
ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ నందిని గుప్తా(Nandini Gupta) రాజస్థాన్‌లోని ఓ పల్లెటూరిలో రైతు కుటుంబంలో జన్మించింది. ‘అందరికీ నమస్కారం.. నేను మీ నందిని..’ అంటూ తెలుగులో చిరునవ్వుతో పలకరించిన ఈ బ్యూటీ మిస్ వరల్డ్‌పోటీలోపాల్గొనేంతగా తనను తాను ఎలా నిర్మించుకుందో వివరించింది. ‘ఎక్కడ నుంచి వచ్చాం అన్నది ముఖ్యం కాదు, ఎక్కడికి వెళ్లాం.. అన్నదే ముఖ్యం’ అన్న ఆత్మవిశ్వాసంతోపాటు భవిష్యత్తు ప్రణాళికలనూ మన ముందుంచింది మిస్ వరల్డ్– 2025 కాంటెస్ట్‌లో భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహిస్తున్న నందిని గుప్తా.
‘‘అమ్మానాన్నలకు నేను, చెల్లి సంతానం. స్కూల్‌లో చదివేటప్పుడే ఐశ్వర్యరాయ్ మిస్ వరల్డ్ అయినప్పుడు ఆమెను చాలా మంది అభినందించడం, కెమెరా ఫ్లాష్ లైట్లలో వెలిగిపోతుండటం టీవీలో చూసి... ‘ఆమె ఎవరు?’ అని అమ్మను అడిగాను. ‘ఆమె మిస్ వరల్డ్, నటి’ అని చెప్పింది అమ్మ. నా మనసులో ఆనాటి సంఘటన బలంగా ముద్రించుకుపోయింది. అప్పటినుంచి అందంగా ఉండటానికి ప్రయత్నాలు మొదలుపెట్టాను.
మంచి డ్రెస్సులు వేసుకునేదాన్ని, మేకప్ చేసుకునేదాన్ని, హెయిర్‌స్టైల్స్ మార్చేదాన్ని. అందాలపోటీలోపాల్గొనడానికి ఏమేం చేయాలో తెలుసుకుంటూ ఉండేదాన్ని. ఓ రైతు కూతురు కలలు కనే ధైర్యం చేయవచ్చా! అనే ఆలోచన లేకుండా నా ప్రయాణాన్ని కొనసాగించాను. నా ఆసక్తులు గమనించిన అమ్మానాన్నలు ఆ తర్వాత మా కుటుంబాన్ని ముంబయ్‌కి షిఫ్ట్ చేశారు. ఆ విధంగా ఆవాలు పండే పోలాల మధ్య పెరిగిన నేను ముంబయ్ ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టాను.
మాట్లాడాలంటే బెరుకు
పోటీలలోపాల్గొనే కొత్తలో వేదికలపైన నా గురించి నేను చెప్పుకోవడానికి, మైక్ ముందు మాట్లాడటానికి సిగ్గుపడేదాన్ని. ఏదో తెలియని బెరుకు ఉండేది. ఇలా అయితే రాణించలేను అనుకున్నాను. నా శక్తి ఏంటో ప్రపంచానికి తెలియజేయాలని ప్రయత్నించాను. నన్ను నేను కొత్తగా నిర్మించుకోవడంలో ఎలా ఉన్నాను, ఎలా ఉండాలనుకుంటున్నాను అనే విషయాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. నా డ్రెస్, మేకప్, నా మాట, చూపు అన్నీ సమర్థంగా ఉన్నప్పుడు దేనికీ వెనకంజ వేయనక్కర్లేదు అని తెలుసుకున్నాను. ఆ ఆత్మవిశ్వాసమే ఈ రోజు ఇలా మీ ముందుకు తీసుకువచ్చింది.
