మరోసారి మావోయిస్టు పార్టీ సంచలన ప్రకటన చేసింది. సాయుధ పోరాట విరమణ ప్రకటన.. అభయ్ వ్యక్తిగతంగా పేర్కొంది. కేంద్ర కమిటీ అధికార ప్రతినిధి అభయ్ ఇచ్చిన స్టేట్‌మెంట్ తమకు సంబంధం లేదంటూ మావోయిస్ట్ పార్టీ అధికార ప్రతినిధి జగన్ స్పష్టం చేశారు. శాంతి చర్చలు జరగాలని ఈ ఏడాది మార్చి నుంచి ప్రతిపాదనలు చేస్తున్నాం. ఆపరేషన్ కగార్ నిలిపివేసి శాంతియుత వాతావరణంలో చర్చలు జరగాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని మావోయిస్ట్ పార్టీ పేర్కొంది.
కేంద్ర, రాష్ట్ర కమిటీ సభ్యులు అనారోగ్య కారణాలతో లొంగిపోతున్నారు. శాంతి చర్చలపై అభిప్రాయాలు తెలపాలని మెయిల్ అడ్రస్ ఇవ్వడం అర్ధరహితం. ఇలాంటి ప్రకటనలు చేసే వారు పార్టీ అనుమతి తీసుకుని చేస్తే బాగుండేది. ఆయుధాలు వదిలి పెడదామని ఏకపక్షంగా అభయ్ చేసిన ప్రకటన పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉంది. పార్టీలో ఎలాంటి చర్చలు జరపకుండా.. సాయుధ పోరాట విరమణ ప్రకటన చేయడం తీవ్రమైన చర్యగా మావోయిస్టు పార్టీ పేర్కొంది.
కాగా, మావోయిస్టు పార్టీ అధికార ప్రతినిధి అభయ్ ఆగస్టు 15న రాసినట్లుగా ఉన్న లేఖ ఆలస్యంగా వెలుగు చూసినట్లు మంగళవారం అర్ధరాత్రి జాతీయ మీడియా, సోషల్ మీడియాలో కథనాలు ప్రసారమైన సంగతి తెలిసిందే. హిందీలో విడుదలైన ఈ లేఖలో.. తమ పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు ఎన్‌కౌంటర్‌లో అమరుడు కాకముందు నుంచే శాంతి చర్చల ప్రస్తావనను ప్రభుత్వం ముందుకు తెచ్చినట్లు అభయ్ వెల్లడించారు.

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా, దేశంలో మారుతున్న పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని, హోంమంత్రి అమిత్‌షా మొదలు ప్రధాని నరేంద్ర మోదీ వరకు అనేకమంది ఆయుధాలు వదిలిపెట్టి జనజీవన స్రవంతిలో కలవాలంటూ చేసిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని సాయుధ పోరాటం విరమించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. అయితే ఈ అంశంపై దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న ఇతర మావోయిస్టు నేతలతో చర్చించుకుని తుది నిర్ణయానికి వచ్చేందుకు కనీసం నెల పాటు ప్రభుత్వం తరఫున కూడా కాల్పుల విరమణ కావాలని కోరారు.



 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
