వాట్సప్‌ ‘చాట్‌ బాట్‌’ ద్వారా ప్రకృతి సేద్యంలో మిరప సాగుపై సూచనలు.. ఈ నెంబర్లను సంప్రదించండి

Experts Suggestions On Organic Chilli Cultivation Through Whatsapp Chat Baat - Sakshi

రసాయనిక ఎరువులు, పురుగుమందులు అసలు వాడకుండా పూర్తిగా ప్రకృతి వ్యవసాయంలో మిరప పంటను సాగు చేయటం ఎన్నో సవాళ్లతో కూడిన కష్టతరమైన విషయం. అయితే, అసాధ్యం కాదని నిరూపిస్తున్న అనుభవజ్ఞులైన రైతులు తెలుగు రాష్ట్రాల్లో పలువురు ఉన్నారు. అయితే, ఏ రైతైనా వ్యక్తిగతంగా తమకు ఫోన్‌ చేసే రైతులు కొద్ది మందికి మాత్రమే తమ జ్ఞానాన్ని అందించగలుగుతారే తప్ప.. వేలాది మందికి అందించలేరు. పంట కాలం పొడవునా ఎప్పుడంటే అప్పుడు చప్పున ఆయా రైతులకు సులువుగా అర్థమయ్యే మాటల్లో చెప్పగలగటమూ అసాధ్యమే. 

అయితే, అత్యాధునిక సాంకేతికత ‘కృత్రిమ మేథ’ ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తోంది. రైతు తన మొబైల్‌లోని ‘వాట్సప్‌’ ఆప్‌ ద్వారా ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేయవచ్చునని ‘డిజిటల్‌ గ్రీన్‌’ సంస్థ రుజువు చేస్తోంది. వాట్సప్‌లో ‘చాట్‌బాట్‌ టెక్నాలజీ’ని వినియోగించడం ద్వారా ఈ పనిని సంకల్పంతో సుసాధ్యం చేస్తోంది డిజిటల్‌ గ్రీన్‌.  ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో మిరప సాగులో గుంటూరు జిల్లా కొప్పర్రు గ్రామానికి చెందిన రైతు దంపతులు కోటేశ్వరమ్మ, వెంకటేశ్వరరావు సిద్ధహస్తులు. ఎకరానికి 26 క్వింటాళ్ల ఎండు మిర్చి దిగుబడి తీస్తున్న వీరి సుసంపన్నమైన అనుభవాలను శాస్త్రీయ పద్ధతుల్లో రికార్డు చేసిన డిజిటల్‌ గ్రీన్‌ సంస్థ.. వీరి అనుభవాలను తెలుగు నాట వేలాది మంది మిరప రైతులకు అత్యంత సులువైన రీతిలో, అచ్చమైన తెలగులో, ఉచితంగా వాట్సప్‌ చాట్‌బాట్‌ ద్వారా అందిస్తోంది. 

ఇందుకు రైతు చేయాల్సిందేమిటి? 
చాలా సులభం.. డిజిటల్‌ గ్రీన్‌ వాట్సప్‌ నంబరు 75419 80276కు వాట్సప్‌ లో రైతు జిజీ అని మెసేజ్‌ పంపితే చాలు. డిజిటల్‌ గ్రీన్‌ వాట్సప్‌ చాట్‌ బాట్‌ సేవలను ఎలా ఉపయోగించుకోవాలో తెలుపుతూ రైతు వాట్సప్‌ కు వెంటనే తెలుగులో మెసేజ్‌ రూపంలో వస్తుంది. అందులో పేర్కొన్న సూచనలతో పాటు రైతు తన మిరప పంట ఎన్ని రోజుల దశలో వుందో ఆయా ఐచ్చికాల (ఆప్షన్స్‌)ను మెసేజ్‌ రూపంలో చాట్‌ బాట్‌ పంపుతుంది. రైతు తన మిరప పంట ఐచ్చికాన్ని ఎంచుకొని పంపిన వెంటనే, ఆ రైతు మిరప పంట దశను సేవ్‌ చేసుకుంటుంది. 

