శీతలమైన క్లౌన్స్‌లింగ్‌

Clown journey to the Hospital in delhi - Sakshi

నవ్వు ఆరోగ్యానికి అన్ని విధాలా మంచి చేస్తుంది. ఒక్కసారి నవ్వగానే మనసులో ఉన్న బాధ అంతా పోయి మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ.. వివిధ భావోద్వేగాల మధ్య నలిగిపోతూ నవ్వునే మర్చిపోతాం. అలా నవ్వులని మర్చిపోయిన వారికి.. వారి బాధలని నవ్వుతో దూరం చేద్దాం అని భుజం తట్టి చెబుతోంది శీతల్‌ అగర్వాల్‌.

‘‘మనమంతా ఎప్పుడూ శారీరకంగా ఫిట్‌గా ఉండడంపైనే దృష్టిపెడతాం. కానీ మానసిక ఆరోగ్యాన్ని పెద్దగా పట్టించుకోము. అందుకే వివిధ రకాల సమస్యలు చుట్టుముట్టి మెదడును తొలిచేస్తుంటాయి. అందుకే నవ్వుతూ ఉండండి’’ అని చెప్పడమేగాక, ఢిల్లీలోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న పేషంట్ల వద్దకు వెళ్లి వాళ్లను నవ్విస్తూ, మానసిక ఆరోగ్యం ప్రాముఖ్యతను వివరిస్తోంది శీతల్‌.  

  ఢిల్లీకి చెందిన శీతల్‌ అగర్వాల్‌...ఆంత్రోపాలజిస్ట్‌గా, ప్రొఫెసర్‌గా పనిచేస్తోంది. 2016లో ఒకసారి శీతల్‌ అహ్మదాబాద్‌ వెళ్లినప్పుడు అక్కడ ధారను కలిసింది. ధార తనని తాను శీతల్‌కు పరిచయం చేసుకుంటూ.. ‘‘నేను ఒక మెడికల్‌ క్లౌను’’ను అని చెప్పింది. చిన్నప్పటి నుంచి రకరకాల సర్కస్‌ విదూషకులు (క్లౌన్స్‌) చేసే కామెడీని బాగా ఎంజాయ్‌ చేస్తూ పెరిగిన శీతల్‌కు మెడికల్‌ క్లౌన్‌ అనగానే విచిత్రంగా అనిపించింది.

వెంటనే ‘‘అవునా! మెడికల్‌క్లౌన్‌ అంటే ఏంటీ?’’ అని అడిగింది..ఆసుపత్రులకు వెళ్లి రోగులను నవ్వించడమే’’ తన పని అని ధార చెప్పిన విషయం శీతలకు బాగా నచ్చింది. మెడికల్‌ క్లౌన్‌ గురించి మరింతగా అన్వేషించి అనేక విషయాలు తెలుసుకుంది. ఇందులో భాగంగానే ‘ప్యాచ్‌ అడమ్స్‌’ అనే అమెరికా కామెడీ సినిమా చూసింది. దీనిలో డాక్టర్‌ హాస్యం పండిస్తూ రోగులకు చికిత్స చేస్తుంటాడు. ఈ సినిమా ద్వారా మెడికల్‌ క్లౌన్‌ వల్ల ఎంతోమంది జీవితాల్లో ఆనందం నింపవచ్చని అర్థం చేసుకుని శీతల్‌ తను కూడా మెడికల్‌ క్లౌన్‌ కావాలనుకుంది.  

