రోజుకి 18 గంటలు.. ఆరోగ్యంగా విజయాలు..

Head Of Uttari Hotel Anuradha Success Story In Food Business In Hyderabad - Sakshi

పరిశుభ్రమైన ఆహారం... రుచికరమైన ఆహారం.. వచ్చినవారిని ఆప్యాయంగా పలకరించటం.. రుచి నచ్చిందా లేదా అని ప్రశ్నించటం.. కస్టమర్ల సూచనలు, సలహాలు పాటించటం.. వీటి వల్లే బ్రాండింగ్‌ వస్తుందనేది అనురాధ రావిరాల నమ్మకం.. అక్కడకు వచ్చినవారు కడుపునిండా హాయిగా భోజనం చేసి వెళ్తారు..  ఈ కారణాలే ఆమెను ఉత్తమ ఎంటర్‌ప్రెన్యూర్‌ స్థాయికి తీసుకువెళ్లాయి..

అనురాధ రావిరాల హైదరాబాద్‌ కోకాపేట్‌లో ఉంటున్నారు. తండ్రి ఆర్‌బి రాజు ఆర్కిటెక్ట్, తల్లి కుసుమ ఎంఏ పొలిటికల్‌ సైన్స్‌. వారి నుంచి మంచి చదువు చదవగలిగారు అనురాధ. ఇంటీరియర్‌ డిజైనింగ్, ఆ తరవాత హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు పూర్తి చేశారు. ఇంటీరియర్‌ డిజైన్‌ చేస్తూ కెరీర్‌ ప్రారంభించారు. ‘‘నాకు చిన్నప్పటి నుంచి ఏదో ఒకటి చేయాలనే కోరిక బలంగా ఉండేది. ఇంటీరియర్‌ డిజైన్‌ కాకుండా ఇంకా ఏదైనా చేయాలనిపించేది. అమ్మ చాలా రుచిగా వంట చేసేది. అమ్మతో పాటు అప్పుడప్పుడు నేను కూడా వంట చేసేదాన్ని. నాకు సంప్రదాయ వంటలంటే చాలా ఇష్టం. ఆ అభిరుచి కారణంగానే హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేశాను’’ అంటున్న అనురాధ, చేసేది ఒక్క వంటకమైనా, అది పూర్తిస్థాయిలో రుచిగా, సంప్రదాయబద్ధంగా ఉండాలంటారు.

చదవండి: Travel Tips: ప్రయాణించే సమయంలో ఈ విషయాలు మర్చిపోకండి!

విజయానికి కారణం..
రెండు దశాబ్దాల కిందట వేవ్‌రాక్‌లో అమృత్‌సరీ పేరున పూర్తి శాకాహారం అందచేయటంతో ఫుడ్‌ బిజినెస్‌లో తొలి అడుగు వేసి, పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్‌ కంపెనీలకు ఫుడ్‌ సప్లయి చేశారు. నాన్‌వెజ్‌ ఫుడ్‌ సప్లయి కూడా ప్రారంభించారు. ‘‘డిమాండ్‌కి అనుగుణంగా సప్లయి చేయటం కోసం నార్సింగ్‌ మెయిన్‌ రోడ్‌ మీద సెంట్రల్‌ కిచెన్‌ను, చిన్న రెస్టారెంట్‌ను ప్రారంభించి, ఔట్‌లెట్‌ సెంటర్లను పెంచాను’’ అంటున్న అనురాధకు తొలి అడుగులో అపశృతి దొర్లినా, త్వరగానే కోలుకున్నారు. అతి తక్కువ పెట్టుబడితో ప్రాంభించి, ఇప్పుడు మంచి టర్నోవర్‌ స్థాయికి ఎదిగారు.

ఫుడ్‌ ఈజ్‌ ఇమోషనల్‌... 
నాణ్యమైన ఆహారం అందిస్తూ, దాని ద్వారానే బ్రాండింగ్‌ తెచ్చుకోవాలంటారు అనురాధ. ‘‘ఫుడ్‌ ఈజ్‌ ఇమోషనల్‌. ఏ పదార్థమైనా నోట్లో పెట్టుకోగానే వెంటనే అనుభూతి చెందుతారు’’ అంటున్న ఆమె, ఒక కస్టమర్‌ కోసం, వంటగదిలో స్వయంగా గరిటె పట్టుకున్నారు. గోంగూర పచ్చడి, పూర్ణాలు, బొబ్బట్లు, పులిహోర... అన్నీ అందించారు. ‘‘కాంప్లిమెంటరీగా పూతరేకులు కూడా ఇచ్చాం’’ అంటూ ఆనందంగా చెబుతారు అనురాధ.

రోజుకి 18 గంటలు..
అన్నీ స్వయంగా చూసుకోగలిగితేనే వ్యాపారంలో రాణించగలమని నమ్ముతారు అనురాధ. ‘‘బిజినెస్‌లో ఇమోషన్స్‌ ఉండకూడదు. క్రమశిక్షణ, నిజాయితీతో పనిచేస్తే విజయం సాధించటం తేలిక’’ అంటున్న అనురాధ.. ఇండిగ్రాండ్‌ హాస్పిటాలిటీ సర్వీసెస్‌ అందిస్తున్నారు. సర్టిఫైడ్‌ ఇంటీరియర్‌ డిజైనర్‌గా ఆర్‌బి రాజు అండ్‌ అనురాధ అసోసియేట్స్‌ పేరున డిజైనింగ్‌ చేస్తున్నారు. హాస్పిటాలిటీ హోటల్స్‌కి బ్రాండ్‌ అంబాసిడర్‌ స్థాయికి ఎదిగారు.
– సంభాషణ: వైజయంతి పురాణపండ
 
మొహాలీలో అడ్వాన్స్‌డ్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సుకి  అప్లయి చేసిన కొన్ని వేల మందిలో సెలక్ట్‌ అయ్యారు. ‘‘మేం సెలక్ట్‌ కావాలంటే చాలా అడ్డంకులు దాటాలి. ఇంటర్వ్యూ స్కాలర్‌లీగా ఉంటుంది. ఉదయం నుంచి రాత్రి వరకు క్లాసులు జరుగుతూనే ఉంటాయి. కన్ను ఆర్పటానికి కూడా సమయం దొరకదు. కోర్సు పూర్తి చేసి వెళ్లే ముందు వారు, ‘మా దగ్గర నువ్వు ఏం నేర్చుకున్నావు, మీ హోటల్‌కి వచ్చిన వాళ్లని ఏ విధంగా గౌరవిస్తావు’ అని వారు వేసిన ప్రశ్నలకు మా సమాధానం చెప్పాలి. బిజినెస్‌ ఒక్కరితో, ఒక్కరోజులో ముగిసేది కాదు. మున్ముందు ఎలా విస్తృతపరుస్తామనే విషయాలను కూడా వివరంగా రాయాలి. ఫైనాన్సియల్‌ ప్రొజెక్షన్‌ కూడా ఇవ్వాలి. ఇంత కష్టపడిన తరవాతే సర్టిఫికేట్‌ వస్తుంది.
– అనురాధ, ఉత్తరి హోటల్‌ అధినేత

చదవండి: బీరకాయతో నాన్‌వెజ్‌.. చికెన్‌, రొయ్యలు, ఖీమా

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top