Fortune World's 50 Greatest Leaders List: ఫార్చూన్‌ ఉమెన్‌

Fortune World 50 Greatest Leaders List release - Sakshi

ఒకరిది సంరక్షణ మరొకరిది పరిరక్షణ

న్యూయార్క్‌ ప్రధాన కేంద్రంగా వెలువడే అమెరికన్‌ బహుళజాతి వాణిజ్య మాస పత్రిక ‘ఫార్చూన్‌’ ఏటా ‘ది బెస్ట్‌’ అని, ‘ది గ్రేటెస్ట్‌’ అని ర్యాంకింగులు ఇస్తుంటుంది. సాధారణంగా ‘బెస్ట్‌’ అనే ర్యాంకింగ్‌ సంస్థలకు. ‘గ్రేటెస్ట్‌’ అనే ర్యాంక్‌ వ్యక్తులకు ఉంటుంది. ఆ క్రమంలోనే ఈ ఏడాది కూడా ‘50 గ్రేటెస్ట్‌ లీడర్స్‌’ అంటూ.. కరోనా సంక్షుభిత ప్రపంచానికి వివిధ రంగాలలో విశేష నాయకత్వం వహించిన వారిలో యాభై మంది వ్యక్తులను ఎంపిక చేసి ఆ జాబితాను గురువారం విడుదల చేసింది. యాభైలో ఇరవై మందికి పైగా మహిళలే. వారిలో ఇద్దరు భారతీయ మహిళలు. ఒకరు డాక్టర్‌ అపర్ణా హెగ్డే. మరొకరు వర్షిణీ ప్రకాశ్‌. జాబితాలో అపర్ణ 15 వ స్థానంలో, వర్షిణి 28వ స్థానంలో నిలిచారు.

డాక్టర్‌ అపర్ణ యూరోగైనకాలజిస్ట్‌. మహిళల మూత్రనాళ, మాతృ సంబంధ ఆరోగ్య సమస్యల చికిత్సలో నిపుణురాలు. ముంబైలోని ఒక ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యురాలిగా ఆమె కెరీర్‌ ఆరంభమైంది. గర్భిణులలో, తల్లీబిడ్డల్లో ఆకస్మికంగా తలెత్తే అత్యవసర ఆరోగ్య పరిస్థితులకు.. అవి నివారించగలిగినవే అయినా.. సకాలంలో వైద్యం అందక సంభవించిన మరణాలు ఎన్నిటినో ఆమె దగ్గరగా చూశారు. మంచి డాక్టర్లు, చురుకైన నర్సులు, అత్యాధునిక చికిత్సా సదుపాయాలు ఉండి కూడా గ్రామీణ ప్రాంతాల గర్భిణుల వరకు ఆ సేవలు, లేదా ఆ సేవల వరకు గర్భిణులు వెళ్లలేకపోతే ఏమిటి ప్రయోజనం? ఏదైనా చేయాలనుకున్నారు అపర్ణ. ఆమె స్వరాష్ట్రం కర్ణాటక. అక్కడి ఓ గ్రామంలోనే ఆమె జన్మించారు.

ముంబై నుంచి ఊరికి వచ్చినప్పుడు ఓ రోజు.. ఉపాధి పనుల కోసం వెళుతున్న ఓ గిరిజన మహిళను చూశారు అపర్ణ. ఆమె చేతిలో మొబైల్‌ ఫోన్‌ ఉంది! ఎస్‌.. మొబైల్‌ ఫోన్‌తోనే వైద్యసౌకర్యాలకు, మారుమూల ప్రాంతాల గర్భిణులకు వారధి నిర్మించాలి అనుకున్నారు అపర్ణ. అలా 2008లో ఆవిర్భవించినదే ‘అర్మాన్‌’. మాతాశిశు మరణాలను తగ్గించడం కోసం, మహిళలకే ప్రత్యేకమైన అనారోగ్య సమస్యల నుంచి వారికి విముక్తి కల్పించడం కోసం అర్మాన్‌ను ఒక పెద్ద నెట్‌వర్క్‌గా నిర్మించుకుంటూ వచ్చారు అపర్ణ. లాభార్జన ధ్యేయం లేని సంస్థ కాబట్టి ఆరంభంలో నిధులు రాలేదు. ఆ తర్వాత ప్రభుత్వమే భారీ భాగస్వామ్య సహకారంతో ముందుకు వచ్చింది.

ప్రస్తుతం అర్మాన్‌ దేశవ్యాప్తంగా 17 రాష్ట్రాలలో గర్భిణులకు ప్రసూతి సేవలతోపాటు, మహిళల మానసిక సమస్యలకు చికిత్సను అందిస్తోంది. గర్భస్థ, నవజాత శిశువు అనారోగ్యాలను నయం చేసి తల్లీబిడ్డలకు పునర్జన్మనిస్తోంది. ఈ పదమూడేళ్లలో అర్మాన్‌ 2 కోట్ల 40 లక్షల మంది మహిళలకు చేరువ కాగలిగింది. వీళ్లలో ఒక్కరు ఒక్క ఫోన్‌ కాల్‌ చేసినా అర్మాన్‌లోని సుశిక్షితులైన 1,70, 000 మంది స్థానిక ఆరోగ్య కార్యకర్తల్లో ఆ దగ్గర ఉన్నవారు వెంటనే వెళ్లి వాళ్లను కలుస్తారు. వారికి అవసరమైన వైద్య సేవలు అందేలా శ్రద్ధ తీసుకుంటారు. గత పదిహేను నెలలుగా అర్మాన్‌ బాధ్యత రెట్టింపైంది. ప్రసూతి వార్డులు కూడా కరోనా వార్డులుగా మారిపోవడంతో గర్భిణులకు అర్మాన్‌ విడిగా ప్రత్యేక ఏర్పాట్లు, ప్రత్యామ్నాయాలు చూడవలసి వస్తోంది. ‘దేశ భవిష్యత్తుకు జన్మనివ్వడం’ అనే నినాదంతో, తల్లీబిడ్డ ఆరోగ్య సంరక్షణకు, సంక్షేమానికి కృషి చేస్తున్న అపర్ణను ఈ ఏడాది ‘గ్రేటెస్ట్‌ లీడర్స్‌’లో ఒకరిగా ఫార్చూన్‌ ఎంపిక చేయడానికి వైద్యసేవల రంగంలో, అదీ ఇప్పటి పరిస్థితుల్లో ఇంతకు మించిన గొప్ప కారణం ఏముంటుంది?  

వర్షిణీ ప్రకాష్‌ ప్రవాస భారతీయురాలు. బోస్టన్‌లో ఉంటారు. పుట్టడం, పెరగడం అంతా యూఎస్‌లోనే. వాతావరణ కార్యకర్త వర్షిణి. పరిశ్రమలు పెరగడం, చెట్లు కూలిపోవడం, ఆకాశం మసి బొగ్గు అవడం కళ్లారా చూస్తూ ఉన్న వర్షిణికి ఓ రోజు భయం కలిగింది. మనిషి భవిష్యత్‌ ఏంటి అనిపించింది. జనరేషన్‌ జడ్‌ అమ్మాయి వర్షిణి. శారా బ్లేజ్‌విక్‌ అనే తన ఫ్రెండ్‌తో కలిసి ‘సన్‌రైజ్‌ మూవ్‌మెంట్‌’ అనే సంస్థను ప్రారంభించారు. వాతావరణానికి హితం కాని చర్యల్ని లీగల్‌గా అడ్డుకోవడం ఈ సంస్థ పని. ఇందులో సైనికులంతా యువతీ యువకులే. ఇంత వయసనేం లేదు, పచ్చదనాన్ని కోరుకునే హృదయమైతే చాలు. పచ్చదనం అనే మాటకు పైపై అర్థం తీసుకోకండి. ‘ప్రజా విముక్తి పోరాటం’ అనే పెద్ద అర్థమే ఆ సంస్థకు ట్యాగ్‌ లైన్‌గా ఉంది. సంస్థ నినాదం కూడా అదే.

వాతావరణంలోని ప్రతికూల మార్పులకు జాతి వివక్ష, లైంగిక అసమానత్వం, ఆర్థిక వ్యత్యాసాలు, భౌగోళిక పరిస్థితులు అన్నీ కారణమేనంటారు వర్షిణీ, శారా. ‘అర్మాన్‌’ కు ఇండియాలో అతి పెద్ద నెట్‌వర్క్‌ ఉన్నట్లే, సన్‌రైజ్‌ మూవ్‌మెంట్‌కు యూఎస్‌లో విస్తృతంగా యువసైన్యం ఉంది. వాళ్లంతా పెద్ద పెద్ద డిగ్రీలు, పెద్ద హోదాల్లో ఉన్నవారు. సంస్థ 2017లో ప్రారంభమైంది. సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వర్షిణి. శారా ట్రైనింగ్‌ డైరెక్టర్‌. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో వీళ్లు బైడెన్‌కు మద్దతుగా నిలబడ్డారు. అలాగని ఆయన్నేమీ పూర్తిగా సమర్థించలేదు. శిలాజ ఇంధన విరాళాలను పోగు చేసిన కొందరు రాజకీయ నాయకులకు బైడెన్‌ మద్దతు ఇవ్వడం వారికి నచ్చలేదు. ముఖాన్నే చెప్పేశారు. అలాగే ‘గ్రీన్‌ న్యూ డీల్‌’కి బైడెన్‌ ముఖం చాటేయడాన్ని కూడా వర్షిణి నిర్మొహమాటంగా విమర్శించారు. ఇది చాలదా ‘గ్రేటెస్ట్‌ లీడర్‌’ అవడానికి! వర్షిణితో పాటు శారాకు కూడా ఈ ‘గ్రేటెస్ట్‌’ ర్యాంకింగ్‌లో సగ భాగం ఇచ్చింది ఫార్చూన్‌.

ఫార్చూన్‌ ‘50 గ్రేటెస్ట్‌ లీడర్స్‌’ తాజా జాబితాలో జసిండా ఆర్డెర్న్‌ (న్యూజీల్యాండ్‌ ప్రధాని) మొదటి స్థానంలో ఉన్నారు. మలాలాకు 31వ స్థానం దక్కింది. మహిళల్లో ఇంకా.. జెస్సికా టాన్, స్టేసీ అబ్రామ్, రెషోర్నా ఫిట్జ్‌ప్యాట్రిక్, డాలీ పార్టన్, విల్లీ రే ఫెయిర్లీ, కేట్‌ బింగ్హామ్, మెకన్జీ స్కాట్, డాక్టర్‌ యాలా స్టాన్‌ఫోర్డ్, టిమ్నిట్‌ గెబ్రూ, డయానా బెరెంట్, అడెనా ఫ్రైడ్‌మేన్, నికోల్‌ మేసన్, మేగన్‌ ర్యాపినో, ఫాజియా కూఫీ, నటాలియా రోడ్రిగ్స్, ఆరోరా జేమ్స్, నవోమీ ఒసాకా ఫార్చూన్‌ లిస్ట్‌లో ఉన్నారు.

 

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top