము. దానిని ధరించినవాడు. ఆకాశానికి వర్ణం లేదు. కానీ విఘ్నేశ్వరుడు శుక్లాంబరధరుడు అంటే తెల్లని ఆకాశమును ధరించినవాడు అయ్యాడు. ఇదో సంకేతం. భాషలో సంకేతాలుంటాయి. మన శాస్త్రములలో సత్త్వ, రజో, తమో అని త్రిగుణములని మూడున్నవి. సత్త్వగుణం తెలుపు. రజోగుణం ఎఱుపు. తమోగుణం నలుపు. ఆకాశమనగా ‘నవకాశము’. ఇది పంచభూతములలో ఒకటి. ఇది లేకుండా ఏ రెండు భూతములకు సంయోగం లేదు. ఒక భూతములో వున్న రెండణువుల మధ్య కూడ ఆకాశముండును. ఈ ఆకాశమునందు భగవచ్ఛక్తి అభివ్యాప్తమై యుండును.
సత్త్వగుణముచేత అభివ్యాప్తమైయున్న ఆకాశమును ధరించినవాడు విఘ్నేశ్వరుడు అని అర్థం.
శశివరుడు– శశియనగా చంద్రుడు కదా! శశమును ధరించినవాడు. శశమనగా కుందేలు. చంద్రునిలోనున్న మచ్చ కుందేలని అల్లిబుల్లి కథ. శశమనగా ‘దాట్లు పెట్టుచు దూకునది’ అని అర్థం. అందుచేతనే చంద్రుని శశియన్నారు. అతడు శుక్ల, కృష్ణపక్షములను చేయును. సూర్యునివలె నిత్య జ్యోతిస్సు కాదు. అందుచేత అతడు శశి. ఈ విఘ్నేశ్వరుడు ఆ జాతి కలవాడు. అనగా కాల స్వరూపుడు.
కాలము రెండు విధములు. ఖండ కాలము, అఖండ కాలము. ఖండకాలమనగా దిన, పక్ష, మాస, సంవత్సరాత్మకమైనది. అఖండ కాలమనగా సూర్యచంద్ర గ్రహచారములు లేని చోట వుండునది. ఈ విఘ్నేశ్వరుడు ఖండకాల స్వరూపుడని అర్థం. అనగా లోకమును పాలించెడివాడని అర్థం. ఈ కాలంలో బతుకుతూ, ఈ కాలానికి అధీనమైవున్న మనం ఖండకాలమును పాలించెడి ఒక తత్త్వమును నిర్మించుకొని దానికి విఘ్నేశ్వర రూపం ఇచ్చినాము.
చతుర్భుజం– చతుర్భుజుడు– నాలుగు భుజములు కలవాడు. భుజమనగా ఒక అర్థం భోజనము చేయునది. రెండవ అర్థం పాలించునది. నాల్గు భుజములతో విఘ్నేశ్వరుడు భుజించును. దేనిని? కాలమును అనగా ఖండకాలమును అఖండకాలముగా మార్చునన్న మాట. ధర్మార్థ కామ మోక్షములు నాలుగు. ఈ నాల్గింటిని పాలించుచున్నాడు. మనం ఒక కార్య ప్రారంభంలో పూజిస్తే మన ధర్మార్థ కామములను పాలించుచున్నాడు. అందుకనే మనం విఘ్నేశ్వరుని నిత్యం ధ్యానిస్తున్నాం. విఘ్నేశ్వరుడినే పరమేశ్వరుడుగా ధ్యానించినచో మోక్షమును గూడ నొసంగగలడు. కాలమును నాలుగు చేతులతో భుజించుచున్నాడు కదా! నాలుగు యుగములుగా తనలో లయింపచేసి కొనుచున్నాడని అర్థం.
ఇంత పూజ దేనికి? సర్వవిఘ్నోప శాంతి కొరకు, విఘ్నములు ఉపశమించుట కొరకు, ఉపశమించునేగాని నశించవు. కాని విఘ్నేశ్వరుణ్ణి ధ్యానించినచో ఉపశమించును. విఘ్నమనగా కార్యమును చంపునట్టి లక్షణం. ఇది సృష్టిలో ఉన్నది. సృష్టిలక్షణం అన్నా తప్పు లేదు. ఆ సృష్టి లక్షణాన్ని ఉపశమింప చేయడానికి విఘ్నేశ్వరుని పూజ చేస్తున్నాము.
