చేతన సామ్రాజ్యాన్ని తానే నిర్మించుకుంది

Chetana Jain is a Owner Of dhrumataru consultants - Sakshi

గ్రేట్‌ జర్నీ

చేతనాజైన్‌... ఆర్కిటెక్ట్‌. యాభై మంది ఉద్యోగులున్న తన సొంత సంస్థకు ఆమె సీఈవో. తండ్రి స్థాపించిన సంస్థను వారసత్వంగా అందిపుచ్చుకున్న మహిళ కాదామె. తన జీవితాన్ని తానే నిర్మించుకున్న ఓ ట్రెండ్‌సెట్టర్‌. ఆర్కిటెక్చర్‌ రంగంలో మహిళలు లెక్కలేనంత మంది ఉన్న మాట నిజమే. కానీ ఎక్కువ మంది మగవాళ్లు స్థాపించిన సంస్థలో ఉద్యోగి గా ఉండడానికే ఇష్టపడుతుంటారు. మరికొందరు ఇంటీరియర్‌ డిజైనింగ్‌ వైపు మరలిపోతుంటారు. అలాంటి సమయంలో ఇరవై రెండేళ్ల కిందట సొంత సంస్థను స్థాపించి, నిర్మాణరంగంలో తనదైన పాదముద్రలు వేసిన మహిళ చేతనా జైన్‌.

అమ్మ అనుసరించిన  సూత్రమే....
హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన చేతనాజైన్‌ ది గుజరాతీ వ్యాపార కుటుంబం. ఆర్కిటెక్ట్‌గా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వ, ప్రైవేటు ప్రాజెక్టులను విస్తృతంగా చేస్తున్నారామె. కార్పొరేట్‌ కంపెనీల యాజమాన్యం నుంచి తాపీ మేస్త్రీల వరకు అందరితోనూ మాట్లాడాల్సి ఉంటుంది. ఏ నేల మీద ఉంటే ఆ భాష నేర్చుకుని తీరాలనే తన తల్లి అనుసరించిన సూత్రమే తన విజయానికి పునాది అన్నారు చేతనాజైన్‌. ‘‘ఏ నేల మనకు జీవితాన్నిస్తుందో ఆ నేలను, అక్కడి భాష ను గౌరవించాలనేది మా అమ్మ. కనీసం బస్సుల మీద పేర్లు చదవగలగాలి కదా అనేది. అలా సెకండ్‌ లాంగ్వేజ్‌ తెలుగు చదివాను. ఇక ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌లో నా వంతు వచ్చేటప్పటికి జేఎన్‌టీయూలో సివిల్‌ ఇంజనీరింగ్, ఆర్కిటెక్చర్‌ లో మాత్రమే ఖాళీలున్నాయి. ఆర్కిటెక్ట్‌ ఏం పని చేయాల్సి ఉంటుందని అడిగి తెలుసుకుంది మా అమ్మ. ‘పెళ్లయిన తర్వాత ఇంట్లో ఉండి కూడా పని చేసుకోవచ్చు’ అని ఆర్కిటెక్చర్‌లో చేర్చేసింది.  ఆర్కిటెక్చర్‌లో గ్రాడ్యుయేషన్‌ తర్వాత జెమ్‌షెడ్‌పూర్‌లో ఎంబీఏ చేశాను.

స్వయంగా ఇన్‌వాల్వ్‌ అయినప్పుడే...
ఎన్‌ఆర్‌ అసోసియేషన్స్‌లో మల్లికార్జునరావుగారి దగ్గర జూనియర్‌గా ఒకటిన్నర ఏడాది పని నేర్చుకున్నాను. కాలేజ్‌లో కాన్సెప్ట్‌ మాత్రమే తెలుసుకుంటాం. అసలైన పని వచ్చేది ఉద్యోగంలో చేరిన తర్వాత మాత్రమే. ‘ఒక బిల్డింగ్‌ పునాది నుంచి పూర్తయే వరకు ప్రతి పనిలోనూ స్వయం గా ఇన్‌వాల్వ్‌ అయినప్పుడే పనిలో నైపుణ్యం వస్తుంది’ అని ఆయన చెప్పిన మాటే నా కెరీర్‌ నిర్మాణానికి పునాది. చేతిలో పని లేకపోతే పాత డిజైన్‌లను తీసి చూస్తుంటే.. అదే స్థలంలో ఇంకా చక్కని డిజైన్‌ వేయడానికి ఉన్న అవకాశాలు అవగతమవుతాయని చెప్పారు. హైదరాబాద్, మొజంజాహి మార్కెట్‌ రెస్టోరేషన్‌ విజయవంతంగా చేయగలిగానంటే అప్పట్లో ఆయన దగ్గర నేర్చుకున్న పాఠాలే కారణం. ఆయన పోయిన తర్వాత  ఇక ఉద్యోగం చేయలేదు. సొంత ఫర్మ్‌ పెట్టాను.