మార్పునకు శ్రీకారం
అందాలపోటీలవైపు వెళ్లేటప్పుడు మొదట్లో తటపటాయించినప్పటికీ మిస్ రాజస్థాన్ టైటిల్ గెలిచాక నా ఇష్టానికి మద్దతు ఇచ్చారు మా నాన్న. ఫెమినా మిస్ ఇండియాపోటీల్లో గెలిచాక అయితే ఆయన చాలా ఉద్వేగానికి గురయ్యారు. ఆ క్షణాలు ఎప్పటికీ మరవలేను. చదువంటే నాన్నకు చాలా ఇష్టం. నాన్న కోరిక మేరకు బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేశాను. నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో అమ్మాయిలు తల మీదుగా ముసుగు ధరించాలి, వారికి పెద్దగా చదువు అక్కర్లేదు, త్వరగా పెళ్లి చేయాలనే ఆలోచన అక్కడి తల్లిదండ్రుల్లో ఉండేది. ఇప్పుడు అక్కడా బ్యూటీ కాంటెస్ట్‌లకు ట్రైనింVŠ ఇచ్చే అకాడమీలు పెరిగాయి. తల్లిదండ్రులు కూడా తమ కూతుళ్లను బ్యూటీ కాంటెస్ట్‌లోపాల్గొనడానికి పోత్సహిస్తున్నారు. ఇది నాకెంతో సంతోషాన్ని ఇస్తోంది.
దివ్యాంగుల సాధికారత కోసం..
దివ్యాంగులను సమాజంలో ఒక భాగం చేయడం కోసం పనిచేయడమే నా లక్ష్యం. మా మేనమామ పుట్టుకతోనే దివ్యాంగుడు. సరిగా మాట్లాడలేరు. కానీ, ఎప్పుడూ మానసిక స్థైర్యంతో ఉంటారు. చిన్నప్పటి నుంచి అతని కళ్ల నుంచి ప్రపంచాన్ని చూశాను. కనిపించని బాధ ఏదో మోస్తున్నట్టుగా అతనిలో నాకు కనిపించేది. అలాంటి వాళ్లు పడుతున్న బాధలు స్వయంగా చూశాను. వికలాంగుల గాధలు చాలా బాధనిపించేవి. మిస్ ఇండియా వరల్డ్ టైటిల్ గెలిచాక ‘ఏక్తా ప్రాజెక్టు’లో భాగంగా అనేక మంది దివ్యాంగులతో కలిసి పలు కార్యక్రమాల్లోపాల్గొన్నా. వారి కలల సాకారానికి కృషి చేయాలనుకున్నాను.
భవిష్యత్తు ప్రణాళికలు
ఇప్పటికే మోడల్‌గా ప్రకటనలలో యాక్ట్ చేస్తున్నాను. తెలుగు సినిమాలు, డ్యాన్స్‌లు అంటే చాలా ఇష్టం. మహేష్‌బాబు నటించిన సినిమాలో ‘కుర్చీ మడతపెట్టి .. ’సాంగ్ మరీ మరీ ఇష్టం. ఆపాట విన్నప్పుడల్లా డ్యాన్స్ చేస్తుంటా. నటిగా నన్ను నేను నిరూపించుకోవాలని ఉంది’’ అంటూ వివరించింది ఈ బ్యూటీ. – నిర్మలారెడ్డి
రాజస్థాన్‌లోని కోటాకు దగ్గర్లో ఉన్న చిన్న పల్లెటూరులో రైతు కుటుంబంలో పుట్టి పెరిగింది నందిని గుప్తా. స్థానిక హస్తకళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో కోటా డోరియా వస్త్రాల ప్రాచుర్యానికి కృషి చేస్తోంది. ఫ్యాషన్‌లోనూ తన మూలాలను చూపించేలా దుస్తుల ఎంపికలో ప్రత్యేక శైలినిపాటిస్తోంది. యోగా, డ్యాన్స్, హెల్తీ డైట్‌నుపాటించడమే తన బ్యూటీ సీక్రెట్ అని తెలిపింది.