క్లౌన్స్‌లర్స్‌..
మెడికల్‌ క్లౌన్స్‌ కావాలనుకుని తన ఫేస్‌బుక్‌లో కొంతమంది మెడికల్‌ క్లౌన్స్‌ కావాలని పోస్టు చేసింది. శీతల్‌ పోస్టుకు 33 మంది స్పందించారు. దీంతో ఢిల్లీ ఆరోగ్య మంత్రిత్వ శాఖకు మెడికల్‌ క్లౌన్స్‌గా పనిచేసేందుకు అనుమతి కోసం దరఖాస్తు చేసింది. అనుమతి రాగానే కొన్ని హాస్పిటళ్లకు వెళ్లి అక్కడ రోగులకు తన వేషభాషల ద్వారా ఉల్లాసం కలిగించడం ప్రారంభించింది. జోకర్‌లా డ్రెస్, నెత్తిమీద టోపీ, ముక్కుకు, చెంపలకు రంగులు వేసుకుని చూడగానే నవ్వు వచ్చేలా మేకప్‌ వేసుకుని పిల్లల వార్డుకు వెళ్లి అక్కడ ఉన్న పిల్లలను నవ్వించడానికి ప్రయత్నించారు. వార్డులో ఉన్న పిల్లలంతా తమ బాధను మర్చిపోయి చక్కగా నవ్వారు. ఆ చిన్నారుల ముఖాల్లో విరిసిన నవ్వులు శీతల్‌కు చాలా తృప్తినిచ్చాయి.

అంతేగాక వీళ్ల టీమ్‌ రోజూ ఆ వార్డుకు వెళ్లి రావడం వల్ల అక్కడున్న పిల్లలంతా చక్కగా తింటూ హాయిగా ఆడుకునేవారు. ఈ ప్రేరణతో ఢిల్లీలోని ఇతర ఆసుపత్రుల్లో కూడా అనుమతి తీసుకుని, ఆయా ఆసుపత్రులను సందర్శించి అక్కడి రోగులను నవి్వంచి, మానసికంగా దృఢంగా ఎలా ఉండాలో చెబుతూ వారిలో ధైర్యాన్ని నింపేవారు. వీరివల్ల రోగుల్లో వస్తున్న సానుకూల మార్పులను చూసి సంతృప్తి పడ్డ ఆయా హాస్పిటల్స్‌ యాజమాన్యాలు వీరి టీమ్‌ను మళ్లీ మళ్లీ రావలసిందిగా కోరేవి. ఆ నోటా ఈ నోటా శీతల్‌ క్లౌన్స్‌లర్స్‌ గురించి తెలిసిన వారంతా తమ ఆసుపత్రులకు పిలిస్తే, కొంతమంది ఈ టీమ్‌లో స్వచ్ఛందంగా మెడికల్‌ క్లౌన్స్‌లర్‌గా చేరి సేవలందిస్తున్నారు.
 
ఉద్యోగం వదిలేసి..

  శీతల్‌ క్లౌన్స్‌లర్స్‌ టీమ్‌కు మంచి గుర్తింపు రావడంతో..ఐదేళ్ల తరువాత తన ఉద్యోగాన్ని వదిలేసి పూర్తి సమయాన్ని మెడికల్‌ క్లౌన్స్‌కే కేటాయించింది. కోవిడ్‌ సమయంలోనూ..క్లౌన్స్‌ సేవలందించింది. మొదటి లాక్‌డౌన్‌ సమయంలో మైక్రో షెల్టర్స్‌ను సందర్శించడం, కొన్ని షెల్టర్‌లలో ఫేస్‌బుక్‌ ద్వారా లైవ్‌ ఈవెంట్స్‌ను అందిచారు. ఆన్‌లైన్‌ సెషన్స్‌కు స్పందన బావుండడంతో ఏడాదిన్నరపాటు అనేక ఆన్‌లైన్‌ సెషన్లను నిర్వహించారు. న్యూఢిల్లీతోపాటు మహారాష్ట్ర, హర్యాణ, మేఘాలయ, మణిపూర్, కర్ణాటక వంటి రాష్ట్రాల్లో కూడా శీతల్‌ తన సేవలను విస్తరించింది. ప్రస్తుతం ఆసుపత్రులతోపాటు, అనాథ, వృద్ధాశ్రమాలు, మురికి వాడల్లో మెడికల్‌ క్లౌన్‌ సేవలు అందిస్తోంది. ఈ విషయం ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో వైరల్‌ అవ్వడంతో నెటిజన్లంతా శీతల్‌ను అభినందనలతో ముంచెత్తుతున్నారు.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top