బిహైండ్‌ ది బార్స్‌ | Funday Kathakali: Behind the Bars | Sakshi
Sakshi News home page

బిహైండ్‌ ది బార్స్‌

May 24 2026 11:41 AM | Updated on May 24 2026 11:41 AM

Funday Kathakali: Behind the Bars

ఆ కుర్రాడు లోపలకి వెళ్తూ బిల్డింగ్‌ బయట ‘సెంట్రల్‌ ప్రిజన్, సౌత్ని’ అని రాసుండటం గమనించాడు. వార్డెన్‌ ఆ కుర్రాడిని ఎగాదిగా చూసి అడిగాడు.‘‘పేరు?’’అతను చెప్పాడు.‘‘వయసు?’’‘‘పదహారు.’’పక్కనే ఉన్న జైల్‌ గార్డ్‌ అతని చెంప మీద కొట్టి అరిచాడు.‘‘సర్‌... ప్రతి జవాబుకి సర్‌ అనాలి.’’‘‘నీ జేబులు ఖాళీ చెయ్యి. వెళ్ళేప్పుడు తీసుకువెళ్ళు.’’ వార్డెన్‌ శాసించాడు.‘‘ఎస్‌ సర్‌.’’ఆ పని అయ్యాక గార్డ్‌ అతన్ని ఓ గదిలోకి తీసుకెళ్ళి చెప్పాడు.‘‘బట్టలు విప్పు.’’‘‘దేనికి?’’ ఆ యువకుడు అదిరిపడి అడిగాడు.‘‘నువ్వు రహస్యంగా లోపలికి ఆయుధాలు, డ్రగ్స్‌ తీసుకెళ్ళడం లేదని తెలుసుకోడానికి.’’అతను అంతదాకా ఎవరి ముందూ నగ్నంగా నిలబడలేదు. గ్లవ్స్‌ తొడుక్కున్న చేతి వేళ్ళతో గార్డ్‌ అతని శరీరంలోని రహస్య ప్రదేశాలని వెదుకుతూంటే, అతను శాడిస్ట్‌ అని ఆ కుర్రాడు గ్రహించాడు. డాక్టర్‌ అతన్ని పరీక్షించాక గార్డ్‌ ప్రిజన్‌ యూనిఫాం ఇచ్చి చెప్పాడు.

‘‘ఇవి తొడుక్కుని పద. ఇక నీ పేరుని మర్చిపోవచ్చు... నీ ఖైదీ నెంబర్‌ 237.’’గార్డ్‌ అతన్ని ఓ పెద్ద గదిలో నీళ్ళ టబ్‌ దగ్గరికి తీసుకెళ్ళి చెప్పాడు.‘‘ఇవాళ నీ డ్యూటీ ఇక్కడ. ఇవన్నీ ఖైదీలవి. వీటిని ఉతుకు.’’‘‘ఛీ! అండర్‌వేర్లు. ఈ పని నేను చేయను.’’ అతను రోషంగా చెప్పాడు.వెంటనే గార్డ్‌ ఓ తాడుతో అతని వీపు మీద కొట్టాడు. ఆ యువకుడు కేక పెట్టాడు.‘‘ఆజ్ఞలని పాటించకపోతే ఇంతే. ఇది ఏభై పోగుల తాడు. వంద, నూట ఏభై, రెండు వందల పోగుల తాడుని ఉపయోగిస్తే నువ్వు తట్టుకోలేవు. ఒంటి మీద గాయాలు కూడా కనిపించవు. నేను వచ్చేసరికి పని పూర్తిచేయాలి.’’ఆ యువకుడి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. సబ్బునీళ్ళతో ఆ మురికి బట్టలని ఉతకసాగాడు. కాసేపటికి జైల్‌ గార్డ్‌ వచ్చి పక్క గదిలోకి తీసుకెళ్ళి ఖైదీలు తిన్న ప్లేట్లని చూపించి చెప్పాడు.

‘‘వీటన్నిటిని తోమి శుభ్రం చేయి.’’‘‘ఛీ.’’‘‘అప్పుడే? దీని తర్వాత టాయ్‌లెట్లు కడగాలి.’’ గార్డ్‌ నవ్వుతూ చెప్పాడు.‘‘ఇలాంటి పనులు నేను ఎన్నడూ చేయలేదు.’’ ఆ యువకుడు ఏడుస్తూ చెప్పాడు.‘‘నేరస్థుడు కాకముందు సంగతి అది. నేరస్థుడు అయాక అన్ని పనులూ చేయాలి.’’టాయ్‌లెట్స్‌లోని నీళ్ళల్లోంచి దోమలు ఒక్కసారిగా పైకి లేచాయి. నీళ్ళల్లో దోమల గుడ్లు, పురుగులు చాలా ఉన్నాయి.లంచ్‌ బెల్‌ మోగింది. మెస్‌లో క్యూలో నిలబడ్డ ఖైదీలు ఒకరిని మరొకరు తోసుకుంటూ తిట్టుకుంటున్నారు. చాలామంది అతన్ని వెనక్కి తోసేశారు. అతని ప్లేట్‌లో రెండు గోధుమ రొట్టెలు, పెసరపప్పు, కప్పు అన్నం, నీళ్ళ సాంబారు, రెండు చిన్న మాంసం ్రౖఫై  ముక్కలు వేశారు. అతను ఓ బల్ల ముందు కూర్చుంటే, అక్కడి ఖైదీ స్పూ¯Œ తో ఆ యువకుడి చేతి మీద కొట్టి అరిచాడు.‘‘వెళ్ళు. అడిగి కూర్చోవాలని తెలీదా?’’ఆ యువకుడు లేచి మరో బల్ల దగ్గరికి వెళ్ళి అడిగాడు.

‘‘ఇక్కడ కూర్చోవచ్చా?’’ఎవరూ అనుమతించలేదు. ఓ వ్యక్తి లేచి అతని ప్లేట్‌లోని రెండు మాంసం ముక్కలు తీసుకున్నాడు. మరొకరు రోటీ లాక్కున్నారు. సింటెక్స్‌ టేంక్‌లోని తాగే నీళ్ళు చెడు వాసన వేస్తున్నాయి. దాని పక్కన సగం కోసిన వాటర్‌ బాటిల్స్‌ని కప్పులుగా వాడుతున్నారు.‘‘కొత్తా? ఇక్కడ బలహీనులు బలవంతుడి రక్షణలో ఉండాలి. లేకపోతే ఏమీ దక్కదు. అందుకు అతనికి కొంత సొమ్ము ఇవ్వాలి. ఉదయం ఐదున్నరకి టాయ్‌లెట్ల ముందు క్యూలో చోటు కావాలన్నా, స్నానానికి నీళ్ళు, తినడానికి రోటీ కావాలన్నా బలవంతుడు మనకి రక్షణగా ఉండాలి.’’ ఒకరు అతన్ని చూసి చెప్పారు.వెయ్యి చదరపు అడుగుల బేరక్స్‌లో నూట అరవైమంది ఖైదీలు ఉన్నారు. ఇందాకటి అతను ఆ యువకుడితో చెప్పాడు.‘‘రాత్రుళ్ళు ఇక్కడ జరిగేవి మాటల్లో చెప్పడానికి నాకే సిగ్గేస్తుంది. నిన్ను చూడటానికి నీ తల్లిదండ్రులు నెలకి ఒక్కసారే ములాఖాత్‌కి వస్తారు. కేవలం పదిహేను నిమిషాలే. 

ఇనప కడ్డీల వెనక ఉన్న నిన్ను చూసి వాళ్ళు తప్పకుండా కన్నీళ్ళు పెట్టుకుంటారు. ఇక్కడ ఏభై కిలోల గార్డ్, నూటపాతిక కిలోలున్న ఖైదీని కొడతాడు. నా చెవి మీద కొడితే గూబ పగిలి చెవుడు వచ్చింది. దాన్ని టెలిఫోనీ దెబ్బ అంటారు. ఇంకోచోట కొడితే ఆ బాధ భరించలేవు. మానసికంగా బలహీనులైన ఖైదీలు ఇక్కడ ఆత్మహత్య చేసుకుంటారు.’’ఎనిమిది గంటల తర్వాత ఆ యువకుడు సెంట్రల్‌ ప్రిజన్‌లోంచి బయటికి వచ్చి, ఆగి ఉన్న కారుని ఎక్కాడు. 

ఏడుస్తున్న ఆ యువకుడితో కారు నడుపుతున్న తండ్రి చెప్పాడు.‘‘చూశావుగా. నీ ఫ్రెండ్‌ తాగి కారు నడిపి ఇద్దర్ని చంపినప్పుడు నువ్వా కారులోనే ఉన్నావు. రేపు నువ్వేదైనా తప్పు చేస్తే ఐఏఎస్‌ ఆఫీసరైన నేను కాపాడగలను. కాని కాపాడను. అది నా స్వభావం కాదు. నువ్వు జైలుకి వెళ్ళక తప్పదు.’’ఆ యువకుడు వెళ్ళాక వార్డెన్‌ గార్డ్‌తో చెప్పాడు.‘‘ఇండియాలో చాలామంది తమ కొడుకులని ఇలా జైలు విజిట్‌కి పంపడం దేశానికి ఎంతో మంచిది.’’ 
 

∙మల్లాది వెంకట కృష్ణమూర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement