వామనుడి త్రివిక్రమావతారం | funday special Story On Trivikramavataram | Sakshi
Sakshi News home page

వామనుడి త్రివిక్రమావతారం

May 24 2026 12:20 PM | Updated on May 24 2026 12:20 PM

funday special Story On Trivikramavataram

‘జోసెఫ్‌ కాన్రాడ్, వ్లదిమీర్‌ నబాకఫ్, వి.ఎస్‌. నైపాల్‌ తదితరులు సొంత దేశాలూ– భాషలూ– ఖండాలూ– సంస్కృతులూ– ఒక్కమాటలో చెప్తే సొంత నాగరికతలను అధిగమించి, వేర్వేరు ప్రాంతాలకు తరలి వెళ్ళారు. ఆ వలసలు వారి ఊహాశక్తికి పదునుపెట్టి, పోషణనిచ్చాయి. అవి వలసల వల్ల సంక్రమించినవి. నా విషయంలో అలా చెప్పుకోడానికేమీ లేదు! ఒకే నగరం– ఒకే వీథి– ఒకే భవనంలో నా జీవితంలో అత్యధికభాగం గడిచిపోయింది. 

అక్కడి నుంచే, అదే దృశ్యాన్ని, అదే కోణంలోంచి చూస్తూ ఇన్నాళ్ళూ గడిపేశాను. నన్ను ‘నేను’గా మార్చిన నగరంతో నాకున్న ప్రగాఢ అనుబంధం అలాంటిది’ అన్నారు ఫెరీత్‌ (ఫరీద్‌) అర్హాన్‌ పముక్‌. 2006లో నోబెల్‌ సాహిత్య పురస్కారం అందుకునే నాటికే అర్హాన్‌ పముక్‌ సుప్రసిద్ధుడు. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా వున్న అర్హాన్‌ పముక్, యాభయ్యేళ్ళకు పైగా సాహిత్యరంగంలోనూ కృషి కొనసాగిస్తూనే వున్నారు.

దాదాపు డజను నవలలు రాసిన పముక్‌ కాల్పనికేతర సాహిత్యం కూడా బోలెడంత రాశారు. ‘ఇస్తాంబుల్‌– జ్ఞాపక నగరి’ అనే రచన అలాంటిదే! అది సగం జ్ఞాపకాల నెమరువేత ఐతే, మరికొంత ఇస్తాంబుల్‌ నగర జాతక చక్రం! ఆసియా–ఐరోపా ఖండాల మధ్య యుగయుగాలుగా విస్తరించి ఉన్న భూమార్గంలో చిట్టచివరి మజిలీ ఇస్తాంబుల్‌. ఈ చారిత్రక నగరం తూర్పు భాగం ఆసియాలో వుండగా, పడమటి భాగం యూరపులో చేరింది. 

తూర్పు ఇస్తాంబుల్‌లోని ‘పముక్‌ భవంతి’ పే...ద్ద అపార్టుమెంట్‌ సముదాయం. అర్హాన్‌ పముక్‌ బంధువులందరూ ఆ భవంతిలోని ఒక్కో అపార్టుమెంట్‌లో సకుటుంబంగా జీవిస్తూ వుంటారు. మధ్యలో నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో వుండివచ్చినా, ఎక్కువ కాలం ఆ భవంతిలోనే వున్నానంటారు పముక్‌. వలస జీవన విధానం ఒకరకం శక్తినిస్తే, ఒకే చోట పాతుకుపోయి జీవించడం మరోరకం శక్తిని ఇస్తుందని పముక్‌ రుజువు చేశారు. ప్రపంచంలోని ప్రతి చెప్పుకోదగిన నగరంలోని జీవిత విధానం పైనా ఎవరో ఒకరు ఏదో ఓ రూపంలో రాస్తూనే వున్నారు. అంచేత పముక్‌ గొప్పతనం ఆయనొక్కడే వాళ్ళ నగరం గురించి రాయడంలో లేదు– అది రాసిన పద్ధతిలో ఉంది!

సామాన్య శకం నాలుగో శతాబ్దిలో, తూర్పు రోమన్‌ సామ్రాజ్య రాజధానిగా నిర్మితమైన కాన్‌స్టాంటినోపుల్‌ నగరమే, ఆరేడు వందల సంవత్సరాల తర్వాత ఇస్తాంబుల్‌గా మారిందని యూరపియన్‌ చరిత్ర రచయితలు అంటారు. కానీ, అంతకు రెండువేల యేళ్ళకు ముందునుంచీ ఈ నగరం ఉన్న ప్రాంతం జనావాసంగా వుంటూనే వచ్చిందని ఆసియన్‌ చరిత్ర గ్రంథాల సమాచారం. బైజాంటియన్‌ సంస్కృతి ఇక్కడ వర్ధిల్లింది. మూడువేల సంవత్సరాల కిందట మతం– రాజకీయం రెండు స్వతంత్ర శాఖలుగా చీలక ముందటి మాట యిది. అసలు ‘బిజాంతీన్‌’ అంటేనే సంక్లిష్ట సమన్వయమని అర్థం! ఈ ప్రాంత చరిత్ర వరకూ ఇది అక్షరాలా సార్థకం!!

‘ప్రాక్పశ్చిమ నాగరికతల మధ్య నిర్మించిన వారధులు’గా పముక్‌ రచనలను పేర్కొన్నారు నోబెల్‌ పురస్కారం ఎంపిక సంఘంలోని నిపుణులు! ‘రెండు నాగరికతల మేలికలయిక ఇస్తాంబుల్‌. దాని ‘వ్యాకులిత ఆత్మ’ను సరికొత్త ప్రతీకల సాయంతో శోధించిన వాడు పముక్‌. భిన్న సంస్కృతుల మధ్య తలెత్తే ఘర్షణలనూ– సమన్వయాన్నీ కూడా గొప్పగా చిత్రించినందుకు ఈ జ్యూరీ పముక్‌ను అభినందించింది. భిన్న భాషలూ, సంస్కృతులూ, మతాల మధ్య ఏర్పడే ఘర్షణలకు నూతన భాష్యాలు చెప్తూ, వాటికి ‘అనూహ్య సమన్వయాలను సూచించినందుకు’ పముక్‌ను జ్యూరీ కొనియాడింది. 

అంతటితో ఆగితే బావుండేది– ‘వర్తమాన సాహిత్య ప్రపంచంలో అత్యంత విశిష్టమైన వ్యక్తి పముక్‌’ అని జ్యూరీ ప్రకటించడంతో ఇంటా బయటా కూడా పెద్ద దుమారమే చెలరేగింది. కొందరు దాన్ని ‘కేవలం రాజకీయ ప్రకటన’గా చిత్రించి కొట్టిపారేశారు. మరికొందరు ఈ ప్రకటనను ‘టర్కిష్‌ సాహిత్యం సాధించిన ఘనవిజయం’గా జమకట్టారు. అయినా, మన సాహిత్య వేత్తల సుహృద్భావం మనకు తెలియనిదా? నక్కలెక్కడికెళ్ళినా ఊళలే వేస్తాయి–కోయిల ఏ దేశంలోనైనా తియ్యగానే పాడుతుంది! ఆ విషయం అలా వుంచండి!!

‘ప్రతి మనిషీ జీవితంలో ఒకసారైనా ఆత్మపరిశీలన చేసుకోవాలి. మన పరిసరాలు అప్పుడెలా వుండేవో, ఇప్పుడెల వున్నయో పునఃపరిశీలించుకోడానికి అది వుపయోగపడుతుంది. ఈ విశ్వం ఎంతో విశాలమైంది. దానిలోని ఒకానొక మూలనే, ఒకానొక రోజునే, ఒకానొక కుటుంబంలోనే మనం పుట్టాలని జీవితమనే లాటరీ ఎందుకు నిర్ణయించింది? ఆ కుటుంబం మనల్ని ఎందుకంతగా ప్రేమిస్తుంది? మనమెందుకు వాళ్ళను అంతగా అభిమానిస్తాం? ఏమో– ఇంతకన్నా మెరుగైన జీవితానికి అర్హులమేమో మనం? వయసుడిగిన ఓ నగరంలో పుట్టడం నా దురదృష్టమేమో అనిపిస్తుంది ఒక్కోసారి’ అన్నారు పముక్‌ ‘ఇస్తాంబుల్‌  నగరం – కొన్ని జ్ఞాపక కథలు’ పుస్తకానికి రాసిన ముందు మాటలో. 

ఆ పుస్తకం చదువుతూ పోతుంటే అవి ఓ వ్యక్తి జ్ఞాపకాలో, ఒకానొక నగరం స్వగతమో మర్చిపోతూ వుంటాం. ఒక వ్యక్తి విరాట్‌ రూపంలో ఓ చారిత్రక మహానగరాన్ని ఆక్రమించుకుంటున్నట్లు అనిపిస్తుంది!! అదే పముక్‌ వేసిన మంత్రం. ఇది అందరికీ చేతనయ్యే ట్రిక్కు కాదు. కనుకనే, ఫెరీత్‌ అర్హాన్‌ పముక్‌కు నోబెల్‌ సాహిత్య పురస్కారం దక్కింది.

-మందలపర్తి కిషోర్‌

Advertisement
 
Advertisement
Advertisement