అత్యంత ఖరీదైన పుస్తకం: విశ్వ జనుల విశ్వశాంతి గీతమే ‘An Invaluable Invocation’

An Invaluable Invocation: That Book Worth Rs5 Crores  - Sakshi

సృజనాత్మక రంగం, తనకు సంబంధించిన అంశాలలో సరికొత్త విజయాలు సాధిస్తూ, అనేక అంతర్జాతీయ అవార్డులు సాధించిన డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి తెలుగు రాష్ట్రాలలో పరిచయం అవసరం లేని ఆంగ్లాచార్యులు, కవి, రచయిత. 2010 లో ఇంగ్లిష్ జాతీయాలు, సామెతలపై ఆయన రాసిన 'హ్యాండీ క్రిస్టల్స్...’ అనే పుస్తకాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డు వరించింది. జాతీయసేవ, మానవీయ నైపుణ్యాల విభాగాల్లో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హోల్డర్గా ఆయన కీర్తి పొందారు. ఆంగ్ల భాషకు సంబంధించి ఆసియా, లిమ్కా, ఇండియా, తెలుగు బుక్ రికార్డులు ఎప్పుడో ఆయనను అలంకరించాయి.

ఇన్ని ఘనతలు సొంతం చేసుకున్న శ్రీనాథాచారి ఇప్పుడు ఓ అద్వితీయ సామాజిక కార్యక్రమాన్ని తలపెట్టారు. రికార్డులకోసం కాకుండా, వసుధైవ కుటుంబ భావనను విశ్వవ్యాప్తం చేయడంతో పాటు ప్రపంచ శాంతి ఆవశ్యకతను ఎలుగెత్తి చాటడం కోసం 'ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్' పేరుతో ఓ మానవీయ మహాకావ్యాన్ని ఆవిష్కరించారు. ‘హ్యుమానిటీ ఎక్స్ పెరిమెంట్’ అనే వినూత్న భావనతో రూపుదిద్దిన ఈ మహాకావ్యం ద్వారా వచ్చే ప్రయోజనం మొత్తాన్ని సమాజానికే ధారాదత్తం చేస్తానని ప్రకటించడం ఎందరికో స్ఫూర్తిదాయకం.

డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ఇంగ్లిష్ లో పీహెచ్డీ చేసి, పాలమూరు విశ్వవిద్యాలయంలో ఆంగ్ల విభాగంలో సహాయ ఆచార్యులుగా నియమితులై, అదనపు పరీక్షల నియంత్రణాధికారిగా, క్యాంపస్ కళాశాల ప్రిన్సిపాల్గా, ఆంగ్ల విభాగాధిపతిగా వివిధ హోదాలలో సమర్థవంతంగా సేవలందించారు. అలాగే ఆయన సైకాలజీ, బిజినెస్ మేనేజ్ మెంట్ లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులు అభ్యసించారు. 'ఫర్సేక్ మీ నాట్' అనే టైటిల్ తో డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ఆంగ్లంలో ఓ కవితా సంపుటి వెలువరించారు. అది అమెజాన్ ఆన్ లైన్ లో ‘ఈ-బుక్’ గా అందుబాటులో ఉంది. ఆంగ్లంలో ఆయన రాసిన కవితలు ఎన్నో పత్రికలలో అచ్చయ్యాయి. ప్రస్తుతం ఆంగ్లభాష, వ్యక్తిత్వ వికాసం, మానవీయ నైపుణ్యాల శిక్షకులుగా, ‘ఫ్రీలాన్స్' సేవలు అందిస్తూ పలు విద్యా సంస్థలు, ఐటీ సంస్థల్లో ప్రభావవంతమైన ప్రేరణ తరగతులు నిర్వహిస్తున్నారు.