(‘సాహిత్య సురభి’ అనే పుస్తకంలో విశ్వనాథ ఈ వ్యాఖ్య చేశారు)
గణమైనఔషధాలు
గణేష్ చతుర్థి పూజకి ఉపయోగించే 21 రకాల పత్రులు సాధారణమైనవి కావు. శక్తిమంతమైన దివ్య ఔషధాలు. ఈ మొక్కలు ఏ అడవుల్లోనో ఉండేవి కావు. అన్నీ మన చుట్టూ పెరుగుతున్న మొక్కలే. ఈ 21 రకాల పత్రాల గురించి వివిధ రకాల గ్రంథాల్లో ప్రస్తావించారు.
సిద్ది వినాయక పూజ పత్రాలు
1. మాచిపత్రి: (శాస్త్రీయనామం – ఆర్టిమిజీయ పాలెన్స్. ఇది ఆస్టరేసి కుటుంబానికి చెందినది) ఇది మంచి సువాసన గల పత్రి. దీన్ని దద్దుర్లు, తలనొప్పి, వాతనొప్పులు, మధుమేహం, ఉబ్బసం, మూర్ఛ వ్యాధుల నివారణకు వాడతారు.
2. బృహతీపత్రం అంటే వాకుడు: శాస్త్రీయనామం పసౌ– సోలానం సూరత్రేన్స్. ఇది సొలనెసీ కుటుంబానికి చెందినది. దీన్ని దగ్గు, జలుబు, జ్వరం, మూత్రవ్యాధులు, నేత్రవ్యాధుల నివారణకు వాడతారు.
3.బిల్వపత్రం (మారేడు): శాస్త్రీయనామం – ఈగల్ మార్మిలస్. ఇది రూటేసి కుటుంబానికి చెందినది. దీన్ని జిగట విరేచనాలు, జ్వరం, మధుమేహం, కామెర్లు, నేత్రవ్యాధులు, రక్తహీనత, పగుళ్ళు, గాయాలు మానడానికి వాడతారు.
4.దుర్వయుగ్మము (గరిక ): శాస్త్రీయనామం – సైనోడాన్ డాక్టైలాన్. ఇది పోయేసి కుటుంబానికి చెందినది.ఇది గాయాలు మానడానికి, చర్మవ్యాధుల నివారణకు, ఉదర, మొలల నివారణకు వాడతారు.
5.దత్తూరపత్రం (ఉమ్మెత్త ): శాస్త్రీయనామం – దత్తూర ఇనోక్సీయా. ఇది సొలనేసీ కుటుంబానికి చెందినది. దీన్ని ఉబ్బసం, దగ్గు, శ్వాసకోస సమస్యలు, చర్మవ్యాధులు, కుక్కకాటు చికిత్సకి వాడతారు.
6. అపామార్గ పత్రం (ఉత్తరేణి): శాస్త్రీయనామం – అఖిరాంన్థస్ ఆస్పెరా. ఇది అమరాంథేసి కుటుంబానికి చెందినది. దీనిని దగ్గు, ఆస్తమా సమస్యలు తగ్గించడంలో, దంతాలు శుభ్రపరచడానికి వాడతారు.
7.బదరీ పత్రం (రేగు): శాస్త్రీయనామం – జిజిఫస్ మారిటియాన. ఇది రామినెసీ కుటుంబానికి చెందినది. చర్మ సమస్యలు, మలబద్ధకం,వీరేచనాల నివారణకు వాడతారు.
8.చూతపత్రం (మామిడి): శాస్త్రీయనామం – మాంగీఫెరా ఇండికా. ఇది అనకార్డియేసి కుటుంబానికి చెందినది.నోటి దూర్వసన, చిగుళ్ల వాపు సమస్యలను మామిడి ఆకు బాగా తగ్గిస్తుంది. మామిడి పండ్లలో బీటా కెరొటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది అస్తమా నుండి ఉపశమనం కలిగిస్తుంది.
9. కరవీర పత్రం (గన్నేరు): శాస్త్రీయనామం – నీరియం ఓడోరం. ఇది అపోసైనేసి కుటుంబానికి చెందినది. గడ్డలు, పుండ్లు, గాయాలు తగ్గేందుకు ఈ మొక్క వేరు, బెరడును ఉపయోగిస్తారు.
10.మరువక పత్రం (మరువం): శాస్త్రీయనామం – ఒరిగానం మజోరాన. ఇది లామియేసి కుటుంబానికి చెందినది. ఈ ఆకులు సువాసనను వెదజల్లుతాయి. వీటి వాసన చూస్తే ఒత్తిడి వెంటనే తగ్గుతుంది.
11.శమి పత్రం (జమ్మి): శాస్త్రీయనామం –్ర΄÷సోఫిస్ సినరేరియా. ఇది మైమోసేసీ కుటుంబానికి చెందినది. నోటి సంబంధ వ్యాధులు తగ్గించడంలో జమ్మి ఆకులు బాగా పనిచేస్తాయి.
12.విష్ణుక్రాంత పత్రం (నీలపుష్పి) శాస్త్రీయనామం : ఇవాల్వులస్ అల్సినాయిడిస్. ఇది కన్వాల్వలేసీ కుటుంబానికి చెందినది. దీన్ని నిద్రలేమి, దగ్గు, జ్వరం, విరేచనాలు, కడుపునొప్పి, గాయాలు మానడంలో బాగా సహాయపడుతుంది.
13.సింధువార పత్రం (వావిలాకు) శాస్త్రీయనామం – వైటెక్స్ నిగుండో. ఇది వెర్బినెసీ కుటుంబానికి చెందినది. కీళ్ల నొప్పుల సమస్యలు వున్న వారు ఈ ఆకును వాడితే మంచి ఫలితం వస్తుంది.
14.అశ్వత్థ పత్రం (రావి): ఈ మొక్క శాస్త్రీయ నామం –ఫైకస్ రెలిజియోస. ఇది మొరేసీ కుటుంబానికి చెందినది. చర్మ సమస్యలకు రావి ఆకు బాగా పనిచేస్తుంది.
15. దాడిమీ పత్రం (దానిమ్మ ): శాస్త్రీయనామం – ప్యూనిక గ్రానేటం. ఇది ప్యూనికేసీ కుటుంబానికి చెందినది. వాంతులు, విరేచనాలు అరికట్టడంలో దానిమ్మ ఆకులు బాగా సహాయపడతాయి.
16. జాజి పత్రం (జాజి మల్లి ): శాస్త్రీయనామం –జాస్మినం ఆరిక్యూలేటం. ఇది ఓలియేసీ కుటుంబానికి చెందినది. చర్మ సమస్యలు వున్న వారు, స్త్రీ సంబంధ వ్యాధులకు ఈ ఆకులు మంచి ఔషధంగా పనిచేస్తాయి.
17. అర్జున పత్రం (తెల్ల మద్ది): శాస్త్రీయనామం టెర్మినేలియా అర్జున.
ఇది కాంబ్రిటేసి కుటుంబానికి చెందినది. గుండెకు రక్తం బాగా సరఫరా అవడానికి ఈ ఆకులు ఉపయోగపడతాయి. అంతేగాక అల్సర్లు, మధుమేహం, దగ్గు, ఉబ్బసం, చర్మ వ్యాధుల నివారణకు దీని ఆకులు దోహదపడతాయి.
18.దేవదారు పత్రం(దేవదారు): శాస్త్రీయనామం –సిడ్రస్ దియోధర. ఇది పైనేసి కుటుంబానికి చెందినది. ఇది చల్లని ప్రదేశాలు అనగా హిమాలయాలల్లో పెరుగుతుంది. ఈ మొక్క ఆకులను ఆరబెట్టి తర్వాత నూనె లో వేసి కాచి చల్లార్చిన తర్వాత నూనె తలకు రాసుకుంటే మెదడు, కంటి సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. దేవదారు మాను నుండి తీసిన నూనె చుక్కలను వేడి నీళ్లలో వేసి ఆ నీటితో స్నానం చేస్తే శ్వాస సంబంధ సమస్యలు తొలగుతాయి.
19. తులసీపత్రం (తులసి): శాస్త్రీయనామం –ఆసిమం శాంక్టమ్. ఇది లామియేసీ కుటుంబానికి చెందినది.ఇది రోగ నిరోధక శక్తిని పెంచి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. అంతేగాక జలుబు, దగ్గును నివారిస్తుంది.
20. గణికా పత్రం (కామంచి):
ఈ మొక్క శాస్త్రీయనామం – సోలానం వర్జినియానం. ఇది సొలనెసీ కుటుంబానికి చెందినది. దగ్గు, జ్వరం, తలనొప్పి, అస్తమా, అతి మూత్ర వ్యాధికి ఈ ఆకులు బాగా పనిచేస్తాయి.
21.అర్కపత్రం (జిల్లేడు):
ఈ మొక్క శాస్త్రీయనామం – కెలాట్రోపీస్ జైగాన్షియా. ఈ మొక్క ఆకులను నరాల బలహీనతకి, చర్మ వ్యాధుల నివారణకు వాడతారు.