
కార్తీక స్నానం, మాఘస్నానం, పుష్కరస్నానం, త్రివేణీసంగమ స్నానం... ఇలా రకరకాల స్నానాల విశిష్టతను గూర్చి మన శాస్త్రాలు చెప్పాయి. కోట్లాది ప్రజలు పుణ్య తిథులలో, బ్రహ్మ ముహూర్తంలో, సూర్యోదయానికి కాస్త ముందే ఆ పుణ్యస్నానాలు చేయటానికి పుణ్యనదీ తీరాలకు చేరుకుంటారు. అయితే క్రియాయోగాన్ని ప్రపంచానికి అందించిన పరమహంస యోగానంద ‘ఆతపస్నాన’ విశిష్టతను గూర్చి చెప్పారు.
ఆతపస్నానం (sunbathing) అంటే ఏమిటో, ఎలా చేయాలో, ఎంతసేపు చేయాలో వారు ఇలా వివరించారు: ‘మందులకంటె ఉత్తమ మైనవి సూర్యకిరణాలు. వాటిలో ఉంది రోగాలను నయంచేసే అద్భుత శక్తి. ప్రతి దినం పది నిమిషాలసేపు ఆతపస్నానం చేయాలి (ఒంటి మీద ఎండపడేలా చేయాలి). అప్పుడోసారి, ఇప్పుడోసారి ఎక్కువసేపు ఎండలో ఉండడం కంటె దినానికి పదేసి నిమిషాల చొప్పున ఎండలో ఉండడం మంచిది. ఆరోగ్యపరమైన అలవాట్లు, మంచి అలవాట్లు ఏర్పరచుకోవడంతో పాటు ప్రతి రోజూ కొద్ది సేపు చేసే ఆతపస్నానం, హానికరమైన సూక్ష్మ జీవులను నాశనం చేయడానికి తగినంత ప్రాణ శక్తిని శరీరానికి సరఫరా చేస్తూఉంటుంది’ (పుట 100– మానవుడి నిత్యాన్వేషణ – శ్రీ పరమహంస యోగానంద).
మనకు సూర్యుడు కేవలం ఒక అగ్ని గోళం కాదు, ‘సూర్య భగవానుడు’, ‘శక్తి ప్రదాత’. కాబట్టే భక్తిని జత చేసి సూర్య నమస్కారాలు చేయమన్నారు మహర్షులు.ఈ ఆతపస్నానం ఆచరించటానికి మనం ఎక్కడికో పోవాల్సిన పనికానీ, డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం కానీ లేదు. లక్షణంగా మన ఇంటి ముందో, మిద్దెపైననో ప్రశాంతంగా, భక్తి పూర్వకంగా చేసుకోవచ్చు. ‘ఆదిదేవ! నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర! దివాకర! నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే’ అని ప్రతి రోజూ సూర్యోదయ సమయాన ప్రార్ధిద్దాం. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక లాభాలను పొందుదాం.
– రాచమడుగు శ్రీనివాసులు

ఆతప స్నానం అంటే సూర్య స్నానం చేయడం. ఈ పదం "ఆతప" (సూర్యకాంతి) స్నానం. పురాతన భారతీయ వైద్య వ్యవస్థ అయిన ఆయుర్వేదంలో దీనికి చాలా ప్రాముఖ్యత ఉంది. దీనివల్ల అనేక ప్రయోజనాలున్నాయని నమ్ముతారు. ముఖ్యంగా శరీరంలో విటమిన్ డీ విరివిగా లభిస్తుంది. విటమిన్ డీ ఎముకల ఆరోగ్యానికి , మొత్తం శ్రేయస్సుకు ,ఆలా అవసరం. విటమిన్ డితో పాటు, మెరుగైన మానసిక స్థితి , ఎనర్జీ మెరుగుపడుతుంది.