కథాకళి: ప్రేమ పండు | Funday Kathakali: Fruit of Love | Sakshi
Sakshi News home page

కథాకళి: ప్రేమ పండు

Jun 7 2026 11:43 AM | Updated on Jun 7 2026 11:43 AM

Funday Kathakali: Fruit of Love

క్రీ.శ. 1772. అది యశీరప్‌లో ఒలోనా నది ఒడ్డున ఉన్న చిన్న గ్రామం. పెరూ రెస్‌కాల్డా.ఆ గ్రామస్థురాలైన లవీనియాకి నిద్ర లేవగానే ఉత్కంఠ పెరిగిపోతోంది. తన శరీరం సాధారణంగా ఉందా లేక ఏదైనా మార్పు వచ్చిందా అన్న ఆందోళన ఆమెని వేధిస్తోంది.పదహారేళ్ళ లవీనియా– మాంసం కొట్టు యజమాని కొడుకు ఫ్రెడినోతో ప్రేమలో పడింది. అతని వయసు పద్దెనిమిది. ఆమె వారానికి రెండుసార్లు మాంసం కొనడానికి అతని కొట్టుకి వెళ్ళేది. ఫ్రెడినో తన తండ్రితోపాటు అక్కడ పని చేసేవాడు. తండ్రి చూడకుండా తనకి ఎక్కువ మాంసం తూచడాన్ని లవీనియా గమనించింది. ఆమె గమనించినట్లు అతను గ్రహిస్తే నవ్వుతూ కన్నుకొట్టేవాడు. ఆదివారాలు చర్చిలో కూడా ఒకరికొకరు తారసపడేవారు.ఓ రోజు ఫ్రెడినో లవీనియాకి మాంసం ఇస్తూ గుసగుసగా చెప్పాడు.

‘‘ఇంకో గంట తర్వాత నది ఒడ్డున కలుద్దాం. మూడు పైన్‌ చెట్ల దగ్గర.’’అతను చెప్పిన సమయానికి వెళ్ళాలని అనుకుంది. కాని తల్లి ఊలు నించి దారం తీసే పని చెప్పడంతో కుదరలేదు.రెండు రోజుల తర్వాత మళ్ళీ మాంసం కొనడానికి వెళ్ళినప్పుడు ఆమె అతను వినేలా మరో కస్టమర్‌తో చెప్పింది.‘‘మొన్న నాకు మా అమ్మ చాలా పెద్ద పని ఇచ్చింది. అందువల్ల బయటకి వెళ్ళలేదు.’’అతను లవీనియాతో రహస్యంగా చెప్పాడు.‘‘రేపు అక్కడే సూర్యుడు కొండ మీదకి వెళ్ళే సమయంలో కలుద్దామా?’’‘‘నీ ఆహ్వానం కోసమే నేను ఎదురు చూస్తున్నాను.’’ సిగ్గుగా చెప్పింది.మొదటిసారి వారిద్దరూ ఏకాంతంలో కలిశారు. ఒకరినొకరు కౌగిలించుకుని చాలాసేపు అలాగే నిలబడ్డారు. వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వేగం పెరిగింది.

‘‘నువ్వు చాలా అందగత్తెవి.’’ ఫ్రెడినో చెప్పాడు.లవీనియా నవ్వుతూ చెప్పింది.‘‘అందం కాలంతో వచ్చి కాలంతో వెళ్ళిపోతుందని మా నాయనమ్మ చెప్తూంటుంది.’’‘‘అవును. అందుకే ఈ వయసులో ప్రేమించుకుంటారు. ముసలి వయసులో కాదు.’’ఆమె ఫక్కున నవ్వింది. తర్వాతి కలయికల్లో గర్భవతి అవుతానన్న భయంతో లవీనియా అతన్ని అందుకు అనుమతించలేదు. ఆమె మనసులో మాత్రం ఆ తహతహ ఉంది. చివరికి అది ఆమె మానసిక శక్తిని లొంగదీసింది. ‘‘నేను రేపు రోమ్‌కి వెళ్ళాల్సి వచ్చింది.’’ ఓ రోజు ఫ్రెడినో ఆమెతో చెప్పాడు.‘‘మళ్ళీ ఎప్పుడు వస్తావు?’’ లవీనియా ఆందోళనగా అడిగింది.‘‘మన రాజు జోసెఫ్‌ ది సెకండ్‌ రాజప్రసాదంలో మా నాన్న నాకు ఉద్యోగం సంపాదించారు. 