భవనం జెండర్‌ చూడదు
‘‘నువ్వు కట్టే భవనం నువ్వు స్త్రీవా, పురుషుడివా అని చూడదు. ఇక్కడ పనిచేసేది జెండర్‌ కాదు మన మెదడు మాత్రమే. ఆడవాళ్లం కాబట్టి ఆఫీస్‌కే పరిమితం అనుకుంటే ఎప్పటికీ ఏమీ సాధించలేరు. మీరు వేసిన డిజైన్‌ను సైట్‌లో భవన రూపంలోకి తెచ్చే పనిలో కూడా భాగస్వాములయి తీరాలి. అప్పుడే ఆచరణలో ఎదురయ్యే సవాళ్లు అర్థమవుతాయి. అవసరమైతే సైట్‌లో ఆ క్షణంలోనే డిజైన్‌ని మార్చి ఇవ్వగలిగే నైపుణ్యాన్ని పెంచుకోవాలి. మహిళలుగా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. అంతేతప్ప మహిళని కదా అని పని లో వెసులుబాటు వెతుక్కోకూడదు’’ అంటారు ఈ రంగంలో కొత్తగా చేరే స్త్రీలతో చేతనాజైన్‌.
నిజానికి ప్రతి రంగమూ అందరిదీ. ఆడవాళ్లు అడుగు పెట్టనంత వరకే అది మగవాళ్ల సామ్రాజ్యంగా ఒక ముద్ర వేసుకుని ఉంటుంది. కొన్ని కనిపించని పరిధులు విధించుకుని ఉంటుంది. ఆ సరిహద్దు గీతను తుడిచేస్తున్న మహిళల్లో చేతనాజైన్‌ కూడా ఒకరు.

కెరీర్‌కి కిరీటం
వారసత్వ హోదా ఉన్న కట్టడాన్ని పునరుద్ధరించాలంటే నైపుణ్యం కంటే ఎక్కువగా అంకితభావం ఉండాలి. మొజంజాహి మార్కెట్‌ పునరుద్ధరణ పనిని 2016 చివర్లో మొదలుపెట్టాం. ఆ నిర్మాణం తొలిరూపాన్ని అర్థం చేసుకోవడానికి ఆరునెలలకు పైగా పట్టింది. హబ్సిగూడలో ఉన్న స్టేట్‌ ఆర్కైవ్స్‌ డిపార్ట్‌మెంట్‌లో ఈ భవనానికి సంబంధించిన ప్రతి ఆధారమూ ఉంది. నిజాం నవాబు 1935లో ఈ భవనం కోసం విడుదల చేసిన తొలి మొత్తం 30 రూపాయల డాక్యుమెంట్‌తో సహా ఉన్నాయి. దుకాణదారులు ఎవరికి వాళ్లు తమకు కావల్సినట్లు కరెంట్‌ లైన్లు, వాటర్‌ పైప్‌ లైన్‌లు, ఫ్లోరింగ్‌ వేసుకున్నారు. దుకాణదారులతో మాట్లాడి వాళ్ల అవసరాలు నెరవేరేటట్లు చూస్తూనే, భవనం అసలు స్వరూపాన్ని పరిరక్షించగలిగాం. ఇందుకోసం మా టీమ్‌ రెండేళ్లు పని చేసింది. కమర్షియల్‌గా అయితే రెండేళ్లలో సమాంతరంగా అనేక ప్రాజెక్టులు చేయగలుగుతాం. కానీ ఇలాంటివి చేయడం కెరీర్‌కి గర్వకారణం.

– చేతనాజైన్, సీఈవో, ధ్రుమతారు కన్సల్టెంట్స్‌

– వాకా మంజులారెడ్డి

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top