ఆఖరి మనిషి | Akhari manishi Funday Special Story | Sakshi
Sakshi News home page

ఆఖరి మనిషి

Jun 7 2026 6:36 AM | Updated on Jun 7 2026 6:39 AM

Akhari manishi Funday Special Story

గాఢాంధకారం. ఎటు చూసినా చీకటే. నక్షత్రాలు తప్ప ఏమీ కనిపించనంత చీకటి అలుముకొని ఉంది. భూమి మీద ఆ రాత్రి– కాళరాత్రి కాబోతున్న సూచనలు కనిపిస్తున్నాయి. శబ్దాల మధ్య నిశ్శబ్దంలా, అస్తిత్వం ముగిసిన తర్వాత మిగిలే శూన్యంలా భూమి కనిపిస్తోంది.
ఇంతలో గాలి బలంగా వీచింది. కానీ ఆ గాలిలో జీవం లేదు. ఆ గాలి ఒకప్పుడు మానవులకు ఊపిరి పోసింది. కానీ, ఇప్పుడు జీవకోటి మొత్తం నాశనం అయి పుడమి అంతా బోసిపోయి కనిపిస్తోంది. 

ఆ సమయంలో ఒక కదలిక కనిపించింది. అందులో శబ్దం లేదు. అది అడుగుల చప్పుడూ కాదు. అది ఒక ఉనికి. భూమి కూడా గుర్తుపట్టని ఒక ఆకారం వస్తూ కనిపించింది. ఆమె ఆకాశం నుంచి దిగలేదు. భూమి లోతుల్లోనుంచి పైకి రాలేదు. ఆమె ఎప్పటి నుంచో ఇక్కడే ఉంది. కానీ ఈరోజు ఆమెను చూడగలిగే కళ్ళు లేవు.
ఒకప్పుడు కోట్లాది హృదయాల్లో నిశ్శబ్దంగా నివసించిన ఆమె, ఈరోజు ఖాళీ ప్రపంచంలో తన ఉనికిని తానే మోస్తోంది. ఆమె అడుగులు నేలను తాకలేదు. కానీ ఈ ధరిత్రి ఆమెను చాలాకాలం భరించింది. ఆమె నడిచి వస్తుంటే నదులు పొంగినట్లు, అడవులు కదిలినట్లు,  ఉరుములు ఉరుముతున్నట్లు, పర్వతాలు ఎగురుతున్నట్లు అనిపిస్తోంది. ప్రకృతి ఆమెను ఆహ్వానించలేదు. ఆమెను అడ్డుకోలేదు కూడా. ఆమెకు అడ్డుచెప్పేవారు ఈ భూమ్మీద ఎవ్వరూ లేరు. ఆమె నడుస్తోంది. శిథిలమైన నగరాల మధ్యగా, విరిగిన గాజు ముక్కల మీదుగా, శిథిలాల నిశ్శబ్దాన్ని దాటి ఆమె వస్తోంది. ఆమె ప్రతి అడుగులో రౌద్రం కనిపిస్తోంది.

ఈ భూమ్మీద మొదటి మనిషి పుట్టిన క్షణం నుంచి చివరి మనిషి శ్వాస వరకు ఆమెకు నిద్ర లేదు. ఆమెకు కాలం అనే పరిమితి లేదు. 
ఒక పాత నగరం మధ్యలో ఆమె ఆగింది. అక్కడ ఒక నిశ్శబ్దం మధ్యలో చిన్న శబ్దం వినిపిస్తోంది. అది ఎవరిదో శ్వాస. అది బలహీనంగా ఉంది. అది ఆఖరి మనిషి శ్వాస. ఆమె కళ్ళు మూసుకుంది. అతని కోసం ఆమె వెతకాల్సిన అవసరం లేదు. జీవం తనను తానే  బయట పెట్టుకుంటుంది. భయం ఎప్పుడూ దాక్కోలేదు. ఆమె మెల్లగా ఆ దిశగా నడిచింది. ఆమె అడుగులు వేగంగా లేవు. అవి ఎప్పుడూ తొందరపడవు. కానీ ఆమె  అవి సమయానికి చేరవలసిన చోటుకి చేరుకుంటాయి.

