ఈ ఏడాది వేడుకలకు ప్రత్యేకత ఉంది. మూడు పవిత్రతల సమ్మేళనం భగవాన్ శతజయంతి ఉత్సవాలు, దీపావళి పర్వదినం, అవతార ప్రకటన దినం ఒకేసారి రావడంతో భక్తుల్లో పండుగ వాతావరణం నెలకొంది. శత జయంతి ఉత్సవాల సందర్భంగా నెల రోజుల ముందు నుంచి పుట్టపర్తి వ్యాప్తంగా ఏర్పాట్లు ముమ్మరం చేశారు. అవతార ప్రకటన దినం ఓ వేడుకలా సాగింది. అదే రోజున దీపావళి పండుగ రావటంతో సందడి వాతావరణం నెలకొంది.
నాదస్వరం, వేదఘోష, సత్యసాయి ఇ¯Œ స్టిట్యూట్ బ్యాండ్ వాయిద్యాలతో సభా మందిరం సాయి నామస్మరణతో మార్మోగింది. ఈ ఏడాది అక్టోబర్ 20వ తేదీ ఉదయం ప్రశాంతి నిలయంలో భక్తి ఆధ్యాత్మికతలు వెల్లివిరిశాయి. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా విద్యాసంస్థల పూర్వ విద్యార్థినులు దేశం నలుమూలల నుంచి చేరి సాయి చరిత్రలో అత్యంత పవిత్రమైన ఘట్టమైన అవతార ప్రకటన దినోత్సవాన్ని భక్తి ప్రపత్తులతో నిర్వహించారు. ఎనభై ఐదేళ్ల క్రితం ఇదే రోజున పుట్టపర్తికి చెందిన పద్నాలుగేళ్ల దివ్యబాలుడు, చిన్న సత్య తన దివ్య స్వరూపాన్ని ప్రపంచానికి తెలియజేశాడు.
‘నేను సాయిబాబాను’ అని ప్రకటించిన ఆ మాటలు మానవ చరిత్రలో దిశ మార్చిన శబ్దాలుగా మారాయి. అది కేవలం ఒక ప్రకటన మాత్రమే కాదు, దైవ అవతరణకు నిదర్శనంగా అవతార ప్రకటన దినోత్సవం సందర్భంగా అనంతపురం క్యాంపస్ పూర్వ విద్యార్థులు ‘సాక్షాత్ పరబ్రహ్మ సాయి’ అనే ప్యానల్ చర్చ కార్యక్రమం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. భగవాన్ అవతార లక్ష్యం, మార్గం గురించి వివరణాత్మకంగా తెలియజేశారు. వేడుకలు సంగీత సమర్పణతో ముగిశాయి. సాయిబాబాపై రాసిన ప్రతి పాటలోనూ.. ప్రేమ, సేవ, సత్యం, ధర్మం కనిపించాయి.


