ప్రతికూలమూ అనుకూలమే!

Inspirational story from Rochishman - Sakshi

ఎదురుదెబ్బలు తగిలితే మనం బెదిరి పోకూడదు; పరిస్థితులు ప్రతికూలంగా ఉంటే మనం చెదిరి పోకూడదు. ఏ పరిణామానికీ మనం బెదిరి పోకూడదు; ఏ పర్యవసానానికీ మనం చెదిరి పోకూడదు. బెదిరి పోయి భయపడుతూ ఉండడం జీవనం కాకూడదు; చెదిరి పోయి చతికిలపడి పోవడం జీవితం కాకూడదు. జీవనగతి ప్రగతిని, జీవితస్థితి అభ్యున్నతిని ΄పొందాలి.

‘ఇప్పుడు ఇది అంతం కాదు; ఇది అంతానికి ఆరంభం కూడా కాదు; కానీ ఇది ఆరంభానికి అంతం కావచ్చు’ అని విన్స్ టన్‌ చర్చిల్‌ చెప్పిన మాటల్ని ఆలోచనలోకి తీసుకుని ఎదురుదెబ్బలు తగిలినప్పడూ, పరిస్థితులు ప్రతికూలించినప్పుడూ మనం ప్రతిస్పందించాలి. ఎదురుదెబ్బలు తగిలినప్పుడూ, ప్రతికూలమైన పరిస్థితులప్పడూ మన గతి అంతమై పోయిందనో, మనం ఇక ఇంతే అనో కాకుండా కొత్త ఆరంభానికి ఇది అంతం అయి ఉండచ్చు అన్న ఆశాభరితమైన ఆలోచనతో మనం భవిష్యత్తును చేపట్టేందుకు ఉద్యుక్తులం అవ్వాలి. ఎదిగినవాళ్లందరూ ఎదురుదెబ్బలు తిన్నవాళ్లే. ప్రయోజకులు అయిన వాళ్లందరూ ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నవాళ్లే. ఏ తరుణంలో అయినా మన తీరే మనకు మేలు చేస్తుంది, మనల్ని మేలైనవాళ్లను చేస్తుంది.

‘వర్తమాన క్షణాలలో ఉన్న దాన్ని అంగీకరించు నువ్వే దాన్ని ఎంపిక చేసుకున్నట్లుగా’ అని జర్మన్‌ తాత్త్వికుడు ఎక్‌హార్ట్‌ టోల్‌ సరైన సూచన చేశారు. తగిలిన ఎదురుదెబ్బల్ని , ప్రతికూల పరిస్థితుల్ని మనం అంగీకరించాలి. నిజానికి అవి మనం ఎంపిక చేసుకున్నవి కాక పోయినా జరిగాయి కాబట్టి వాటిని మనం అంగీకరించాలి. అంగీకరించకుండా మనల్ని మనం మభ్యపెట్టుకోవడంవల్ల, వాటి దెబ్బకు కుంగి పోవడం వల్ల మనం వాటిని అధిగమించలేం. వాటిని మనం అధిగమించి తీరాలి. ఎదురు దెబ్బల్ని, ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించిన జీవితమే విజయవంతమైన జీవితం అవుతుంది. జీవితం అంటూ ఉన్నాక అది విజయవంతం అవ్వాలి.

అబ్రహం లింకన్‌ 1831లో వ్యాపారంలో విఫలం అయ్యాడు. 1832లో ఎన్నికల్లో పోటీ చేసి ఓడి పోయాడు. 1833లో వ్యా΄ారంలో మరోసారి విఫలమయ్యాడు. 1835 లో తీవ్రమైన నరాల జబ్బుతో బాధపడ్డాడు. 1838 లో స్పీకర్‌ పదవికి పోటీ చేసి ఓడి పోయాడు. 1840లో ఎలక్టర్‌ పదవికి పోటీ చేసి ఓడి పోయాడు. 1843, 48లలో కాంగ్రెస్‌ అభ్యర్థిత్వానికి పోటీ చేసి ఓడి పోయాడు. 1855 లో సెనెట్‌కు పోటీ చేసి ఓడి పోయాడు. 1856లో ఉపాధ్యక్షుడి పదవికి పోటీ చేసి ఓడి పోయాడు. 1858 లో సెనెట్‌కు పోటీ చేసి ఓడి పోయాడు.

1860లో అమెరికా అధ్యక్షుడయ్యాడు. అబ్రహం లింకన్‌ ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నాడు; ఎన్నో ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొన్నాడు. వాటిని అధిగమించినందుకు పొందిన విజయంగా ఆయన అమెరికా అధ్యక్షుడయ్యాడు. ఎదురుదెబ్బల్ని, ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించగలిగితే ఏం సాధించవచ్చో అబ్రహం లింకన్‌ జీవితం తెలియజేస్తోంది. ప్రపంచచరిత్రలో ఇటువంటి ఉదంతాలు చాల ఉన్నాయి. ఎదురుదెబ్బలు, ప్రతికూల పరిస్థితులు ఎవరికైనా తప్పవు. అవి ఉంటూనే ఉంటాయి. మనకు ఎదురు దెబ్బల్ని, ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించాలన్న సంకల్పం, ప్రయత్నం బలంగా ఉండాలి.

ఆశ, ఆకాంక్ష, ఆసక్తి ఈ మూడూ మనిషి ప్రగతికి, అభ్యున్నతికి ఎంతో ముఖ్యం. వీటికి తోడుగా లేదా ఊతంగా నమ్మకం అనేది ఉండాలి. ‘ఓ నమ్మకమా! మాకు నమ్మకాన్నివ్వు, భయం నుంచి విముక్తి నివ్వు, అంతులేని సంపదలకు మమల్ని అధిపతుల్ని చెయ్యి...’ అంటూ సాగుతూ వేదంలో ఒక ప్రార్థన ఉంది. మనకు నమ్మకం కావాలి; మనం నమ్మకాన్ని నమ్ముకోవాలి. మన సంకల్పాన్ని,  ప్రయత్నాన్ని నమ్ముకుని ఎదురుదెబ్బల్ని, ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించి మనం రాణించాలి, రాజిల్లాలి.

– రోచిష్మాన్‌
 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top