రైతు మొదటిసారి తెలియజేసిన పంట దశ ఆధారంగా రాబోయే పంట దశను చాట్‌ బాటే స్వయంగా అంచనా వేసి.. ప్రతి దశ లో పాటించవలిసిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను లేదా తీసుకోవలసిన జాగ్రత్తలను వాట్సప్‌లో వీడియో రూపంలో పంపుతుంది. ఒక్క చెంచాడు రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడకుండా మిరప నారు పోసుకునే దగ్గర నుంచి ఎండు మిరప కాయలు అమ్ముకునే వరకు.. వేలాది మంది రైతులు ఏకకాలంలో, ఎప్పుడంటే అప్పుడు వాట్సప్‌ ద్వారా మేలైన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకోవడానికి అవకాశం ఉంది. సేంద్రియ మిరప కాయలకు దేశ విదేశాల్లో గిరాకీ పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో డిజిటల్‌ గ్రీన్‌ చొరవ రైతులకు ఎంతగానో తోడ్పడుతుందనటంలో సందేహం లేదు.
►మిరప రైతులు ప్రకృతి వ్యవసాయ సూచనల కోసం వాట్సప్‌ ద్వారా సంప్రదించాల్సిన మొబైల్‌ నంబరు : 75419 80276. 

అనంతపురం జిల్లాలో సెప్టెంబర్‌ 26, 27 తేదీల్లో డా. ఖాదర్‌ సదస్సులు 
స్వతంత్ర ఆహార, ఆరోగ్య శాస్త్రవేత్త డా. ఖాదర్‌ వలి అవగాహన సదస్సులు కరోనా అనంతరం మళ్లీ ప్రారంభమయ్యాయి. అనంతపురం జిల్లాలో ఈ నెల 26 (ఆది), 27 (సోమ) తేదీల్లో సదస్సులు జరగనున్నాయి. జిల్లా అధికార యంత్రాంగం తోడ్పాటుతో అనంత ఆదరణ మిల్లెట్స్‌ ఫార్మర్స్‌ ప్రొడ్యూసర్‌ కంపెనీ ఈ సదస్సులను నిర్వహిస్తున్నట్లు ‘ఆదరణ’ రామకృష్ణ, ప్రొఫెసర్‌ గంగిరెడ్డి తెలిపారు. సిరిధాన్యాల సాగులో మెలకువలు, సిరిధాన్యాలను రోజువారీ ఆహారంగా తీసుకోవడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందే మార్గాలపై డా. ఖాదర్‌ వలి అవగాహన కల్పిస్తారు.

►సెప్టెంబర్‌ 26న ఉ. 10 గంటకు రాప్తాడు మండలం హంపాపురంలోని ఆదరణ సమగ్ర పాడి పంట ప్రకృతి వ్యవసాయ క్షేత్రంలో, 26న మధ్యాహ్నం 3 గంటలకు సింగనమలలో ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో ఉచిత రైతు అవగాహన సదస్సులు జరుగుతాయి.
►సెప్టెంబర్‌ 27న ఉ. 10 గంటలకు పర్తిశాల పుట్టపర్తిలో సత్యసాయి సెంట్రల్‌ ట్రస్ట్‌ మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌. జె. రత్నాకర్, ఎమ్మెల్యే శ్రీధరరెడ్డి ఆధ్వర్యంలో డా. ఖాదర్‌ వలి సదస్సు జరుగుతుంది.
►సెప్టెంబర్‌ 27న సా. 4 గంటలకు లేపాక్షిలోని ఆర్‌.జి.హెచ్‌. కల్యాణ మండపంలో మార్కెట్‌ యార్డ్‌ కమిటీ చైర్మన్‌ కొండూరు మల్లికార్జున తదితరుల ఆధ్వర్యంలో సదస్సు జరుగుతుంది. 
►ఇతర వివరాలకు.. ఆదరణ రామకృష్ణ – 98663 45715, ప్రొ. వై. గంగిరెడ్డి – 98483 87111.

చదవండి: ఇళ్లు లేని విద్యార్థులకు ఏకంగా 150 ఇళ్లు కట్టించన టీచర్‌.. ఎక్కడంటే..

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top