చీకటి మాటున నీడలా అంటి పెట్టుకున్న నేరం... విజయవాడ – హైదరాబాద్ హైవే అది... ఒక్కసారిగా అక్కడ కలకలం. మంటల్లో కారు కాలిపోతోంది. అర్ధరాత్రి దాటాక రోడ్డు పక్కన ఆగి ఉన్న ఒక లగ్జరీ కారు సెగలు కక్కుతూ తగలబడిపోతోంది. అదే సమయంలో ఒక వ్యక్తి అక్కడి నుంచి మాయమైపోయాడు. ఫైరింజన్లు వచ్చాయి. మంటలు అదుపులోకి వచ్చాక లోపల సీటుకు కట్టేసినట్లుగా ఉన్న వ్యాపారవేత్త ఫణీంద్ర మృతదేహం పూర్తిగా కాలిపోయి కనిపించింది.పోలీసులు దీన్ని ఒక ఘోర రోడ్డు ప్రమాదంగా భావించి కేసు క్లోజ్ చేయబోయారు. కానీ ఫణీంద్ర భార్య సుమతి మాత్రం ఇది ప్రమాదం కాదని, తన భర్తను ఎవరో కావాలనే చంపారని క్రైమ్ బ్రాంచ్‌ను ఆశ్రయించింది.
కేసు ఇన్ స్పెక్టర్ అభిమన్యు చేతికి వచ్చింది. అభిమన్యు క్రైమ్ సీన్‌కు వచ్చాడు. కారు శకలాలను, ఫణీంద్ర పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ను క్షుణ్ణంగా పరిశీలించాడు.ప్రమాదం జరిగిన చోట సీసీ కెమెరాలు ఉన్నాయేమోనని పరిశీలించాడు. దూరంగా ఒక పెట్రోల్ బంకు. అక్కడ సీసీ కెమెరాలు ఉన్నాయి. అభిమన్యు ఫణీంద్ర భార్య సుమతిని విచారించాడు.‘కేసులో అనుమానాస్పద విషయాలు ఏమీ లేవు కదా? కేసు ఘోర అగ్ని ప్రమాదంగా భావించి కేసు క్లోజ్ చేద్దామా?’ అభిమన్యుని అడిగాడు కమిషనర్.‘అన్నీ అనుమానాస్పద విషయాలే...’ తన చేతిలో వున్న పోస్ట్‌మార్టం రిపోర్ట్ చూస్తూ అన్నాడు అభిమన్యు.‘ఏమిటవి?’ కమిషనర్ అడిగాడు.‘ఎవిడెన్‌ను ఫిజికల్‌గా తీసుకొస్తాను... మీరు హంతకుడిని అరెస్టు చేయడానికి రెడీగా ఉండండి సర్’ చెప్పి లేచాడు అభిమన్యు.
‘నీపేరు?’ అతని వంకే చూస్తూ అడిగాడు ఇన్‌స్పెక్టర్ అభిమన్యు..‘రవీంద్ర... విజయవాడ బ్రాంచ్ మేనేజర్‌గా ఏడు నెలల క్రితమే వచ్చాను.’ అన్నాడు అతడు.‘అంతలోనే ప్రమోషన్ వచ్చిందా?’ అడిగాడు అభిమన్యు.‘ప్రమోషనా?’ ఆశ్చర్యంగా అడిగాడు రవీంద్ర.‘హంతకుడిగా ప్రమోషన్...’‘నేను హంతకుడినా?’ కాస్త కోపంగా అన్నాడు రవీంద్ర.. ‘వెల్... చాలా తెలివిగా ప్లాన్ చేశావు... నిజం ఒప్పుకొని పోలీసులకు లొంగిపోతే, నేను త్వరగా ఈ కేసు క్లోజ్ చేసి మరో కేసు టేకప్ చేయాలి.’ అన్నాడు ఇన్‌స్పెక్టర్ అభిమన్యు. ‘మీరేం మాట్లాడుతున్నారు? నాకు అర్థం కావడం లేదు. అయినా నేను విజయవాడలో ఉన్నా... నేను హత్య ఎలా చేస్తాను?’ దబాయించబోయాడు రవీంద్ర.
‘విజయవాడ నుంచి నువ్వు కారులో బయలుదేరినట్టు సీసీ కెమెరాల సాక్ష్యం, టోల్ గేట్ల దగ్గర ఫాస్టాగ్ చెల్లింపుల రికార్డు వుంది. ప్రమాదం జరిగిన చోట పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న సీసీ కెమెరాల్లో నువ్వు తగలబడుతున్న కారు దగ్గర ఉన్న విజువల్స్ ఉన్నాయి.ఫణీంద్ర శ్వాసకోశాల్లో పొగ లేదు. సాధారణంగా ఎవరైనా మంటల్లో చిక్కుకుని చనిపోతే, వారు ఊపిరి పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తుల్లోకి కార్బన్ (పొగ) వెళ్తుంది. కానీ ఫణీంద్ర ఊపిరితిత్తులు శుభ్రంగా ఉన్నాయి. అంటే నిప్పు అంటుకోక ముందే అతను ప్రాణాలు విడిచాడు.అత్యాధునిక ఫోరెన్సిక్ స్కానింగ్‌లో ఫణీంద్ర గొంతు వద్ద ఎవరో బలంగా నొక్కిన ఫింగర్ ప్రింట్స్ కనిపించాయి. ఫణీంద్ర కారు డోర్ మీద ఉన్న వేలిముద్రలు ఫణీంద్ర గొంతు మీద ఉన్న వేలిముద్రలతో సరిపోయాయి.
ఇది ప్రమాదం కాదు... పక్కా ప్లా¯Œ తో జరిగిన హత్య. ఫణీంద్రను మొదట గొంతు నొక్కి చంపి, ఆపై కారులో వేసి నిప్పు పెట్టావు. విజయవాడ బ్రాంచ్ ఆఫీసులో కోట్లలో గోల్‌మాల్ జరిగినట్లు ఫణింద్ర భార్య సుమతి ద్వారా తెలిసింది. ఆడిటింగ్ కోసం విజయవాడ వచ్చిన ఫణీంద్రకు నువ్వు చేస్తున్న మోసాలు తెలిశాయి. ఈ విషయం బయటపడితే ప్రమాదం అని భావించి ఈ ఘాతుకానికి పాల్పడ్డావు...’ అభిమన్యు ఆధారాలతో సహా చెప్పాడు.రవీంద్రకు మరో ఆప్షన్ లేదు. పోలీసులు రవీంద్రను అరెస్ట్ చేశారు.మూడు గంటల్లో కేసును సాల్వ్ చేశాడు ఇన్‌స్పెక్టర్ అభిమన్యు.
రచయిత శ్రీ సుధామయి


