Prarthana Jagan: ప్రార్థన బ్యూటిఫుల్‌ జర్నీ

Model Prarthana With Vitiligo Shares Inspiring Story - Sakshi

ఆమె చర్మం అక్కడక్కడ తెల్లగా మారింది.. అందరూ ఆమెను ఎగతాళి చేశారు.. ఆరెంజ్‌ ఫేస్‌ అంటూ వెక్కిరించారు.. ఎన్నో నిద్రలేని సంవత్సరాలు గడిపిందామె అయితేనేం.. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగింది. ఇంజినీరింగ్‌ పూర్తి చేసి, డిజిటల్‌ మార్కెటింగ్‌ స్ట్రాటెజిస్టు స్థాయికి ఎదిగిన ఆమె కథనం.

‘ఒక యుక్తవయస్కురాలిగా నేను నా ముఖాన్ని ద్వేషించాను’ అంటున్నారు బెంగళూరుకి చెందిన ప్రముఖ మోడల్‌ ప్రార్థన ఇటీవలే ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ. 22 సంవత్సరాల ప్రార్థన స్కూల్‌లో చదువుకుంటున్న రోజుల్లో ‘ఆరెంజ్‌ ఫేస్‌’ అంటూ తన ముఖం మీద నీళ్లు పోసి, రంగు పోయిందా లేదా అంటూ, తనను ఎగతాళి చేయటం ఇప్పటికీ మర్చిపోలేదు. చిన్నప్పుడు ముఖం మీద ఒక తెల్లమచ్చ కనిపించింది. ఆ తర్వాత ముక్కు వరకు మచ్చలు పెరిగాయి. వెంటనే డాక్టర్‌ దగ్గరకు వెళ్లింది. ఆ డాక్టర్, ‘ఎండలో నిలబడితే అవే తగ్గిపోతాయి’ అన్నారు.

‘‘అయితే ఎండలో నిలబడిన దగ్గర నుంచి మచ్చలు ముఖమంతా వ్యాపించాయి. ‘బాగా దట్టంగా మేకప్‌ వేసుకుంటే మచ్చలు కనిపించవు’ అని కొందరు సలహా ఇచ్చారు. దాంతో తనను అందరూ గుర్తించాలనే ఉద్దేశంతో ముఖానికి పౌడర్, కాంపాక్ట్‌ వంటివి పూసుకునేది. రోజూ ఇందుకోసం సుమారు అరగంట సమయం కేటాయించ వలసి వచ్చేది. రానురాను వాస్తవంలోకి వచ్చి, ఇటువంటి వాటికి దూరంగా ఉండాలనుకుంది. ‘‘నా చర్మాన్ని కప్పుకోవటానికి ఎంతో ఇబ్బంది పడ్డాను. పక్కనే ఉన్న కిరాణా షాపుకి వెళ్లాలన్నా కూడా ముఖానికి మేకప్‌ వేసుకునేదాన్ని. దూర ప్రయాణాలు చేయవలసి వచ్చినప్పుడు ముఖం కప్పుకుని, తెల్లవారకుండానే లేచి, ముఖం కనపడకుండా ఉందో లేదో చూసుకునేదాన్ని’’ అంటుంది ప్రార్థన.

స్నేహితులంతా జాంబీ ఫేస్‌ అనేవారు. బాగా దగ్గరగా ఉన్నవారు కూడా ‘ముసలి’ అని గేలి చేసేవారు. అన్నిటినీ భరిస్తూ, లేజర్‌ థెరపీ చేయించుకుంది. ఈ చికిత్స వల్ల చర్మం కాలి, ఎర్రటి మచ్చలు పడతాయి. ఒకసారి చేసిన చికిత్స వల్ల ముఖమంతా కాలినట్లయిపోయింది. సుమారు ఎనిమిది సంవత్సరాల తరవాత సర్జరీ చేస్తున్న సమయంలో జరిగిన ఒక సంఘటన కారణంగా హాస్పిటల్‌లో మరిన్ని ఎక్కువ రోజులు ఉండవలసి వచ్చింది. అప్పుడు మేకప్‌ లేకుండా ఉంది ప్రార్థన. ‘‘నన్ను ఎవ్వరూ వింతగా చూడలేదు, ఎవ్వరూ ఎగతాళి చేయలేదు.

చాలాకాలం తరవాత నా మనసు ప్రశాంతంగా ఉంది. నా గురించి ఎవరు ఏమనుకుంటారో అనే విషయం గురించి ఆలోచించటం మానేశాను. నా ఆరోగ్యం మీద, నా చర్మం మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టాను’’ చెప్పుకొచ్చింది ప్రార్థన.  2016లో ప్రార్థన తన చర్మాన్ని సెలబ్రేట్‌ చేసుకోవాలన్న నిర్ణయానికి వచ్చింది. ముఖాన్ని బాధించే, ఖర్చుతో కూడిన సర్జరీలకు నో చెప్పేసింది. మోడలింగ్‌ చేయటం ప్రారంభించి, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేస్తూ, తనను సపోర్ట్‌ చేయమని కోరింది. ఇప్పుడు ప్రార్థన డిజిటల్‌ మార్కెటింగ్‌ స్ట్రాటెజిస్ట్‌ కావడమే కాదు, ఇంజినీరింగ్‌లో డిగ్రీ కూడా సాధించింది.  

తరవాత ప్రార్థనలో ఆత్మవిశ్వాసం రెట్టింపయ్యింది. తన మొట్టమొదటి వీడియోను యూ ట్యూట్‌లో అప్‌లోడ్‌ చేసింది. బొల్లి గురించి తన చానెల్‌లో మాట్లాడింది. ఆ తరవాత ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా తన మనసులోని భావాలను నేరుగా పంచుకుంది. తన ఫొటోలను చూపిస్తూ, బొల్లి గురించి అందరికీ అవగాహన కల్పించటం ప్రారంభించింది. ఆమె లాగే అటువంటి బాధలు పడిన చాలామంది తమ భావాలను కూడా పంచుకోవటం ప్రారంభించారు. ‘‘మాలో ఆత్మవిశ్వాసం కలిగించారు’’ అంటూ కామెంట్స్‌ పెడుతున్నారు. తనను నిత్యం ప్రోత్సహిస్తూ, తనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచిన తల్లిదండ్రులకు, స్నేహితులకు ప్రార్థన కృజ్ఞతలు చెబుతోంది. సోషల్‌ మీడియా ద్వారా ఈ వ్యాధితో ఉన్నవారిలో ఉత్సాహం పెరిగేలా పోస్టులు పెడుతోంది. ‘ప్రార్థనలోని ధైర్యాన్ని అభినందించాలి..’ అంటోంది సోషల్‌ మీడియా.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top