ఉమెన్‌–ఓన్లీ: స్టార్‌ ట్రావెలర్‌

Kerala women Sajna Ali Starts Women-only travel group - Sakshi

‘ప్రయాణం అంటే కొత్త ప్రదేశానికి వెళ్లి సెల్ఫీ దిగడం కాదు. మనలోకి మనం ప్రయాణించడం. కొత్త వెలుగుతో తిరిగి రావడం. కొత్తగా జీవించడం’ అంటున్న సజ్నా అలి ‘ఉమెన్‌–ఓన్లీ ట్రావెల్‌ గ్రూప్‌’తో గెలుపు జెండా ఎగిరేసింది. రెండు ఊళ్లు దాటి బయటికి వెళ్లని మహిళలకు కూడా ప్రయాణాలలో ఉండే మజాను పరిచయం చేసింది. వారిని ప్రయాణ ప్రేమికులుగా మార్చింది....

సజ్నా అలి (తిరువనంతపురం, కేరళ)కి ప్రయాణం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే తను చేస్తున్న ఉద్యోగాన్ని వదిలి ట్రావెల్‌ ఏజెన్సీని మొదలు పెట్టేలా చేసింది. గతంలోకి వెళితే... సజ్నా నాన్న ట్రక్‌డ్రైవర్‌. తన వృత్తిలో భాగంగా ఎన్నో ఊళ్లు, ప్రదేశాలు తిరిగేవాడు. తాను చూసిన విశేషాలను రాత్రి పడుకునే ముందు పిల్లలకు కథలుగా చెప్పేవాడు. ఇక అప్పటి నుంచి మొదలైన ఆసక్తి తనతోపాటు ప్రయాణిస్తూనే ఉంది.

‘ఈ ప్రపంచం అంతా చుట్టి రావాలి’ అనే ఒక లక్ష్యాన్ని అయితే నిర్దేశించుకుంది గానీ, ఆర్థికపరిమితుల వల్ల అది సాధ్యం కాక ఒక్క దేశాన్ని కూడా చూడలేకపోయింది.
తిరువనంతపురం టెక్నోపార్క్‌లో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో తన మనసంతా ప్రయాణాల చుట్టే తిరిగేది.  దీంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ‘ఉమెన్‌–వోన్లీ ట్రావెల్‌ గ్రూప్‌’కు శ్రీకారం చుట్టింది.
‘ఇదేం చోద్యమమ్మా’ అన్నారు చాలామంది.

‘బంగారంలాంటి ఉద్యోగాన్ని వదిలి ట్రావెల్‌ ఏజెన్సీ నడపాలనుకోవడం తెలివైన పని కాదు’ అన్నారు.
‘ట్రావెల్‌ ఏజెన్సీ రంగంలో మహిళలు విజయం సాధించలేరు’ అని నిరాశ పరిచారు.

కట్‌ చేస్తే...
సజ్నా ట్రావెల్‌ ఏజెన్సీ కేరళలో అగ్రస్థానంలో ఉంది. తమ ట్రావెల్‌ ప్లాన్స్, ప్రత్యేకతలను ప్రచారం చేయడానికి సోషల్‌ మీడియా నెట్‌వర్క్‌ను సమర్థవంతంగా వాడుకుంటుంది సజ్నా. 22 వాట్సాప్‌ గ్రూప్‌లకు తాను అడ్మినిస్ట్రేటర్‌.

‘నా యాభై ఏళ్ల జీవితంలో విందువినోదాలు, ఇతర శుభకార్యాలకు పక్కఊళ్లకు వెళ్లడం తప్ప, జిల్లా దాటింది లేదు. సోషల్‌ మీడియాలో సజ్నా పోస్ట్‌లు ఆసక్తి కలిగించేవి. అలా నాకు ప్రయాణాలపై ఆసక్తి మొదలైంది. తొలిసారిగా సోలో ట్రావెల్‌ చేసినప్పుడు ఎంత గర్వంగా అనిపించిందో మాటల్లో చెప్పలేను. ఆ ప్రయాణం నాలో ఆత్మవిశ్వాసాన్ని పెంచింది’ అంటుంది చందన.

ఇప్పటివరకు సజ్నా ట్రావెల్‌ గ్రూప్‌ తరపున వందలాది మంది మహిళలు దేశంలోని వివిధ ప్రాంతాలకు ట్రావెల్‌ చేశారు. ఈ సంవత్సరం చివరిలోపు ట్రావెల్‌ ఏజెన్సీ 400 ట్రిప్‌ మైలురాయిని చేరుకోనుంది.

‘సంవత్సరం తిరక్కుండానే మీ ట్రావెల్‌ కంపెనీ మూత పడుతుంది... లాంటి మాటలను పట్టించుకోలేదు. నాపై నాకు ఉన్న నమ్మకమే తిరుగులేని విజయానికి కారణం అయింది. దీనిద్వారా ఎంతోమంది మహిళలు ఈ రంగంలోకి రావడానికి ఉపకరిస్తుంది’ అంటుంది సజ్నా.

‘మా ప్రథమ ప్రాధాన్యత మహిళా ట్రావెలర్స్‌ భద్రత. ఈ విషయంలో రాజీపడం’ అని చెబుతున్న సజ్నా రకరకాల సేఫ్టీ యాప్‌లను సమకూర్చుకోవడంతో పాటు ఆత్మ–రక్షణ పరికరాలను కూడా ట్రావెలర్స్‌కు అందిస్తుంది.

బడ్జెట్‌–ట్రిప్స్‌కు ప్రాధాన్యత ఇస్తుంది. ప్రోగ్రామ్స్‌ ఆర్గనైజ్‌ చేయడానికి ముందు ఆ ప్రదేశాలకు స్వయంగా వెళ్లి పరిశీలించి రావడం సజ్నా అలవాటు. దీని ద్వారా ప్రయాణికులకు ఏవిధమైన ఇబ్బందులూ తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నట్లు అవుతుంది.

‘మనవంతుగా సమాజానికి ఇవ్వాలి’ అనే ఆదర్శ భావనతో ‘గివ్‌–బ్యాక్‌–టు–ది–కమ్యూనిటీ’ట్రిప్‌కు స్వీకారం చుట్టింది. ఇది ప్రయాణమే కాని సేవాప్రయాణం. ఇందులోని సభ్యులు వివిధ ప్రాంతాలకు వెళ్లి అట్టడుగు వర్గాల ప్రజలకు లాంగ్వేజ్‌ స్కిల్స్‌ నుంచి లైఫ్‌స్కిల్స్‌ వరకు ఎన్నో నేర్పిస్తారు. సేవాకార్యక్రమాల్లో పాల్గొంటారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top