మళ్ళీ పాతరోజుల్లోకి యువత | Fashion Revival of Old Striped Boxer | Sakshi
Sakshi News home page

తాతగారి గళ్ళ నిక్కర్ రూ. 11,000

Oct 24 2025 2:18 PM | Updated on Oct 24 2025 2:34 PM

Fashion Revival of Old Striped Boxer

కాలం వెనక్కి నడుస్తున్నట్లుంది... డెబ్బై.. ఎనభైల్లో మాదిరి బతకడం ఇప్పుడు ఫ్యాషన్ అయింది.. మట్టి కుండల్లో వంట చేయడం.. చెట్లు చేమల్లో తిరగడం.. వాగుల్లో స్నానం చేయడం.. మజ్జిగన్నం.. ఉల్లిపాయ.. రాగిసంకటి.. నాటు కోడి కూరా.. నాటు పుట్టగొడుగులు.. అమ్మమ్మ ఊళ్లోకి వెళ్లి నాలుగురోజులు ఉండడం.. ఇవన్నీ మళ్ళీ కొత్తగా మొదలయ్యాయి..

యువత కూడా వాటిని బాగానే ఆదరిస్తోంది.. చిరంజీవి.. నాగార్జున సినిమాలు రీ రిలీజ్ చేయడం.. అమ్మాయిలు.. పట్టు పరికిణీలు వేసుకోవడం.. వాలు జాడలు.. వెండిపట్టీలు.. ఇవన్నీ మళ్ళీ ట్రేండింగ్ అయ్యాయి.. ఇదేమాదిరి. కుర్రాళ్ళు కూడా పంచె లాల్చీ వేసుకోవడం.. బుర్ర మీసాలు పెంచడం.. కిర్రు చెప్పులు వేయడం.. ఊళ్ళో పందిరి కింద వెన్నెల్లో మంచం వేసి అమ్మమ్మ..తాతయ్యతో కబుర్లు చెప్పుకోవడం..కోడి పందాలు..ఊళ్ళోని పిల్లలతో గోళీలాట.. ఇవన్నీ మళ్ళీ ట్రెండింగ్ అయ్యాయి.

దీంతోబాటు కొంతమంది ఓల్డ్ ఫ్యాషన్ ను అవలంబిస్తూ ఎన్టీఆర్ ఏఎన్నార్ మాదిరి బెల్ బాటమ్ ఫ్యాంట్లు వేయడం.. వాణిశ్రీ లెక్క సిగ ముడి వేయడం..ఇవి కూడా ట్రెండింగ్ ఉండేది కొన్నాళ్ళు. 

 అయితే ఇప్పుడు ఏకంగా మన తాతలు కాలంలో  వేసుకునే గళ్ళ నిక్కర్ ఇప్పుడు అతి పెద్ద ట్రెండ్ అయి కూర్చుంది. పాతిక ముప్పై ఏళ్ల క్రితం ప్యాంట్లు.. పంచెకట్టు లోపల గళ్ళ నిక్కర్లు వేసుకునేవాళ్ళు..దానికి ఒక లాడా కూడా ఉండేది..దాన్ని లాగితే సులువుగా నిక్కర్ విప్పేసుకోవచ్చు..పైగా ఖద్దరు వస్త్రం కాబట్టి శరీరానికి సౌకర్యంగా ఉంటుంది.. చెమట పీల్చుతుంది.. వ్యవసాయ పనుల్లోనూ..నిద్ర పోయేటపుడు కూడా హాయిగా ఉండేది. ఇప్పుడు మళ్లీ ఆ నిక్కర్లు ఆన్లైన్ లో అమ్మకానికి పెట్టారు.  

హెచ్ అండ్ ఎం అనే కార్పొరేట్ బ్రాండింగ్ స్టోర్లో ఈ చెడ్డీలు అమ్మకానికి ఉంచారని వాటి ధర మాత్రం రూ.2500 నుంచి రూ.11,000 వరకు ఉందంటూ ఏవియేటర్ అనిల్ చోప్రా అనే ఆయన తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ లో పోటోలు వీడియోలు పోస్ట్ చేశారు. మా తాతయ్య కాలంలో వేసుకునే గళ్ళ చెడ్డీలు మళ్ళీ వచ్చాయి కానీ ధర బాగా ఎక్కువే ఉంది అంటూ ఆయన చేసిన పోస్ట్ విపరీతంగా వైరల్ అయింది.
వాస్తవానికి ఆ చెడ్డి మహా అయితే ఓ రెండు వందలు ఉండచ్చు కానీ దాన్ని ఈ కార్పొరేట్ సంస్థలు బ్రాండింగ్ చేసి ఏకంగా రూ.11,000 వరకు పెట్టి  విక్రయిస్తుండగా యూత్ కూడా అంతే క్రేజీతో కొంటున్నారు. కొత్త ఒక వింత..పాత ఒక రోత అని అనుకుంటాం కానీ ఇప్పుడు పాత బంగారానికే డిమాండ్ ఎక్కువ..దానిపైనే మోజు పెరుగుతోందని అర్థం అవుతోంది.

  • సిమ్మాదిరప్పన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement