అర్ధభాగాలకూ పూర్తి జీతాలు! అమ్మానాన్నలకూ పింఛన్లు!!

Dr Sohan Roy Sensational Statement About Employees Working In His Company - Sakshi

ఎరిస్‌ రాయ్‌ కంపెనీ లా 

ప్రస్తుత సమాజంలో నీతులు చెప్పేవారు బోలెడు మంది. ఆచరణలో పెట్టి ఆదర్శంగా నిలిచేవారు కొందరే ఉంటారు. ఈ కోవకు చెందిన వారే డాక్టర్‌ సోహన్‌ రాయ్‌. తన కంపెనీలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలివ్వడమేకాకుండా.. వారి భార్యలకు వేతనాలు, ఉద్యోగి తల్లిదండ్రులకు పెన్షన్‌ ఇస్తానని సంచలన ప్రకటన చేశారు రాయ్‌. ప్రపంచానికి ఊపిరాడకుండా  ఉక్కిరిబిక్కిరి చేసిన కరోనా ధాటికి బడా కంపెనీలు సైతం ఖర్చులు తగ్గించుకోవడం కోసం వేతనాల్లో కోత, ఉద్యోగాల తొలగింపు వంటి చర్యలు చేపట్టాయి. రాయ్‌ మాత్రం ఏ ఒక్క ఉద్యోగిని తొలగించకపోగా ఉద్యోగి కుటుంబ బాగోగులను చూస్తున్నారు.

సోహన్‌ రాయ్‌ కేరళకు చెందిన వ్యక్తి. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో స్థిరపడిన ఆయన షార్జా కేంద్రంగా ఎరిస్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీలను స్థాపించి విజయవంతంగా నడుపుతున్నారు. తన వ్యాపార సామ్రాజ్యంలో ఎంతో సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తున్న ఆయన 2017లో ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌లో అత్యంత ప్రభావశీల వ్యాపారవేత్తల జాబితాలో ఒకరుగా నిలిచారు. మహమ్మారి విజృంభణ సమయంలో నిబద్ధత, వర్క్‌ ఎథిక్స్‌ను దృష్టిలో పెట్టుకుని అహర్నిశలూ కంపెనీ వృద్ధికి పాటుపడిన ఉద్యోగుల.. భార్యలకు రెగ్యులర్‌ ప్రాతిపదికన నెలవారి జీతాలు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు ప్రస్తుతం ఎరిస్‌ గ్రూప్‌ కంపెనీలలో పనిచేస్తున్న ఉద్యోగుల డేటా బేస్‌ను కంపెనీ సిద్ధం చేస్తోంది. ఉద్యోగి ఎన్ని ఏళ్ల నుంచి కంపెనీలో పనిచేస్తున్నారో దాని ఆధారంగా .. వాళ్ల భార్యలకు నెలకు ఎంత జీతం ఇవ్వాలో నిర్ణయిస్తారు.

‘ఒక ఉద్యోగి కంపెనీలో పనిచేస్తున్నారంటే ఇంట్లో ఉండే భార్య తోడ్పాటు ఎంతో ఉంటుంది. ప్రతిమగవాడి విజయం వెనుక స్త్రీ ఉంటుందన్న మాటను నేను బలంగా నమ్ముతాను అని రాయ్‌ చెప్పారు. వారు అన్ని విధాలా తన భర్తకు సపోర్టు చేయడంవల్లే.. ఆ ఉద్యోగి కంపెనీని వృద్ధిపథంలో నడిపించగలుగుతాడు. కానీ భార్యల శ్రమను ఎవరూ గుర్తించడంలేదు. హౌస్‌వైఫే కదా అని చులకనగా చూస్తుంటారు. కరోనా సమయంలో ఉద్యోగులు ఆఫీసులకు రాకపోయినా..ఇంట్లోనుంచి సక్రమంగా పనిచేయడానికి ఇంటి ఇల్లాలు ఎంతో సాయం చేసింది. అందువల్ల వారికి జీతం ఇవ్వాలనుకున్నానని రాయ్‌ చెబుతున్నారు.

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ఒక యాక్సిడెంట్‌ కేసు విషయంలో తీర్పునిస్తూ.. గృహిణి చేసే పని విలువ సంపాదించే భర్తకంటే తక్కువ ఏం కాదని తేల్చిచెప్పింది. సంపాదించే భర్తతో సమానంగా భార్యకు అన్ని రకాల మర్యాదలు ఇవ్వాలన్నది సుప్రీంకోర్టు ఉద్దేశ్యం. ఈ తీర్పే నా ఆలోచనకు నాంది అని రాయ్‌ అన్నారు. గృహిణులకే కాకుండా ఉద్యోగి తల్లిదండ్రులకు పెన్షన్‌ కూడా ఇవ్వనున్నట్లు రాయ్‌ తెలిపారు.  కంపెనీలో మూడేళ్లకు పైగా పనిచేసేవారందరికీ ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top