స్వల్ప బడ్జెట్‌తో స్త్రీలకు లోకం చూపిస్తోంది!

Appooppanthaadi Ladies only travel group trip - Sakshi

ట్రెండ్‌/లేడీస్‌ ఓన్లీ ట్రావెల్‌

అమ్మాయ్‌ వెళ్దామా... వదినా వెళ్దామా... పొరుగింటి పిన్నిగారూ వెళ్దామా..
ఇరుగింటి లక్ష్మిగారూ రెడీనా... కేవలం ఆడవాళ్లు మాత్రమే కలిసి పర్యటనలు చేస్తే ఎలా ఉంటుంది?
మగవాళ్ల అదుపు, ఆజమాయిషీ, అనవసర కేరింగ్‌ లేకుండా స్వేచ్ఛగా తాము మాత్రమే రెక్కలు ధరిస్తే ఎలా ఉంటుంది?
కేరళకు చెందిన సజనా అలీకి ఈ ఆలోచనే వచ్చింది. ‘అప్పూపత్తాడి’ (దూదిపింజె పురుగు) పేరుతో లేడీస్‌ ఓన్లీ ట్రావెల్‌ గ్రూప్‌న నడుపుతూ స్వల్ప బడ్జెట్‌తో స్త్రీలకు లోకం చూపిస్తోంది.
ఆడవారి భ్రమణకాంక్షకు ఇది బెస్ట్‌ టూర్‌ టికెట్‌.

కిచెన్‌లోనే ఉండిపోతున్నారా? ఆఫీస్‌ పనితోనే సరిపోతోందా? ఎక్కడికైనా కదులుదామంటే భర్తగారికి వీలవుతుందో కాదో. పిల్లలు పరీక్షలు అంటారో ఏమో. లేకుంటే ‘ఇప్పుడు ఏం అవసరం. ఓటిటిలో సినిమా చూసి పడుకోక’ అనొచ్చు కదా.
ఏడ్చినట్టుంది. లోకం అంటే ఇదేనా. ఇంతేనా?

ఉదాహరణకు వీటిలో ఎన్ని చూసి ఉంటారు మీరు? లక్నో, అలహాబాద్, గయా, పాట్నా, వారణాసి, గౌహతి, కోల్‌కటా ఆఖరున మేఘాలయా. వీటిలో నిజంగా ఎన్ని చూసి ఉంటారు మీరు. సజనా అలీని కలిస్తే ఇవన్నీ మిమ్మల్నో 15 రోజుల ట్రిప్పులో చూపించేస్తుంది.

ఖర్చు? చాలా తక్కువ. తోడు? మొత్తం ఆడవాళ్లే. అక్కడా అక్కడా అక్కడా... లోకం చూడాలనుకుని తపించే స్త్రీలు... వారు గృహిణులు కావచ్చు, ఉద్యోగినులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు... ఒక గ్రూప్‌గా బయలుదేరి వెళతారు. సజనా అలీ మొత్తం ఏర్పాట్లు చేస్తుంది. కొత్త దోస్తులు... కొత్త లోకం... ఇంతకు మించి ఆనందం ఏముంటుంది?
లోకం చూడకుండా కళ్లుండి గంతలు కట్టుకుంటామా?
∙∙
దూదిపింజె పురుగును మనం చూసి ఉంటాం. తేలిగ్గా సన్నటి దారాల ఒంటితో గాలిలో అలా తేలుతూ వెళుతుంటుంది. గాలి ఎటు వీస్తే అటు దాని పయనం. హాయిగా వెళుతూ ఉండటమే. సజనా అలీ 2016లో మొదలెట్టిన ట్రావెల్‌ సంస్థ పేరు కూడా అదే... మలయాళంలో ‘అప్పుపత్తాడి’ అని. కోజికోడ్‌కు చెందిన ఈ సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆ ఉద్యోగం మానేసి కేవలం టూర్‌ ఆపరేషన్స్‌తో ఉపాధి పొందుతోంది. ఇందులో రెండు సంతృప్తులు. ఒకటి తాను తిరగగలుగుతోంది. రెండు తన వంటి స్త్రీలను తిప్పగలుగుతోంది.

‘మా నాన్న లారీ డ్రైవర్‌. తాను వెళ్లిన చోటు గురించి వచ్చి ఇంట్లో చెబుతుండేవాడు. నేనూ వస్తాను అంటే తీసుకెళ్లేవాడు కాదు... ఆడపిల్లలకు వాష్‌రూమ్‌ సౌకర్యాలు ఉండవని. కాని ఎప్పుడైనా ఒకరోజు దూరం ట్రిప్పులు వెళుతుంటే తీసుకెళ్లి తెచ్చేవాడు. నాకు చాలా సంతోషం వేసేది. పెద్దదాన్నయి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగంలో చేరాక ఒకసారి అందరం విమెన్‌ కొలిగ్స్‌తో ఒరిస్సా టూర్‌ ప్లాన్‌ చేశాను. 2015లో. ఎనిమిది మంది వస్తామన్నారు. తీరా బయల్దేరే సమయానికి ఎవరూ రాలేదు. నేనొక్కదాన్నే మిగిలాను. కాని నేను ఆగలేదు.

ఒక్కదాన్నే బయలుదేరి 8 రోజుల పాటు తిరిగి ఆ విశేషాలు ఫేస్‌బుక్‌లో పెట్టాను. అవి చూసి ఎవరైతే రాము అన్నారో వాళ్లంతా ఈసారి పిలూ వస్తాం అన్నారు. ఆ ఉత్సాహంతో కేరళలోనే కొల్లం జిల్లాలో ఉండే రోసెమలా అనే ట్రెక్కింగ్‌కి ప్లాన్‌ చేశాను. 20 మంది వస్తామని ఎనిమిది మంది తేలారు. ఆ 8 మందిమే ఒక జీప్‌ తీసుకుని వెళ్లాం. వచ్చిన వాళ్లంతా బాగా ఎంజాయ్‌ చేశారు. అప్పుడు నాకు వచ్చిన ఆలోచన– ఎందుకు కేవలం స్త్రీల కోసమే ట్రిప్స్‌ ప్లాన్‌ చేయకూడదు? అని. ఇక ఉద్యోగం మానేసి ‘అప్పుపత్తాడి’ ట్రావెల్‌ సంస్థను ప్రారంభించాను’ అంటుంది సజనా అలీ.
∙∙
సజనా అలీ చేసిన ఈ ఆలోచనలో ఒక మేలు, ఒక ఇబ్బంది ఉన్నాయి. మేలు ఏమిటంటే కుటుంబంతో మాత్రమే ప్రయాణం చేయాలనుకునే స్త్రీలు ఆ తప్పనిసరిని వదులుకుని ‘తోడు మహిళలు ఉన్నారు’ అని చెప్పి టూర్లకు రాగలగడం. ఇబ్బంది ఏమిటంటే.. అందరూ ఆడవాళ్లే అయితే సేఫ్టీ సంగతి ఏమిటి? అనే ప్రశ్న తలెత్తడం.
‘సేఫ్టీ గురించి మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఎక్కడెక్కడ బస చేయాలో ఏ రూట్‌లో వెళ్లాలో పక్కా ప్లాన్‌ చేసుకుంటాం. స్త్రీలకు తమ జాగ్రత్త తమకు తెలుసు. ఏ ఇబ్బందీ లేదు’ అంటుంది సజనా అలీ.

అయితే ఈ జాగ్రత్త కంటే కూడా ఆమె శ్రద్ధ పెట్టే విషయం– బడ్జెట్‌. ‘ఎక్కువ మంది స్త్రీలు మిడిల్‌ క్లాస్‌ నుంచి ఉంటారు. ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టి తిరగడం వారికి వీలు కాదు. అందుకే వీలైనంత తక్కువ ఖర్చులో వారిని తిప్పి చూపించడానికి నేను ప్రాధాన్యం ఇస్తాను. ఆ మేరకు రూములు, రెస్టరెంట్‌లతో టై అప్‌ చేసుకుంటాను’ అంటుంది సజనా అలీ.

సజనా అలీ కేరళ కేంద్రంగా పని చేస్తూ దేశమంతా విమెన్‌ ఓన్లీ టూర్లు నిర్వహిస్తోంది. తాజాగా తన ఫేస్‌బుక్‌ పేజీలో ధనుష్కోటికి వెళ్లిన బృందం ఫొటో పెట్టి ‘338వ ట్రిప్‌’ అని పోస్ట్‌ చేసింది. అంటే గత ఐదేళ్లలో ఆమె 338 విమెన్‌ ఓన్లీ టూర్లు ఆపరేట్‌ చేసింది. ఎంత లేదన్నా ఐదు వేల మంది స్త్రీలు దేశంలోని రంగు రంగుల ప్రాంతాలను, సంస్కృతులను ఆమె పుణ్యాన దర్శించి ఉంటారు.

రోజువారీ రొడ్డకొట్టుడు నుంచి బయటపడటానికి కొద్ది మంది గృహిణులు కలిసి రోడ్‌ ట్రిప్‌ ప్లాన్‌ చేసుకోవడం ఇటీవలి సినిమాల్లో కనిపిస్తోంది. ఆ సినిమాల కంటే ముందే సజనా అలీ స్త్రీలకు ప్రకృతి సినిమా చూపిస్తోంది. అలాంటి వారి స్ఫూర్తితో ఈ కోవిడ్‌ గోల తగ్గాక మీరూ రెక్కలు కట్టుకుని తోటి మిత్రులతో ఎగిరెళ్లిపోండి. హ్యాపీ జర్నీ.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top