ప్రపంచ సాహిత్యంలోనే ఎప్పటికీ నిలిచిపోయేలా డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి ఇటీవల 'ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్' ( An Invaluable Invocation ) పేరుతో ఆంగ్లంలో ఓ సంబోధనాత్మక భావగీతాన్ని రచించారు. విశ్వ శాంతి-ప్రపంచ దేశాల సమన్వయం తక్షణ అవసరమనే ఇతివృత్తం తీసుకొని సాహితీ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా ఓ సుదీర్ఘమైన ‘ఓడ్’ (సంబోధనాత్మక భావగీతం) ఈ విశ్వానికందించారు. ఈ శాంతిగీతం ఆంగ్ల సాహిత్యంలోనే అత్యంత సుదీర్ఘ భావగీతం కావడం విశేషం. ఇలాంటి భావగీతాన్ని ప్రపంచ సాహిత్యంలోనే ఇప్పటివరకు ఏ ఒక్కరూ రాయలేదు. దైవం, దైవస్వరూపులైన మానవాళిని అత్యంత ఆర్ద్రతతో ప్రార్థిస్తూ, ‘ఈ ప్రపంచాన్ని భూతలస్వర్గంగా మార్చుకోవాల్సిన బాధ్యత మనదే, దానికి ఈ భూమిపై ఉండే ప్రతిఒక్కరమూ సమర్థులమే, అందుచేత మనమంతా బృందంగా ఏర్పడి ఓ వసుధైవ కుటుంబాన్ని నిర్మించుకుందాం, అందరూ కదలిరండి’ అనే పిలుపుతో సమస్త విశ్వజనులకు కవి ఇచ్చిన శాంతి మంత్రమే ఈ భావగీతం.

ఆ డబ్బును కూడా సమాజ సేవకే
ప్రపంచ దేశాల్లో కోట్ల సంఖ్యలో నిస్సహాయ స్థితిలో అభాగ్యులుగా ఉన్న సామాన్య ప్రజల ధర్మాగ్రహ ఆవేదనే ఈ ఆధునిక పద్యకావ్యం! సామాన్య మానవుని ఆవేదన, ఆవేశం, ఆగ్రహం, ఆక్రందనలను అత్యంత వినయ విధేయతలతో ఆలపించే అద్వితీయ శాంతిగీతం ‘ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్’. కవి తన విశ్వశాంతి భావనను అక్షర శిల్పిగా చెక్కడం ఒక ఎత్తైతే, ఆ అక్షరాల వెనుకనున్న భావనను చిత్రకారుడు మహేశ్ తన గీతల్లో సజీవంగా చిత్రీకరించడం మరో ఎత్తు. ఈ మహాకావ్యం ద్వారా వచ్చే నూరు శాతం డబ్బును తిరిగి సమాజ ప్రయోజనాలకే అందజేయడం జరుగుతుంది కాబట్టి, దాని ధరను కూడా ప్రపంచ స్థాయిలోనే నిర్ణయించారు కవి.

ఈ ఏకైక ప్రతి ధర రూ. 5 కోట్లు. దీన్ని అమ్మడం ద్వారా వచ్చే మొత్తంలో 50 శాతం ఐక్యరాజ్యసమితికి, 25 శాతం భారతదేశానికి, 25 శాతం తెలంగాణ రాష్ట్రానికి లోకోపకార కార్యక్రమాలకు వినియోగించేలా అందజేయడమనేది ఈ పుస్తకం ప్రత్యేకతలలోనే మరింత ప్రత్యేకమైనది. ఐక్యరాజ్యసమితి దినోత్సవం (24-10-2023) నాడు ఈ పుస్తకాన్ని ఆయన హైదరాబాద్లో తల్లిదండ్రులు, గురువులు, ప్రముఖులు, మేధావుల చేతుల మీదుగా ఆవిష్కరింపజేసి ఐక్యరాజ్యసమితికి అంకితం చేయడం వంటి అంశాలన్నీ ఈ పుస్తకం విశిష్టతలను తెలియజేస్తున్నాయి. ఈ భావగీత రచన నిర్మాణ క్రమాన్ని పరిశీలిస్తే, రామాయణం కాండలుగా, మహాభారతం పర్వాలుగా రచించినట్టు, ఈ మహా కావ్యాన్ని కవి పది కాంటో (Canto) లుగా విభజించారు.


(కవి డాక్టర్ శ్రీనాథాచారి తల్లిదండ్రులు శ్రీమతి నీలావతమ్మ, శ్రీ రామానుజాచారి)

 

ఈ పది కాంటోలు వరుసగా శాంతి పీఠిక, ప్రార్థన, మానవజాతి-ఐక్యత, దుఃఖమయ ప్రపంచం, ప్రపంచ శాంతి- ఐక్యత, ఐక్య రాజ్యాలు-ఐక్య కార్యాచరణ, భూమాత పరిరక్షణ, మానవ శక్తిసామర్థ్యాల గుర్తింపు, అంతిమ పద్యకృతి-ప్రపంచ శాంతి ప్రయాణ సారాంశం, కృతజ్ఞతాంజలి. ఈ పది కాంటోలు మొత్తం 237 ఉపశీర్షికలతో విశ్వ శాంతి- సమన్వయం ప్రాధాన్యతను నొక్కి చెప్పే స్వతంత్ర పద్యాలుగా తీర్చిదిద్దారు కవి. ఈ కావ్య రచనలో కవి పాటించిన సాహితీ నియమాలు, కచ్చితత్వం అత్యంత ప్రశంసనీయం. ఐక్యరాజ్యసమితిలో ఉన్న 193 సభ్య దేశాలు, 2 సభ్యేతర దేశాలు మొత్తంగా 195 దేశాలకు సంబంధించి ‘ఐక్య రాజ్యాలు-ఐక్య కార్యాచరణ’ పేరుతో ఉన్న సుదీర్ఘమైన కాంటో ఈ కావ్యానికే ప్రత్యేకం. ప్రతి దేశానికి ఆరు పంక్తులు కేటాయించి, వాటి పక్కనే ఆ దేశ జాతీయ జెండా ముద్రించి కవి తన పరిశోధనాత్మక సామర్థ్యాలు ఎంతో ప్రశంసనీయంగా నిరూపించుకున్నారు.

మొదటి రెండు పంక్తులు ఆ దేశ గతవైభవం, తర్వాతి రెండు పంక్తులు కవి ఈ పుస్తకాన్ని రాసే సమయంలో తన పరిశోధనలో తేలిన ఆ దేశంలోని ఒకటి లేదా రెండు ప్రధాన సమస్యలు, చిట్టచివరి రెండు పంక్తులు ఆ సమస్యలకు పరిష్కార మార్గాలను ప్రామాణిక పద్ధతిలో సూచించడం కవి ప్రతిభాపాటవాలకు నిదర్శనం. ఈ మహాకావ్యంలో కవి ఏయే సమస్యలు ప్రస్తావించారని ప్రశ్నించే బదులు ఏయే సమస్యలు ప్రస్తావించలేదని ప్రశ్నించుకోవాలి.

యద్ధం, నిరుద్యోగం, ఆకలి, అవినీతి, పేదరికం, తీవ్రవాదం, ఆహార భద్రత, ఆర్థిక అసమానత, లింగ వివక్ష, ప్రభుత్వ ధర్మాలు, పర్యావరణ విపత్తులు, చిన్నబోతున్న చిన్నారుల బాల్యం, వ్యధతో నిండిన వృద్ధుల జీవనం, భూమాత పరిరక్షణ, సామాజిక పతనం, మానసిక సంఘర్షణలు, సాంకేతిక వ్యసనాలు, యువత తీరుతెన్నులు, జీవకారుణ్యం,... ఇలా మానవాళి ఎదుర్కొంటున్న సమకాలీన సమస్యలకు అద్దం పట్టి, వాటికి పరిష్కార మార్గాలతో కూడిన కార్యాచరణ తయారుచేసి, దాని అమలుకై ‘కడలి రండి విశ్వ శాంతికి చైతన్యవంతులై, క్రియాశూరులై, కార్యసాధకులై...’ అంటూ విశ్వజనులకు కవి ఇచ్చిన ఘనమైన పిలుపే ఈ పద్యకావ్యం. భూమిపై ఉన్న ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచాన్ని ఓ భూతల స్వర్గంగా, శాంతిసౌధంగా మార్చగల సమర్థులు.

కావలసిందల్లా సమాజాన్ని ప్రేమించాలనే దృక్పథం, సహృదయం. ఇది ఏమాత్రం ఖర్చుతో కూడుకున్నది కానేకాదు. ఎవరికి వారు తమదగ్గర ఉన్నది పంచితే చాలు. లేనిది ఇవ్వాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ప్రపంచ శాంతి, సామరస్యం పట్ల మక్కువ ఉన్న కవిత్వ ప్రియులు, పండితులతో పాటు ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరినీ చైతన్యవంతులుగా, కార్యదక్షులుగా ప్రేరేపించే ఓ విశిష్ట సాహితీ కళాఖండమే 'ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్'. ఈ శాంతి గీత రూపకల్పన కవికి ముప్పై సంవత్సరాల కల. అంతేకాదు, మూడేళ్ల కఠోర రచనా పరిశ్రమ వల్లనే ఈ కావ్య రచన సుసాధ్యమైందని డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ పుస్తకాన్ని కొనేదెవరని కవిని ప్రశ్నిస్తే ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు. “ప్రపంచంలో నాలుగు రకాల మనుషులుంటారు.

ఒకటి, చాలా సంపదకలిగి సమాజ అవసరాల కోసం దాతృత్వం చూపే లోకోపకారులు; రెండు, చాలా సంపదకలిగి సమాజ అవసరాల కోసం దాతృత్వం చూపలేని సామాన్య మానవులు; మూడు, సమాజం పట్ల దాతృత్వపు భావాలున్నా డబ్బు లేని మానవమాత్రులు, నాలుగు, పేదరికంవల్ల లోకోపకార పనులు చేయలేని నిస్సహాయులు. వీరే కాకుండా అయిదో రకం మనుషులుంటారు; సమాజం పట్ల అమితంగా దాతృత్వపు భావాలుండి, డబ్బు లేకున్నా, అందరూ బృందంగా ఏర్పడి, వితరణ చూపి సమాజాన్ని గెలిపించే సజ్జనులు. ఈ భూమ్మీద ప్రపంచాన్ని ప్రేమించే దైవస్వరూపులు ఎంతోమంది ఉన్నారని నిరూపించే ఓ ‘హ్యుమానిటీ ఎక్స్ పెరిమెంట్’ నా ఈ ప్రయత్నం” అంటారు శ్రీనాథాచారి. చరిత్రను గమనిస్తే, ప్రఖ్యాత చిత్రకారుల పెయింటింగ్స్ కొన్ని వందల కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. కొందరు హాలీవుడ్ తారల వస్త్రాలను ఎన్నో కోట్లకు కొనుగోలు చేసిన దాఖలాలున్నాయి. దైవ ప్రసాదాలైన లడ్డూలు కొన్ని కోట్ల రూపాయలకు వేలంపాటల్లో విక్రయమౌతున్నాయి.

వాటి నుంచి వచ్చిన డబ్బు సమాజానికి చెందితే అంతకన్నా సంతోషం మరొకటి లేదు. ఇదే తరహాలో, 'ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్' పద్యకావ్య తొలిప్రతి ద్వారా వచ్చే నూరు శాతం డబ్బు సమాజానికే అందించడం ప్రతిఒక్కరికీ స్ఫూర్తిదాయకం. అసాధారణమైన సృజనాత్మకత, సమాజంపట్ల ప్రేమ కలిస్తే దాని ధర వెలకట్టలేనిది. అలా చూస్తే, ఐదు కోట్లూ తక్కువే. ఓ పది అంతస్తుల భవనాన్ని నేల మీదినుంచి చూస్తే ఎంతో పెద్దగా కనబడుతుంది. అదే భవనాన్ని విమానంలోంచి కిందకు చూస్తే చాలా చిన్నగా కనిపిస్తుంది. అట్లే, ఈ పుస్తకం ధర సామాన్యుడి దృష్టికోణంలో చూస్తే అసాధ్యమైన ధరలా అనిపించినా, విశాల హృదయంగల సంపన్న లోకోపకారికి చాలా చిన్న విషయం. 'ఒక చెట్టు నుంచి లక్ష అగ్గిపుల్లలు తయారుచేయెుచ్చు. కానీ లక్ష చెట్లను నాశనం చేయడానికి ఒకే ఒక్క అగ్గి పుల్ల చాలు. అలాగే, లక్ష మంచి ఆలోచనల్ని ఒక దురాలోచన నాశనం చేయగలదు.


(ఎడమ నుంచి కుడికి... కవి డాక్టర్ శ్రీనాథాచారి తల్లిదండ్రులు శ్రీమతి నీలావతమ్మ, శ్రీ రామానుజాచారి, డీఐజీ శ్రీమతి సుమతి బడుగుల ఐపీఎస్, కవి డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి, గుంతా లక్ష్మణ్ జీ, ఆచార్య వెన్నెలకంటి ప్రకాశం, కవి పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు శ్రీ ఎస్. కె.నిజాముద్దీన్, ప్రముఖ సినీ దర్శకులు జె.కె. భారవి)

దాన్ని ఆపే శక్తి పుస్తకానికుంది' అంటారు డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి. నా దగ్గర సమాజానికి పంచడానికి డబ్బు లేకున్నా, ఓ గొప్ప దాతను నేననుకున్న లక్ష్యం వైపు ప్రేరేపించేందుకు ఈ సుదీర్ఘ కావ్యం ఉపయోగపడితే అంతకన్నా ఆనందం మరొకటుండదని అంటారాయన. ఈ పుస్తకంలో రియా (RIA) అనే అద్భుతమైన ‘గ్లోబల్ పీస్ మంత్ర’ ఉపదేశిస్తారు కవి. Reflection, Introspection, Action అనే ఆంగ్ల పదాల ప్రారంభపు అక్షరాల కూర్పే రియా. ప్రతి ఒక్కరు స్వార్థపు పరిధులు దాటి, వసుదైవ కుటుంబకంగా మారి పదుగురికి ఉపయోగపడే ఆలోచన చేయడమే Reflection; ఆ మంచి ఆలోచన విషయంలో సహేతుకమైన లోతైన అధ్యయనం చేయడమే Introspection; చేసిన మంచి ఆలోచనను ఆచరించడమే Action. Reflection ఓ మంచి విత్తనాన్ని నాటడమైతే, Action ఆ చెట్టు ఫలాలు పొందడం. ఆది నుంచి అంతం వరకు ఈ రియా ఆసాంతం సానుకూల ఫలితాన్నిచ్చే ప్రక్రియ. విశ్వశాంతి వ్యక్తిగత ప్రశాంతతతో మొదలౌతుంది. మనందరి సమష్టి ప్రశాంతతే గ్లోబల్ పీస్. వ్యక్తిగత ప్రశాంతతకు మూలం ‘ఇవ్వడం’.

ప్రతిఒక్కరు రియా అనే మంత్రాన్ని పాటిస్తూ, ఎవరికి వారు తమ వద్ద ఉన్నది ఉదారంగా ఈ ప్రపంచానికి ఇస్తే చాలు, భూతల స్వర్గం కళ్ళముందు సాక్షాత్కరిస్తుందంటారు కవి. అక్షరాల అయిదు కోట్ల రూపాయల ధరగల ఈ సుదీర్ఘ భావగీత పుస్తకం వెల కట్టలేనంత సామాజిక స్పృహ, దాని ధరను మించిన ప్రయోజనాన్ని చేకూర్చుతుందని, ఈ అమూల్య ఆంగ్ల కావ్యాన్ని ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు వరిస్తాయని ఘంటాపథంగా చెప్పవచ్చు. నోబుల్ ఆలోచనలతో, నోబెల్ బహుమతికి సైతం తీసిపోని విశ్వజనుల శాంతిగీతమీ మహాకావ్యం. రవీంద్రుని ‘గీతాంజలి’ తర్వాత అంతటి స్థాయిని, సార్వజనీన వసుధైవ కుటుంబ భావనను విశ్వవ్యాప్తం చేయగలిగే సత్తా ఉన్న భారతీయ కవి మానస పుత్రిక 'ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్'.

సమాజం ముందుకువెళ్లేలా నిర్మాణాత్మకంగా సమస్యలను ఎత్తి చూపుతూ, వాటికి సాధ్యపడే పరిష్కార మార్గాలు చూపే వాడే నిజమైన కవి. ఈ విషయంలో డాక్టర్ శ్రీనాథాచారి ఘనవిజయం సాధించారనే చెప్పవచ్చు. ఈ పద్యకావ్యం చదువుతున్నంతసేపూ మనం కోల్పోతున్న ఉపయుక్త అంశాల పట్ల బాధ, తర్వాతి తరాలకు మనం చూపాల్సిన బాధ్యత కళ్ళకు కట్టినట్టు బోధపడుతుంది. ఈ రచన మొదటి నుంచి చివరి దాకా ప్రతి విషయం పట్ల కవి ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం అనన్య సామాన్యం.

సాహితీ రంగంలో నోబెల్ భారత్ కు అందుతుందనే నమ్మకాన్ని నమ్మకంగా అందించే విశిష్ట రచన ఈ కావ్యకృతి. ఎంతోమంది ప్రపంచవ్యాప్త సాహితీ విద్యార్థులకు ఇదో పరిశోధనా గ్రంథంగా ఉపయోగపడుతుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, విశ్వం వినితీరాల్సిన వినూత్న విశ్వశాంతి గీతం 'ఎన్ ఇన్వాల్యుబుల్ ఇన్వొకేషన్'. పలురకాలుగా ఎందరికో ప్రేరణనిస్తున్న డాక్టర్ వంగీపురం శ్రీనాథాచారి సృజనాత్మక సాహితీ రంగంలో మరింతగా రాణించి ఎన్నో అత్యున్నత అవార్డులు, గౌరవాలు పొందాలని ఆకాంక్షిద్దాం.

(చదవండి:  ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుస్తకం!)

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top