ఒకప్పుడు మనుషులు, పశుపక్ష్యాదులు, చెట్టు చేమలు, అడవులతో కళకళ లాడుతూ ఉండే ధరిత్రి అంతా రుద్రభూమిని తలపిస్తోంది. ఆమె ఆలోచిస్తూ ఒక్క క్షణం ఆగింది. అంతటా నిశ్శబ్దం. సూదిమొన పడితే వినిపించేటంతటి నిశ్శబ్దం. ఆ నిశ్శబ్దంలో ఆమెకు ఒక సవ్వడి వినిపించసాగింది. కొద్ది క్షణాల తరువాత అది గుండె సవ్వడిగా ఆమెకు అర్థమైంది. అది మనిషి శ్వాస. లబ్‌ డబ్‌మని వినిపిస్తున్న ఆ శబ్దం నిశ్శబ్దాన్ని భంగపరుస్తోంది. అక్కడ కొద్ది దూరంలో ఉన్న కొండ పక్కన ఒక చిన్న ఇంట్లోంచి ఆ శబ్దం వస్తోంది. ఆమె ఆ శ్వాస వస్తున్న ఇంటి వైపు కదిలింది. ఇంటి మధ్యలో ఒక గోడ ఉంది. లోపల ఒక వ్యక్తి మంచం మీద పడుకొని నిద్రపోతున్నాడు. ఆమెను చూడగానే అతను ఒక్కసారిగా ఉలిక్కిపడి కూర్చున్నాడు. ముఖాన్ని చేతులతో కప్పుకొని ఏడవటం మొదలుపెట్టాడు. ఆమె అతని దగ్గరకు వెళ్లి ఎదురుగా నిలబడింది. అతను ఒక్కసారిగా తలెత్తి ఆమెని చూశాడు. అతని కళ్ళల్లో భయం కనిపిస్తోంది. ముఖం మీద చెమటలు మొదలయ్యాయి. పెదవులు వణకసాగాయి. దాహంతో నాలుక పిడచ కట్టుకుపోతోంది. 

అయినా సరే ఓపిక తెచ్చుకొని ‘‘నువ్వెవరు?’’ అని అడిగాడు.
అతని మాటలకు ఆమె నవ్వింది. ఆ నవ్వు ఆ గది అంతా ప్రతిధ్వనించసాగింది. ఆ నవ్వులో సత్యం వినిపిస్తోంది.
‘‘నేనెవరో నీకు తెలియదా?’’ అని ఆమె అతని వైపు చూస్తూ అడిగింది.
అతను భయంతో వెనక్కి జరిగి, ‘‘నా...కు  ను...వ్వు  ఎ...వ...రో... తెలియదు’’ అన్నాడు వణుకుతున్న స్వరంతో.

‘‘నేనెవరో తెలిసినా నువ్వు అబద్ధాలాడుతున్నావు. ఎందుకంటే నేను రావడం నీకు ఇష్టం లేదు. నీకే కాదు, ఏ జీవికీ ఇష్టం ఉండదు. నేనంటే మీకు భయం. అయినా సమయం వచ్చినప్పుడు నేను రాక తప్పదు. ఇది నగ్న సత్యం. ఈ సత్యాన్ని మీరు ఒప్పుకోరు. అందరూ వెళ్లిపోయారు. నువ్వు ఒక్కడివే మిగిలావు. నిన్ను కూడా తీసికెళ్ళిపోతే నా పనై పోతుంది. బయలుదేరు. సమయం మించిపోతోంది. ఇప్పటికే ఆలస్యం అయింది’’ అంది ఆమె కోపంగా.

‘‘నేను నీతో రాను. నాకు ఇక్కడ బోలెడు పనులు వున్నాయి. నేను నీతో వస్తే అవన్నీ ఆగిపోతాయి. నేను తరువాత వస్తాను. అయినా నేను నీతో ఎందుకు రావాలి? నన్ను తీసికెళ్ళడానికి నువ్వు ఎవరు? నీకేం హక్కు వుంది?’’ అని అన్నాడు అతను గోడ దగ్గరకు వెళుతూ.
అతని మాటలకు ఆమె కోపంగా అతనివైపు చూసింది. అంతే! గాలి ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమె అతని వైపు వెళ్ళసాగింది. ఇప్పుడు ఆమె కళ్ళలో కోపం లేదు. దయ లేదు. జాలి అంతకన్నా లేదు. ఆమె కళ్ళల్లో ఏ భావం కనిపించటం లేదు.

