కర్ర పెత్తనాన్ని కళ్ళకు కట్టించినవాడు! | Jorge Mario Pedro Vargas Llosa Life Story Funday Special Story | Sakshi
Sakshi News home page

కర్ర పెత్తనాన్ని కళ్ళకు కట్టించినవాడు!

Jun 14 2026 9:16 AM | Updated on Jun 14 2026 9:16 AM

Jorge Mario Pedro Vargas Llosa Life Story Funday Special Story

 లిట్‌వరల్డ్‌

హొర్హే మార్యో పెద్రో వర్గస్‌ లోజా

నియంతృత్వ వ్యవస్థ స్వరూప స్వభావాలను కళ్ళకు కట్టించిన రీతికీ, పట్టెడుమంది యువకులు ఈ వ్యవస్థలపై తిరగబడి, తరిమికొట్టిన తీరును చిత్రించిన పద్ధతికీ, హొర్హే మార్యో పెద్రో వర్గస్‌ లోజా నోబెల్‌ సాహిత్య పురస్కారం గెల్చుకున్నార’ని స్వీడిష్‌ ఎకాడెమీ ప్రతినిధి 2010లో ప్రకటించారు. లోజా పెరూవియన్‌ జాతీయుడు. 1960–’70 దశకాల్లో దక్షిణ అమెరికాలో ఉవ్వెత్తున ఎగసిపడిన తిరుగుబాట్ల వెల్లువను ‘లాటిన్‌ బూమ్‌’ అంటారు. దానికి ప్రతీక ప్రాయులైన రచయితల్లో లోజా ఒకరు. ప్రపంచ ప్రసిద్ధ కొలంబియన్‌ రచయిత గాబ్రియల్‌ గార్షియా మార్క్వెజ్, మెక్సికన్‌ రచయిత కార్లో ఫ్వెంటి, అర్జెంటీన్‌ రచయిత హూలియో కొర్తజార్‌ తదితరులపై కూడా ‘లాటిన్‌ బూమ్‌’ ప్రభావం గాఢంగా పడింది. వారి సహచరుడే లోజా కూడా!

1959 నాటి క్యూబా విప్లవం– ఒక అర్థంలో– ‘లాటిన్‌ బూమ్‌’ క్రమానికి మినహాయింపు లాంటిది. 1973లో చిలీ అధ్యక్షుడు సాల్వడార్‌ అయాండే (అలెండీ) హత్య సంఘటన ఇదే క్రమానికి– మరో అర్థంలో– మినహాయింపు లాంటిది. అయాండే హత్యతో, చిలీ ప్రజాతంత్ర విప్లవం విఫలమైన సంగతి ప్రపంచ చరిత్ర ఓనమాలు తెలిసిన వారికి తెలిసిన విషయమే! అయినప్పటికీ, ‘లాటిన్‌ బూమ్‌’ క్రమం క్యూబా విప్లవంతోనే మొదలైందని చెప్పాలి. మరుసటి సంవత్సరం నుంచే అర్జెంటీనా, బ్రెజిల్, చిలీ, పరాగ్వే, పెరూ తదితర దేశాల్లో వరసగా తిరుగుబాట్ల వెల్లువ పెల్లుబికింది. దానికే జర్నలిస్టులు ‘లాటిన్‌ బూమ్‌’ అని పేరుపెట్టారు. ఈ వెల్లువ పెల్లుబికే నాటికి లోజా వయసు గట్టిగా పాతికేళ్ళు కూడా ఉండవేమో! బహుశా అందుకే అతనిపై ‘లాటిన్‌ బూమ్‌’ ప్రభావం అంత అపారంగా పడడానికి అదే కారణమేమో.

మార్యో లోజా తొలి నవల ‘నగరంలో కాట్లకుక్కలు.’ దాన్ని మన అనువాద బ్రహ్మలు (అనగా, అనువాదకులు!) ‘వీరుని యుగం’ (ది టైమ్‌ ఆఫ్‌ ది హీరో) పేరిట ఆంగ్ల పాఠకులకు పరిచయం చేశారు. ప్రయోగాత్మక రీతిలో రాసిన ఈ నవల రాతప్రతిగా వుండగానే, 1962లో గ్రంథాలయ పురస్కారాన్ని అందుకుంది. మరుసటి సంవత్సరమే ఈ రచనకు విమర్శకుల ప్రశంస పురస్కారం కూడా దక్కింది. అంతాచేసి, అప్పటికి లోజా వయసు 27! పెరూలోని ప్రతిష్ఠాత్మకమైన సైనిక పాఠశాలలో  నెలకొని వున్న స్థితిగతుల గురించి రాసిన నవల అది.

1950 దశకంలో లోజా ఆ పాఠశాలలో చదివి వున్నందున అక్కడి పరిస్థితులు అతనికి కొట్టిన పిండి. నవల పొడుగునా ఈ విషయం కొట్టొచ్చినట్లు కనిపిస్తూనే వుంటుంది. మాట నెగ్గించుకోవడం కోసం తోటివారి పైన పెత్తనం చెలాయించే సంస్కృతి– తెగువ పేరిట దేనికైనా తెగించే సంస్కృతి– మగటిమి పేరిట పురుషాహంకార సంస్కృతి– ఆనాటి పెరూ సమాజంలో పాతుకుపోయిన ‘విలువలు.’ ఆ ఆవు చేలో మేస్తుంటే సైనిక పాఠశాల దూడ గట్టున మేస్తుందా? ఈ పోకిరీ పోకడలకు మెతగ్గా వుండే మధ్యతరగతి విద్యార్థులు ఎలా బలైపోతారో చిత్రించడం ద్వారా ఆ ‘విలువల’ను ప్రశ్నించారు లోజా. అందుకే ‘తప్పనిసరిగా చదవాల్సిన రచనల జాబితా’లో లోజా తొలి నవలే స్థానం సంపాదించుకో గలిగింది! నిజానికి ఆయన రచనలన్నింటా ఇదే ప్రశ్న అలముకుని వుంటుంది.

1981లో, లోజా రాసిన ‘విలయ సమరం’అనే నవల ఆయన ప్రసిద్ధ రచనల్లో మరొకటి. బెజిల్‌ చరిత్రలో ‘కేనండో(స్‌) యుద్ధం’గా ప్రచురితమైన చారిత్రక సంఘటనే ఈ నవల ఇతివృత్తానికి మూలం. బ్రెజిల్‌లోని బహైయాలో జరిగిన యుద్ధమది. అంతోనియా కాన్సలైరో అనే చారిత్రక వ్యక్తి ఈ నవలకు కథానాయకుడు అంటారు– కానీ, బ్రెజిల్‌ రిపబ్లికన్‌ సైన్యం ఊచకోతను ప్రతిఘటించిన ప్రజలే ఈ నవలకు కథానాయకులు. ప్రజల అవసరాలను పట్టించుకోని ప్రభుత్వాలపై తిరగబడిన సామాన్యుల వీరగాథ ఇది. రాచరికం వకాల్తా తీసుకున్న అంతోనియో గానీ, అతన్ని విధేయంగా అనుసరించిన ప్రజలు కానీ, ఏటికి ఎదురీదిన వాళ్ళే. అందుకే, అన్ని యుద్ధాల తర్వాత కూడా రిపబ్లికన్‌ సైన్యమే గెలిచి నిరాయుధులైన ప్రజలనూ, ప్రజానాయకులనూ ఊచకోత కోశారు. ఈ కథను చరిత్రలో పదిమందికీ గుర్తుండేలా నమోదు చెయ్యడం బాధ్యత కలిగిన రచయిత కర్తవ్యం! బహుశా అందుకేనేమో, జయప్రదమైన తన రచనల్లో ‘విలయ సమరం’ ఒకటన్నారు లోజా.

లోజా నవలలన్నింటిలోకీ సుప్రసిద్ధమైనది ‘చీంబోతు విందు.’ 1950 దశకంలో డొమినికన్‌ రిపబ్లిక్‌ లో 31 యేళ్ళ పాటు నిరంకుశ రాజ్యం నడిపించిన రఫాయెల్‌ ట్రూహియో హత్యే ఈ నవల ఇతివృత్తం. ట్రూహియోను డొమినికన్లు ‘ఎల్‌ హెఫె’ అని పిల్చుకునేవారు– ఆ మాటకు ‘బాస్‌– దొరగారు’ అని అర్థం. ట్రూహియో కర్రపెత్తనం సాగిన కాలంలో పాతిక వేల నుంచి యాభై వేలమంది బలైవుంటారని చెప్తారు. ఒక్క పార్సీ›్ల ఊచకోత సంఘటనలోనే ట్రూహియో సైన్యం 17 వేలమందిని  హతమార్చింది. ‘వెయ్యి గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు కూలింద’న్నట్లుగా 1961 మే 30న ట్రూహియో ఓ కుట్రకు బలయ్యాడు! చారిత్రక సమాచారాన్నీ, కాల్పనిక సంఘటనలనూ, వాస్తవ వ్యక్తుల కథలనూ ముప్పేటగా అల్లిన కథనం పాఠకులను ఆకట్టుకుంది.

లోజాతో సహా లాటిన్‌ బూమ్‌ రచయితలు అంతర్జాతీయ ఖ్యాతి పొందడానికి రాజకీయ– సామాజిక అంశాలే కారణమని అమెరికన్‌ చరిత్రకారుడు ఫ్రెడరిక్‌ నన్‌ వ్యాఖ్యానించారు. ఇలాంటి యాంత్రిక సరళీకరణ – రిడక్షనిజం అనిపించుకుంటుందే తప్ప హేతుబద్ధ విశ్లేషణ అనిపించుకోదు! ఈ తరహా సూత్రీకరణల వల్ల కళ మాత్రమే నష్టపోతుంది తప్ప వ్యక్తులకే నష్టం జరగదని గుర్తించడం మంచిది!! - మందలపర్తి కిషోర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement