ఆ మత్తులో ఏంచేశానో.. 20 ఏళ్లకే హెచ్‌ఐవీ బారినపడ్డా | Mizoram Woman Has Helped Over 10,000 HIV Positive People | Sakshi
Sakshi News home page

ఆ మత్తులో ఏంచేశానో.. 20 ఏళ్లకే హెచ్‌ఐవీ బారినపడ్డా

Apr 28 2021 12:00 AM | Updated on Apr 28 2021 8:02 AM

Mizoram Woman Has Helped Over 10,000 HIV Positive People - Sakshi

ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు తప్పు చేయడం సహజం. అయితే తాము చేసిన తప్పును గ్రహించి సరిదిద్దుకోని భవిష్యత్తును సరికొత్తగా నిర్మించుకునేవారు కొందరే ఉంటారు. ఈ కోవకు చెందిన వారే వాన్‌లాల్‌రువాటీ కోల్ని. మిజోరంకు చెందిన కోల్ని బాల్యంలోనే మత్తుపదార్థాలకు బానిసైంది. ఇరవై ఏళ్లకే హెచ్‌ఐవీ బారిన పడింది. అనేక ఇబ్బందులు ఎదురవ్వడంతో తను ప్రయాణించే మార్గం సరైనది కాదని గ్రహించి తన జీవితాన్ని చక్కదిద్దుకోవడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే తనలా బాధపడుతోన్న వారికి అండగా నిలుస్తూ ఎంతోమందికి ప్రేరణగా నిలుస్తోంది. 

ఐజ్వాల్‌కు చెందిన 37 ఏళ్ల వాన్‌లాల్‌రువాటి కోల్నికి ఎలా అయిందో కానీ చిన్నప్పుడే డ్రగ్స్‌ అలవాటయింది. ఆ మత్తులో తను ఏం చేస్తుందో తనకి తెలిసేది కాదు. ఫలితంగా 20 ఏళ్లకే హెచ్‌ఐవీ బారిన పడడంతో శరీరంపై నొప్పితో కూడుకున్న గుల్లలు వచ్చి వాటి నుంచి చీము కారేది. దీంతో తను చికిత్స తీసుకునే ఆసుపత్రి సిబ్బంది ఆమె దగ్గరకు రావడానికి కూడా వెనకాడేవారు. ఒకపక్క శారీరక బాధ, మరోపక్క సమాజం చూపే చీదరింపులు తనని మానసికంగా కుంగదీశాయి. ఎలాగైనా ఈ పరిస్థితి నుంచి బయటపడాలనుకుంది కోల్ని.

పాజిటివ్‌ ఉమెన్స్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ మిజోరం
మారాలనుకున్న వెంటనే... డ్రగ్స్‌ తీసుకోవడం మానేసి ఇంటికి దగ్గర్లో ఉన్న ప్రార్థనామందిరానికి వెళ్లడం ప్రారంభించింది. వాళ్ల బోధలతో తనని తాను మానసికంగా దృఢపరచుకుంది. సమాజంలో ఛీత్కారానికి గురవుతోన్న హెచ్‌ఐవీ రోగులను ఆదుకోవాలనుకుంది. ఈ క్రమంలోనే 2007లో ‘పాజిటివ్‌ ఉమెన్స్‌ నెట్‌వర్క్‌ ఆఫ్‌ మిజోరం’(పీడబ్ల్యూన్‌ఎమ్‌) పేరిట సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ ద్వారా హెచ్‌ఐవీతో బాధపడుతోన్న మహిళలను ఒక చోటకు చేర్చి వారిని మానసికంగా, ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రోత్సహించడం ప్రారంభించింది. హెచ్‌ఐవీ రోగుల హక్కులు కాపాడడం, వైద్యసాయం, పునరావాసం ఏర్పాటు చేయడం, వారికి ప్రభుత్వం అందిస్తోన్న పథకాలను అనుసంధానించడం, వివిధ రకాల వొకేషనల్‌ కోర్సుల్లో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం...ఇలా ఇప్పటి వరకు ఆమె సంస్థ ద్వారా సుమారు పదివేలమందికి పైగా లబ్ధి పొందారు.

కోవిడ్‌–19 మహమ్మారి విజృంభిస్తోన్న తరుణంలోనూ ఎన్జీవో గూంజ్, యూఎన్‌ ఎయిడ్స్‌ సంస్థలతో కలిసి డ్రగ్స్‌ వ్యసనపరులను ఆదుకునేందుకు కృషిచేస్తున్నారు. సమాజంలో ఎదురైన అనేక చీత్కారాలను దాటుకోని నిబద్ధతతో తన పీడబ్ల్యూఎన్‌ఎమ్‌ సంస్థను ముందుకు నడిపిస్తోన్న కోల్నికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. 2019లో హెల్త్‌ కేటగిరీలో ‘ఉమెన్‌ ఎక్సెంప్లార్‌ అవార్డు ఆమెను వరించింది. ‘‘ప్రస్తుత కరోనా మహమ్మారి విజృంభిస్తోన్న ఈ సమయంలోనూ సరైన జాగ్రత్తలు పాటిస్తూ మా పరిధిలో చేయగలిగిన సాయం చేస్తున్నాం. గత 18 ఏళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ, ఎన్నో నేర్చుకున్నాను. ఈ అనుభవాలే నన్ను ముందుకు నడిపిస్తున్నాయి’’ అని కోల్ని చెప్పింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement