
పోటీలు, కార్యక్రమాల్లో కనిపించని తెలుగు చిత్ర
పరిశ్రమ ప్రముఖులు బెంగళూరు,
ముంబైల్లో అలా..ఇక్కడే ఎందుకు ఇలా..?
హైదరా‘బాత్’.. క్యా హై!
తమ గ్లోబల్ ఈవెంట్ మరింత ప్రజాదరణ పొందేలా చేయడానికి మిస్ వరల్డ్ పోటీ నిర్వాహకులు దేశంలోని సినీ రంగ ప్రముఖులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపడం సాధారణమే. ఫ్యాషన్, గ్లామర్, సామాజిక సేవ అనే రంగాల సంగమంగా ఈ వేడుక సాగుతుంది కాబట్టి సినిమా రంగం తోడ్పాటును వారు ఎప్పుడూ ఆహా్వనిస్తారు. కొన్ని సందర్భాల్లో సెలబ్రిటీలు జడ్జీలుగా లేదా స్పెషల్ గెస్టులుగా కూడా పాల్గొంటారు. అయితే ఈ దఫా ఈవెంట్‌లో జడ్జిగా ఇప్పటివరకూ ఒక్క సోనూసూద్ పేరు తప్ప మరెవరి పేరూ వినిపించడం లేదు. అలాగే నగరం వేదికగా జరుగుతున్న ఈ పోటీల్లో నాగార్జున లాంటి ఒకరిద్దరు తప్ప టాలీవుడ్ సెలబ్రిటీల జాడ కనపడడం లేదు.
ఇటీవలి కాలంలో పాన్ ఇండియా సార్లుగా పేరు తెచ్చుకున్న పలువురు టాలీవుడ్ నటులు ఈ పోటీల వైపు కన్నెత్తి చూస్తున్నట్టు గానీ, వీటి గురించి పన్నెత్తి మాట్లాడుతున్నట్టు గానీ లేదు. తుది పోటీలకు ఇంకా కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో.. ఫైనల్స్‌లో అయినా టాలీవుడ్ తారలు సందడి చేస్తారని, నగర ప్రతిష్టను అంతర్జాతీయంగా ఇనుమడింపజేసే ఈవెంట్‌కు అదనపు జోష్ జత చేస్తారని ఆశిద్దాం.
సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అత్యంత పురాతనమైన అందాల పోటీ మిస్ వరల్డ్. ఈ పోటీలు మన దేశపు అతివల అందాన్ని మాత్రమే కాదు మేధస్సును, శక్తియుక్తులను ప్రపంచానికి అనేకసార్లు చాటి చెప్పాయి. ఈ పోటీలకు ఆతి«థ్యం ఇచ్చే అవకాశం తొలిసారి ఓ తెలుగు రాష్ట్రానికి, అందులోనూ తెలంగాణకు దక్కింది. గత కొన్నిరోజుల క్రితం ప్రారంభమైన ఈ పోటీలు వైభవోపేతంగా జరుగుతున్నాయి.
వివిధ రకాల పోటీల్లో పాల్గొంటూ సుందరీమణులు సందడి చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఇంత హల్‌చల్ జరుగుతున్నా.. టాలీవుడ్ మాత్రం అంత పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖుల నిరాసక్తత చర్చనీయాంశంగా మారుతోంది. నేరుగా మోడలింగ్, సినిమాలతో అనుబంధం కలిగి ఉండే ఈ పోటీల విషయంలో చిత్ర పరిశ్రమ తీరు ఆశ్చర్యకరంగా, ఒకింత ఆక్షేపణీయంగా కూడా ఉంది.
బెంగళూరు.. బాలీవుడ్ సందడి
ప్రపంచ సుందరి పోటీలు భారత్‌లో ఇంతకుముందు రెండుసార్లు జరిగాయి తొలుత బెంగళూరులో 1996లో జరగగా, 2024లో ముంబయిలో జరిగాయి. ఈ రెండు సందర్భాల్లోనూ మిస్ వరల్డ్ ఈవెంట్‌కు భారతీయ సినిమా పరిశ్రమ నుంచి విశేష మద్దతు లభించింది. తొలిసారి బెంగళూరులో జరిగిన పోటీల నిర్వహణ బాధ్యతలను బిగ్ బి అమితాబ్ బచ్చన్‌కు చెందిన ఏబీసీఎల్ తలకెత్తుకోగా.. బాలీవుడ్ నుంచి పలువురు తారాగణం తరలివచ్చి ఆ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ముఖ్యంగా మన తొలి మిస్ వరల్డ్‌గా ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన, బాలీవుడ్ స్టార్ ఐశ్వర్యా రాయ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
ముంబై... స్టార్స్ జై
ముంబైలో నిర్వహించిన మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ బాధ్యతల్లో బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్, మేగన్ యంగ్ సంస్థలు పాలుపంచుకున్నాయి. అప్పుడు కూడా భారతీయ సినీ పరిశ్రమల నుంచి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. బాలీవుడ్ నుంచి కరణ్ జోహార్‌తో పాటు దీపికా పదుకొణె, ఆలియా భట్..దక్షిణాది నుంచి మణిరత్నం, ప్రకాశ్ రాజ్, రమ్యకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఇక ఐశ్వర్యారాయ్, ప్రియాంకా చోప్రా, మానుషి చిల్లర్ వంటి మిస్ వరల్డ్ మాజీ విజేతలు ఆ పోటీలకు అదనపు ఆకర్షణ చేకూర్చారు. ఇక కృతిసనన్, పూజా హెగ్డే, సోనాక్షి సిన్హా, మన్నారా చోప్రా తదితర హీరోయిన్లతో పాటు నిర్మాత, దర్శకుడు సాజిద్ నడియాడ్‌వాలాలు న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ఈ పోటీలకు హాజరైన వారిలో బాలీవుడ్ చిన్నితెర ప్రముఖులు కూడా ఉండడం విశేషం. రుబీనా దిలైక్, అభినవ్ శుక్లా, దివ్యాంకా త్రిపాఠి, వివేక్ దహియా తదితర చిన్నితెర స్టార్స్ కూడా హాజరయ్యారు. బాలీవుడ్ గాయనీ గాయకులు నేహా కక్కర్, టోనీ కక్కర్‌లు, షాన్‌లు తమ సంగీత ప్రదర్శనలతో అలరించారు.