రాజుగారి వంటశాలలో మాంసం కోసే పని.’’‘‘వెళ్ళక తప్పదా? మానేయచ్చుగా?’’ లవీనియా బాధగా అడిగింది.‘‘వెళ్ళకపోతే రాజు ఊరుకుంటాడా?’’ ఫ్రెడినో నిస్సహాయంగా చెప్పాడు.వారి ఆ చివరి కలయికలో కన్నీళ్ళు చాలానే కారాయి. ఫ్రెడినో రోమ్‌కి వెళ్ళాక లవీనియాకి జీవితం వెలితిగా మారింది. ఏ పని మీద ఉత్సాహం లేదు.మూడు నెలలు గడిచాక తను గర్భవతైందని గ్రహించింది. ఆ కాలంలో పెళ్ళి కాకుండా తల్లి అవడం పెద్ద అపరాధం. ఊరి ప్రజలకి అలాంటి వారిని రాళ్ళతో కొట్టి శిక్షించే హక్కు కూడా ఉండేది. అది తన కుటుంబానికి తీరని మచ్చ. బలవంతంగా కడుపు తీయించుకునే ప్రయత్నంలో చాలామంది మరణించడం గురించి కూడా ఆమె విన్నది. తల్లి కఠినురాలు. తండ్రికి తను గర్భవతినని చెప్పే ధైర్యం లేదు.

చివరికి ఆమెకి ఒకటే పరిష్కారం కనిపించింది. ఆత్మహత్య.ఆరోజు చర్చికి వెళ్ళి మేరీ మాతని ప్రార్థించింది. తరువాత నది ఒడ్డుకి వెళ్ళి అక్కడి మొక్కల నుంచి ఎర్రటి విషపు పళ్ళని చాలా కోసుకుంది. తమ కలయిక జరిగిన మూడు పైన్‌ చెట్ల మధ్య కూర్చుని వాటిని తినసాగింది. వాటి రసం ఆమె దుస్తుల మీదకి కారింది. దాదాపు పాతిక పళ్ళు తిన్నాక ఆమె కళ్ళు మూసుకుని మృత్యువు కోసం ఎదురుచూస్తూ పడుకుంది.అప్పుడే అక్కడికి ఫ్రెడినో వచ్చాడు. పక్కన ఉన్న పళ్ళని చూసి భయంగా అడిగాడు.‘‘వీటిని తిన్నావా? అయ్యో! ఫ్రెంచ్‌ ప్రభుత్వం వీటిని నిషేధించింది కూడా. ఎందుకు తిన్నావు?’’‘‘నేను గర్భవతిని. మరో మార్గం లేదు. నువ్వు కొద్దిగా ముందు వచ్చి ఉంటే వీటిని తినేదాన్ని కాదు.’’ లవీనియా కన్నీళ్ళతో చెప్పింది.‘‘నువ్వు లేకుండా నేను బతకలేను.’’ ఫ్రెడినో ఆమె చేతిని పట్టుకుని చెప్పాడు.

అతనూ ఆ పళ్ళని కోసుకుని తిన్నాడు. కొన్ని గంటలు గడిచినా ఇద్దరికీ ఏమీ కాలేదు.‘‘మేరీ మాత అనుగ్రహం.’’ లవీనియా భక్తిగా చెప్పింది.ఫ్రెడినో ఇరువురి తల్లిదండ్రుల అనుమతితో ఆమెని పెళ్ళి చేసుకుని రోమ్‌కి తీసుకెళ్ళాడు.అక్కడ రాజుగారి వంటవాడికి ఆ పళ్ళ గురించి చెప్తే నమ్మలేదు. కాని ఫ్రెడినో తన ముందే వాటిని తిన్నా ఏమీ కాకపోవడం చూసి చెప్పాడు.‘‘ఇది విషపు పండు కాదు. ప్రేమ పండు. దీన్ని వంటల్లో వాడుతాను.’’అలా ఆ పండు క్రమంగా యూరప్, సౌత్‌ అమెరికాలోని దేశాలకి, అమెరికాకి కూడా వ్యాపించింది. యురోపియన్‌ సలాడ్‌లో తప్పనిసరి భాగంగా మారిన ఆ పండు పేరు టొమాటో.(నైట్‌షేడ్‌ అనే విషపుజాతికి చెందిన టొమాటోలని యూరోపియన్‌ 16వ శతాబ్దం దాకా విషపు పళ్ళుగా నమ్మేవారు. ‘ఎప్పటి నించి ఆ అపనమ్మకం తొలగింది?’ అనే ఆలోచన వచ్చాక) 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement