
నేను ఒక మల్టీ నేషనల్ కంపెనీలో సేల్స్ హెడ్‌గా పని చేస్తున్నాను. నా జాబ్‌లో భాగంగా నేను తరచుగా వేరే రాష్ట్రాలకు వెళ్ళాల్సి ఉంటుంది. తొందరగా వెళ్ళి రావడం కోసం ఎక్కువగా విమానంలో ప్రయాణం చేస్తాను. విమాన ప్రయాణం అంటే ఇంతకు ముందు ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. అయితే ΄ోయిన నెలలో అహమ్మదాబాద్‌లో విమానం కూలిపోయి చాలామంది చనిపోయారు కదా, ఆ సంఘటనకి సంబంధించిన వీడియోలు పదేపదే నేను టీవీలో, ఫోన్‌లో చూశాను. అప్పటి నుండి విమాన ప్రయాణం అంటే నాకు విపరీతంగా భయం వేస్తోంది. అసలు విమానం అనే పదం విన్నా, విపరీతమైన ఆందోళన, భయం వేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం ఇండియా లో ఏ రాష్ట్రంలో మీటింగ్ ఉన్నా ట్రైన్ లేదా బస్సులోనే వెళ్తున్నాను. ఒక్కొక్కసారి కారు డ్రైవర్‌ను తీసుకొని వెళ్తున్నాను. నా గురించి బాగా తెలిసిన వాళ్ళందరూ నేను ఇలా భయపడటం చూసి ఆశ్చర్యపోతున్నారు. ఒక స్నేహితుడి సలహాతో హైదరాబాద్‌లో ఒకాయన హిప్నోనో థెరపీ చేస్తా అంటే వెళ్ళి కలిసాను. రెండు మూడు సెషన్స్‌కి వెళ్ళాను కానీ నాకు పెద్దగా ఉపయోగమనిపించలేదు. నాకు సైకియాట్రీ మందులు అంటే ఉన్న భయం వల్ల డాక్టర్‌ని కలవకూడదు అని ముందు అనుకున్నా, ఇంక నావల్ల కాక, ధైర్యం చేసి మీకు ఈ ఉత్తరం రాస్తున్నాను. నన్ను ఈ సమస్యనుండి ఎలాగైనా బయటపడవేయండి.
రాజేష్, హైదరాబాద్
ముందుగా మీరు ధైర్యంగా మీ సమస్యను మాతో పంచుకున్నందుకు అభినందనలు. మనలో ఎవరైనా పెద్ద ప్రమాదాన్ని లేదా భూకంపాలు, వర దలు వంటి ప్రకృతి వైపరీత్యాలకి ప్రత్యక్షంగా గురైనపుడు లేదా అలాంటి తీవ్ర సంఘటనల గురించి పదే పదే వార్తల్లో, టీవీలో, ఫోన్లో చూసినప్పుడు మన మెదడు ఒక రకమైన షాక్‌కి లోనవుతుంది. దీనిని సైకాలజీ పరిభాషలో ‘అక్యూట్ స్ట్రెస్ రియాక్షన్’ అంటారు.
ఇలాంటి పరిస్థితిలో మనసుకి విపరీతమైన ఆందోళన, భయం, పీడకలలు రావడం, నిద్ర పట్టక΄ోవడం, ప్రమాదం జరిగిన ప్రదేశం లేదా ఆ రకమైన వాహనాన్ని చూసినప్పుడు తీవ్రభయం కలగడం చూస్తుంటాం. ఇది మొదలుకొని కొన్నిసార్లు దీర్ఘకాలిక పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్‘ కి దారి తీయవచ్చు. మీరు ఇటీవల జరిగిన విమాన ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలను పదే పదే చూసిన కారణంగా మీ మెదడు ‘విమాన ప్రయాణం అంటే ప్రమాదం’ అనే సంకేతాన్ని ముద్రించుకుంది.
దీన్ని ‘క్లాసికల్ కండిషనింగ్‘ అంటారు. ఈ పరిస్థితి వల్ల మీరు ‘ఏరో ఫోబియా’ అంటే విమాన ప్రయాణ భయం అనే సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. ఇది తీవ్రమైన సమస్యగా అనిపించినా, మంచి చికిత్స ద్వారా పూర్తిగా తగ్గించే వీలుంది. చికిత్సలో భాగంగా గ్రాడ్యుయేటెడ్ ఎక్సో్పజర్ థెరపీ, ‘కాగ్నిటివ్ రీ స్ట్రక్చరింగ్‘ వంటి చికిత్సలు తీసుకోవాల్సి ఉంటుంది. ‘వర్చువల్ రియాలిటీ‘ వంటి ఆధునిక వైద్య విధానాలు కూడా ఇపుడు అందుబాటులోకి వచ్చాయి.
మిమ్మల్ని వివరంగా పరీక్షించిన తర్వాత మీ సమస్య తీవ్రతని బట్టి అవసరమైతే కొన్ని మందులు తాత్కాలికంగా వాడాల్సి రావచ్చు. అయితే ఈ చికిత్సలు అన్నీ కూడా నిపుణులైన సైకియాట్రిస్ట్, లైసెన్స్ పొందిన క్లీనికల్ సైకాలజిస్ట్ పర్యవేక్షణలో మాత్రమే తీసుకోవల్సి ఉంటుంది. ఓపికగా, నమ్మకంగా చికిత్స కొనసాగిస్తే మీరు మళ్ళీ మునుపటిలా విమాన ప్రయాణాలు చేయగలరు. ఆల్ ది బెస్ట్ !
డా. ఇండ్ల విశాల్ రెడ్డి, సీనియర్ సైకియాట్రిస్ట్, విజయవాడ
(మీ సమస్యలు, సందేహాలు పంపవలసిన మెయిల్ ఐడీ: sakshifamily3@gmail.com)
(చదవండి: నీట్, యూపీఎస్సీలలో ఓటమి..ఇవాళ రోల్స్ రాయిస్‌లో రూ. 72 లక్షలు..)