
జాతీయ స్థాయి అర్హత పరీక్ష ‘నీట్’ అమలులోకి వచ్చే వరకు రాష్ట్రంలో మెడికల్ సీట్లు ‘ఎంసెట్’ ర్యాంకుల ఆధారంగానే భర్తీ అయ్యేవి. కొన్నేళ్లు సాగిన ఈ పరీక్షల ప్రశ్నపత్రాల్లోనూ సిరీస్‌లు ఉండేవి. మాల్ ప్రాక్టీస్‌ను నిరోధించడానికి ఉద్దేశించిన ఈ విధానంలోనూ కొన్ని లోపాలు ఉన్నాయి. వీటిని విద్యా సంస్థలు, ఉపాధ్యాయులు, అధికారులు, నిపుణులు గుర్తించలేకపోయారు. అయితే 2010 ఎంసెట్ సందర్భంలో పోలీసులకు చిక్కిన హైటెక్ మాస్ కాపీయింగ్ గ్యాంగ్‌లో కీలకంగా వ్యవహరించిన ఇంద్రసేన్ రెడ్డి విచారణలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు దీనిపై ప్రభుత్వానికి సమగ్ర నివేదికను అందించడంతో ‘ఎంసెట్’ పేపర్ల కూర్పులో మార్పులు జరిగాయి. ఆ ఏడాది హైదరాబాద్, కడపల్లో ఈ నిందితులు అరెస్టు అయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తికి చెందిన గంగాధర్‌రెడ్డి, కడప వాసి గురివిరెడ్డి సూత్రధారులుగా ఏర్పడిన గ్యాంగ్ 2010 నాటి ఎంసెట్‌లో మెడిసిన్ అభ్యర్థుల హైటెక్ మాల్ ప్రాక్టీస్‌కు తెరలేపింది. హైదరాబాద్‌తో పాటు చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురాల్లో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుంది. నెల్లూరుకు చెందిన ఇంద్రసేనారెడ్డి, కర్నూలు వాసి నాగూర్ బాషా, అనంతపురం వాసి లోకేశ్వర్‌రెడ్డి, సుబ్బారెడ్డిలతో ఆయా ప్రాంతాల్లో వ్యవహారాలు పర్యవేక్షించేలా ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌లో వ్యవహారాల కోసం నెల్లూరుకు చెందిన ఎంబీబీఎస్ డాక్టర్ జన భాస్కర్, చిత్తూరు జిల్లా పీలేరుకు చెందిన హరిప్రసాద్‌రెడ్డిలను ఏర్పాటు చేశారు.
ఈ ముఠా హైటెక్ పద్ధతిలో ఎంసెట్ పేపర్లు లీక్ చేసి, విద్యార్థులతో పరీక్షలు రాయించాలని పథకం వేసింది. దీని కోసం బ్లూటూత్, ఇయర్‌ఫోన్స్ సిద్ధం చేసుకుంది. ఒక్కో విద్యార్థి నుంచి రూ.5 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసి, మాల్‌ప్రాక్టీస్ ద్వారా పరీక్షలు రాయించి పాస్ చేయించాలని కుట్ర పన్నింది. దీనికోసం కొన్ని మెడికల్ కాలేజీలతో సంబంధాలు ఏర్పాటు చేసుకుంది. మెడిసిన్ విభాగం ఎంసెట్ పేపర్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టుల నుంచి ప్రశ్నలు ఉండేవి. ప్రతి విభాగం నుంచి 40 ప్రశ్నలు ఉండటంతో ఈ ముఠా ఒక్కో విభాగానికి సంబంధించి కొందరు నిపుణులను రంగంలోకి దింపింది. పరీక్ష ప్రారంభానికి పది నిమిషాల ముందే ప్రశ్నపత్రాన్ని బయటకు తీసి, ఆ వెంటనే ఆయా అవి నిపుణులకు చేరేలా ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నిపుణులు అన్ని సిరీస్‌లకు సంబంధించిన జవాబులను ఫోను ద్వారా ముఠాలో కీలక వ్యక్తులకు పది నిమిషాల్లో చెప్పేలా ఏర్పాట్లు చేసుకుంది.
తమకు డబ్బు చెల్లించి, మాల్‌ప్రాక్టీస్ ద్వారా ఉత్తీర్ణులవ్వాలని ఆశించి పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు అందించడానికి ఈ ముఠా అత్యాధునిక ఇయర్‌ఫోన్లు, బ్లూటూత్స్ ఖరీదు చేసింది. చెవిలో ఇమిడిపోయే అతి చిన్న ఇయర్‌ఫోన్లకు తోడు బ్లూటూత్‌లను పెట్టుకోవడానికి బనియన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేయించారు. ఫుల్‌హ్యాండ్స్ బనీన్లలో కుడి, ఎడమ చేతుల్లో భుజానికి దగ్గరగా బ్లూటూత్ సరిపడా చిన్న జేబులు కుట్టించారు. వీటికి సంబంధించిన సెల్‌ఫోన్లను సైలెంట్ మోడ్‌లో విద్యార్థులు అండర్‌వేర్స్‌లో పెట్టుకునేలా ఏర్పాటు చేశారు. సదరు విద్యార్థి పరీక్షకు వెళ్లే ముందే బ్లూటూత్ ఆన్ చేసుకుని వెళ్లాల్సి ఉంటుంది. వీటితో పరీక్ష హాలులోకి ప్రవేశించిన విద్యార్థి మాట్లాడాల్సిన అవసరం లేకుండానే పని నడిచేలా ప్లాన్ చేశారు.
సదరు విద్యార్థి పరీక్ష పేపర్ తీసుకునే సమయం అయిన వెంటనే ఈ ముఠాకు చెందిన వ్యక్తులు ఫోను ద్వారా విద్యార్థిని సంప్రదిస్తారు. ఆపై వరుస పెట్టి అన్ని సిరీస్‌లు ఏ...బీ...సీ...డీ... అంటూ చదువుతారు. బ్లూటూత్‌కు అనుసంధానమైన ఇయర్‌ఫోన్ ద్వారా ఇవి వినే విద్యార్థి తనకు వచ్చిన సిరీస్ చదివిన వెంటనే చిన్నగా దగ్గి సిగ్నల్ ఇస్తాడు. ఇక ఆ సిరీస్ ప్రశ్నలకు సంబంధించిన జవాబులను వరుసపెట్టి బ్లూటూత్ ద్వారా ముఠా సభ్యులు చెప్పి పరీక్ష రాయించాలని పథకం వేశారు. 2010 మే నెలలో హైదరాబాద్ సహా ఉమ్మడి రాష్ట్రవ్యాప్తంగా దాడులు చేసిన అధికారులు ఈ హైటెక్ గ్యాంగ్ గుట్టురట్టు చేసి, నాటి పరీక్షలో మాల్ ప్రాక్టీస్‌ను అరికట్టారు. ఈ వ్యవహారంలో కీలక నిందితులైన గురివిరెడ్డి, ఇంద్రసేన్‌లను కడప పోలీసులు అదే ఏడాది జూన్ 5న అరెస్టు చేశారు. అక్కడి కేసులో ఇంద్రసేన్‌కు కడప కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
అయితే ష్యూరిటీలు లేకపోడంతో విడుదల జాప్యమైంది. ఇది తెలుసుకున్న హైదరాబాద్ పోలీసులు పీటీ వారంట్‌పై ఇక్కడకు తీసుకువచ్చారు. కడప జిల్లాకు చెందిన ఇంద్రసేన్ అప్పట్లో నెల్లూరులోని నారాయణ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదివేవాడు. 2004–05ల్లో ఇంద్రసేన్, గురివిరెడ్డి ఇద్దరూ నెల్లూరులో ఎంసెట్ కోచింగ్ తీసుకున్నారు. ఆ సందర్భంలో వీరికి పరిచయమైంది. ఇంద్రసేన్ చదువుకుంటూనే ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేసేవాడు. దీంతో అప్పుడప్పుడు గురివిరెడ్డి నుంచి ఆర్థిక సహాయం పొందేవాడు. షేర్లలో నష్టపోయిన గురివిరెడ్డి తన ఆర్థిక ఇబ్బందులను ఇంద్రసేన్‌తో చెప్పడంతో ఇద్దరూ కలిసి 2009 నుంచి ఎంసెట్ హైటెక్ మాల్‌ప్రాక్టీస్‌కు పథకం వేశారు. ఎగ్జామినేషన్ హాల్‌లో మాల్‌ప్రాక్టీస్ జరగకూడదన్న ఉద్దేశంతో నిర్వాహకులు క్వశ్చన్ పేపర్‌ను ఏ, బీ, సీ, డీ అనే నాలుగు సిరీస్‌లలో అందించేవారు.
అయితే, క్లాస్‌రూమ్‌లో మాల్‌ప్రాక్టీస్ చేయడానికి ఉపయోగపడే ఓ చిన్న లాజిక్‌ను ఇంద్రసేన్ గుర్తించాడు. ‘ఏ’ సిరీస్‌లో 1వ ప్రశ్న ‘బి’ సిరీస్‌లో 31, ‘సి’ సిరీస్‌లో 21, ‘డి’ సిరీస్‌లో 11గా... అలాగే ‘ఏ’ సిరీస్‌లో రెండోది ‘బి’లో 32, ‘సి’లో 22, ‘డి’లో 12గా వస్తుంటుందని గమనించాడు. ఎంసెట్ ర్యాంక్ కోసం ఏడుసార్లు ప్రయత్నించిన నేపథ్యంలోనే తనకు ఈ విషయం తెలిసిందని ఇంద్రసేన్ పోలీసుల ఎదుట బయటపెట్టాడు. అనేక ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలతో పాటు కనీసం మూడుసార్లు ఎంసెట్ రాసిన ప్రతి అభ్యర్థికీ ఈ సంగతి తెలుస్తుందనని, దీన్ని అనేక మంది అనువుగా మార్చుకుంటున్నారని వెల్లడించాడు. దీంతో అప్రమత్తమైన పోలీసులు దీనిపై సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపారు. ఆ తర్వాత నుంచి వివిధ సిరీస్‌ల ప్రశ్నపత్రాల్లో ప్రశ్నల సీక్వెన్స్ మార్చే విధానం అమలులోకి వచ్చింది.
∙