అనగనగా ఒక అడవి. ఆ అడవికి సింహం రాజు. తోటి ప్రాణులను అది హీనంగా చూసేది. ఒకనాడు ఆ సింహం నీళ్లు తాగడానికి వాగు దగ్గరకు వెళ్ళింది. అదే సమయానికి అక్కడికి ఒక ఏనుగు వచ్చింది.సింహం ఏనుగును చూసి గర్జిస్తూ ఇలా అంది, ‘ఓయ్ ఏనుగు! ఈ రోజు పొట్ట నిండా అరటిపండ్లు తిన్నట్లు ఉన్నావు కదా?’ఏనుగు ప్రశాంతంగా, ‘అవును రాజా, నా ఆకలి తీర్చుకున్నాను’ అని బదులిచ్చింది.అప్పుడు సింహం అధికారాన్ని ప్రదర్శిస్తూ, ‘విను! రేపటి నుండి నువ్వు ఆహారం తినే ముందు రెండు గెలల అరటిపండ్లను నా గుహలో పెట్టాలి. ఆ తర్వాతే నువ్వు ముట్టాలి, అర్థమైందా?’ అని గర్జించింది.ఏనుగు ఏమాత్రం తడబడకుండా, ‘క్షమించు రాజా! నేను నీకు సేవకుడిని కాదు.
నీ ఆజ్ఞలు పాటించడానికి నేను సిద్ధంగా లేను’ అని చెప్పింది.సింహం కోపంతో కళ్లెర్రజేసింది. ఏనుగు భయపడకుండా, ‘నీవు అడవికి రాజువు మాత్రమే, యజమానివి కాదు అని గుర్తుంచుకో! నీ అంత శక్తి నాకూ ఉంది.’ అంది.ఏనుగు అలా సమాధానం చెప్పేసరికి, సింహం అవమానంతో వెనుదిరిగింది. దారిలో ఒక ఎలుగుబంటి తేనె తాగుతూ కనిపించింది.సింహం ఎలుగుబంటి దగ్గరకు వెళ్లి, ‘ఒరేయ్ ఎలుగుబంటి! రేపటి నుండి నువ్వు సంపాదించే తేనెలో రెండు పెద్ద పట్టులు నా గుహలో సమర్పించాలి’ అని ఆజ్ఞాపించింది.ఎలుగుబంటి నవ్వుతూ, ‘రాజా! తేనెటీగలతో కుట్టించుకుని, ప్రాణాలకు తెగించి తెచ్చుకునే నా కష్టార్జితాన్ని నీకు ఎందుకు ఇవ్వాలి?’ అని ప్రశ్నించింది.
సింహం ఆశ్చర్యపోతూ ఉండగా, ఎలుగుబంటి మళ్ళీ ఇలా అంది: ‘కష్టపడి సంపాదించేది మేము, కూర్చుని తినేది నువ్వా? ఇది న్యాయం కాదు. నేను నీ సేవకుడిని కాను.’మరోసారి పరాభవం ఎదురవడంతో సింహం ముందుకు సాగింది. ఒక చెట్టు మీద మామిడి పండ్లు తింటున్న కోతి దానికి కనిపించింది.సింహం కోతిని చూసి, ‘ఓయ్ కోతి! రేపటి నుండి రెండు బుట్టల మామిడి పండ్లను నా గుహలో పెట్టాలి. నేను తిన్నాకే నువ్వు తినాలి’ అని çహూంకరించింది.కోతి కిచకిచ నవ్వుతూ, ‘రాజా! నీ గర్జనలకు భయపడే కాలం పోయింది. మేము గౌరవించేది నీ పదవిని మాత్రమే, నీ గర్వాన్ని కాదు’ అని చెప్పింది.
కోతి ఇంకా ఇలా అంది: ‘మేము నిన్ను రాజుగా చూస్తున్నాము కాని, నీకు దాసోహం అనడం లేదు. కష్టపడి సంపాదించుకున్న ఆహారాన్ని ఎవరికీ ఊరికే ఇచ్చే ప్రసక్తే లేదు.’సింహం తన గుహకు వెళ్లి దీర్ఘంగా ఆలోచించసాగింది.‘ఏనుగు ధిక్కారం, ఎలుగుబంటి నిజాయితీ, కోతి చెప్పిన హితవు అన్నీ నిజమే కదా!’ అని మనసులో అనుకుంది.తన గర్వం వల్లే అందరూ తనను వ్యతిరేకిస్తున్నారని గ్రహించింది. ప్రేమతో సాధించలేనిది ఏదీ లేదని దానికి అర్థమైంది.మరుసటి రోజు నుండి సింహం ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. అడవిలో ఏ ప్రాణి కనిపించినా ఎంతో ఆప్యాయంగా పలకరించడం మొదలుపెట్టింది.
ఒక కుందేలును చూసి సింహం, ‘ఏమ్మా! బాగున్నావా? నీకు ఏమైనా సహాయం కావాలా?’ అని ప్రేమగా అడిగింది.సింహంలోని ఈ మార్పు చూసి అడవిలోని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి. క్రమంగా అవి మళ్ళీ రాజు దగ్గరకు చేరడం ప్రారంభించాయి.ఏనుగు వచ్చి, ‘రాజా! నీలోని ఈ మార్పు మాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది’ అని పొగిడింది.ఎలుగుబంటి కూడా వచ్చి, ‘నిజమైన రాజువంటే నువ్వే రాజా! ఇప్పుడు నిన్ను మనస్ఫూర్తిగా గౌరవిస్తున్నాము’ అని అంది.అప్పటి నుండి సింహం ఎవరినీ ఆహారం అడగలేదు, ఎవరినీ తక్కువ చేసి చూడలేదు. అడవిలోని జీవులన్నీ సింహాన్ని నిజమైన మృగరాజుగా కీర్తించాయి.
అల్పతోయశ్చలత్కుంభో అల్పదుగ్ధాశ్చ ధేనవఃఅల్పవిద్యో మహాగర్వీ కురూపీ బహుచేష్టితఃనీళ్లు తక్కువున్న కుండ తొణుకుతుంది. కొత్తగా ఈనిన ఆవు తక్కువ పాలిస్తుంది. చదువు తక్కువున్న వాడికి గర్వం ఎక్కువగా ఉంటుంది. కురూపికి అతిచేష్టలు ఎక్కువగా ఉంటాయి.