‘‘నేనెవరో నీకు తెలుసు. అయినా మీ మనుషులు మీ గోతిని మీరే తవ్వుకున్నారు. హాయిగా బతకమని మిమ్మల్నందరినీ ఇక్కడకు పంపిస్తే మీరు ఇక్కడ వినాశనాన్ని సృష్టించారు. యుద్ధాలు మొదలయ్యాయి. అణుబాంబులు, రసాయన ఆయుధాలతో మనిషి మనిషినే చంపడం ప్రారంభించాడు. అతను రాక్షసులతో పోరాడుతున్నానని అనుకున్నాడు. కానీ తన జాతిని తానే నాశనం చేస్తున్న విషయాన్ని గ్రహించలేకపోయాడు. చివరకు తానే తన జాతి పాలిట రాక్షసుడయ్యాడు. మీ జాతితో పాటు ఇక్కడి ప్రకృతిని, జంతుజాలాన్ని, అడవుల్ని కూడా విధ్వంసం చేశాడు. అందుకే మీరు ఇక్కడుండే అర్హత కోల్పోయారు’’ అంటూ ఆమె అతని వైపు చేయి చాపింది.

‘‘ఎవరో తప్పు చేస్తే దానికి మేమెలా కారణం అవుతాము. ఎవరు తప్పు చేస్తే వాళ్ళను శిక్షించాలి. అయినా అంత తప్పు మేమేం చేశాము? మేము ప్రకృతిని స్వంతం చేసుకోవాలని చూశాము. ఆమెతో కలిసి లేకపోయాము’’ అన్నాడు ఆ వ్యక్తి.

ఆ మాటలు అంటూ ఉంటే అతని కళ్ళలో నీళ్లు మెరిశాయి. అప్పుడతనికి తమ జాతి చేసిన తప్పు ఏమిటో అర్థమైంది. నిజం ఎప్పుడూ నిజమే. అది అబద్ధం ఎప్పటికీ కాదు. ‘Truth is rarely pure and never simple’’ (సత్యం అరుదుగా స్వచ్ఛమైనది, అదెప్పుడూ సులువైనది కాదు) అన్న ‘ఆస్కార్‌  వైల్డ్‌’ మాటలు అతనికి అప్పుడు గుర్తుకు వచ్చాయి.

అతని మాటలు ఆమెకు కోపాన్ని తెప్పించాయి. మీరేం తప్పు చేశారో మీకు తెలియదా? నేను చెప్పాలా? మీ కోసం ఆ దేవుడు ఈ అందమైన భూగోళాన్ని సృష్టించాడు. అది అగ్నిగోళంగా మొదలై, జలగోళంగా మారి, జీవకోటికి అనువుగా మారింది. ఈ భూమి మీద మొదటిసారిగా కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక సూక్ష్మకణం కదిలి జీవం పోసుకొని ప్రాణిగా మారింది. తరువాత అది జీవ పరిణామం చెందింది. విస్తరించింది. చివరకు మనిషిగా రూపుదిద్దుకుంది. అయితే మనిషి పుట్టుకనుంచే దారి తప్పాడు. ‘Nature is the source of all true knowledge’’ (సమస్త జ్ఞానానికీ ప్రకృతే మూలాధారం) అని మీ మనిషే అయిన  లియోనార్డో  డా విన్సీ చెప్పాడు. కానీ మీరు అతని మాటలను పెడచెవిన పెట్టారు. ప్రకృతి నుంచే జ్ఞానం పుట్టింది. కానీ ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునే వినయం మనిషి కోల్పోయాడు. 

మనిషి గొప్ప పనులను చెయ్యగలడు. గొప్పగా ఆలోచించగలడు. సృష్టికి ప్రతిసృష్టిని చెయ్యగల నేర్పరి. అది అతని మహత్తు. అది అతని వరం. కానీ అదే అతని శాపమైంది. అతను అగ్నిని కనుగొన్నాడు. చక్రాన్ని సృష్టించాడు. భాషను కనిపెట్టాడు. లిపిని తయారు చేసుకున్నాడు. కానీ అతను తనను తాను దేవుడిగా భావించడం మొదలుపెట్టాడు. ‘Knowledge is power, but wisdom is restraint.’’ (జ్ఞానం శక్తి, కాని వివేకం నియంత్రణ) జ్ఞానం అతనికి శక్తిని ఇచ్చింది కానీ, జ్ఞానం మీద నియంత్రణను అతను కోల్పోయాడు. అందువల్ల అదే అతని వినాశనానికి కారణభూతమైంది. ఈ భూమి మీద నాలుగు వందల కోట్ల సంవత్సరాల నిశ్శబ్ద తపస్సు తర్వాత జీవకోటి ప్రాణం పోసుకుంది. అప్పటి నుంచి ఈ ధరిత్రి అనేక జనన మరణాలను చూసింది. ‘The Earth does not belong to man; man belongs to the Earth.’’ (భూమి మనిషిది కాదు, మనిషి భూమికి చెందుతాడు) భూమి ఎవరికీ చెందదు. కానీ ఆ విషయాన్ని మీ మనుషులు  గుర్తించలేకపోయారు. మట్టిలోంచి పుట్టిన మనిషి, మట్టిలో కలవాల్సిందే అన్న నగ్నసత్యం అతనికి ఎప్పుడూ అర్థం కాలేదు. ఫలితం– అడవులు నాశనం అయ్యాయి. నదులు ఎండిపోయాయి. పర్వతాలు తరిగిపోయాయి. తాను ప్రకృతిని జయిస్తున్నానని అనుకున్నాడు. ‘Man conquers nature only to discover he has conquered himself..’’ (మనిషి తనను తాను జయించానని కనుగొనడానికి ప్రకృతిని జయిస్తాడు) కానీ అది ఎంతటి విపరీతాలకు దారి తీస్తుందో అర్థం చేసుకోలేకపోయాడు

ప్రకృతిని జయించినట్టు అనిపించిన ప్రతి క్షణం, తనను తానే నాశనం చేసుకున్నాడు. ప్రకృతి ఎప్పుడూ మౌనంగా ఉంటుంది. ఆమె హెచ్చరికలు మెల్లగా వస్తాయి. గాలి వేడెక్కింది. నీళ్లు విషపూరితం అయ్యాయి. జీవజాలం క్షీణించింది. కానీ పట్టించుకోలేదు. ‘We do not inherit the Earth from our ancestors’’ (భూమిని మనం మన పూర్వీకుల నుంచి వారసత్వంగా పొందలేదు) కానీ భూమిని, దాని మీద వుండే ప్రకృతిని మీ మనుషులు తన స్వంత ఆస్తి అనుకున్నారు. దాన్ని నాశనం చెయ్యడం మొదలుపెట్టారు.

అందుకే అది మీ మీద కన్నెర్ర చేసింది. ఒక రోజు అది తన ప్రతాపాన్ని చూపింది. అందువల్ల అగ్ని వర్షాలు, ఆమ్ల వర్షాలు కురిశాయి. గాలి విషంలా మారింది. భూమి కంపించింది. మనిషి పరుగెత్తాడు. దాక్కున్నాడు. పోరాడాడు. కానీ ‘nature is not cruel, just unapologetically true to itself ’’ (ప్రకృతి క్రూరమైనది కాదు, కేవలం తనకు తాను ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా తన స్వభావానికి కట్టుబడి ఉంటుంది) ప్రకృతి క్రూరమైనది కాదు, కేవలం తన నిజ స్వరూపానికి కట్టుబడి ఉంటుంది. అది న్యాయానికి కట్టుబడి ఉంటుంది. ప్రకృతిని మీరు నాశనం చేయాలనుకున్నారు. కానీ చివరకు మీరే నాశనం అయ్యారు. అందుకే మీ జాతి అంతరించిపోయింది. చివరికి నువ్వొక్కడివే మిగిలావు. నువ్వు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఈ భూమ్మీద మిగతా జీవరాశులు హాయిగా నివసిస్తున్నాయి. ఆంథ్రోపాలజీ ప్రకారం మీ మనుషులు వానర జాతి కుటుంబానికి చెందినవారు. కాలక్రమేణా మీరు ద్విపాదులయ్యారు. అటువంటి గొప్ప మానవుల్లో నువ్వు ఆఖరి మనిషివి. నిన్ను తీసికెళదామనే నేను ఇప్పుడు వచ్చాను. బయలుదేరు’’ అంది ఆమె.

ఆమె మాటలకు అతను ఆశ్చర్యపోతూ, ‘‘నేను చచ్చినా రాను. ఇంతకీ నన్ను తీసికెళ్ళడానికి నువ్వెవరివి?’’ అని అడిగాడు ఆ ఆఖరి మనిషి.
అతని మాటలకు ఆమె నవ్వుతూ ‘‘ఇంకా నన్ను పోల్చుకోలేదా? నేను మీ జాతిని సర్వనాశనం చెయ్యడానికి ఆ ప్రకృతి పంపించిన మృత్యుదేవతను’’ అంటూ తన చెయ్యిని అతని వైపు తిప్పింది. 

వెంటనే ఆ చేయి అతని వైపు కదల సాగింది. అతను స్పృహ తప్పి పడిపోతున్నాడు. కళ్ళు మూతలు పడిపోతున్నాయి. స్పర్శ ఆగిపోతున్నట్లు భావన కలుగుతోంది. అతను కొద్ది క్షణాలకు అచేతనుడయ్యాడు. వెంటనే అతను మేల్కొన్నాడు. అతను బయటకు వెళ్లి అక్కడి నుంచి పరుగు లంఘించుకున్నాడు. అతను చాలాసేపు పరిగెత్తిన తరువాత అలసిపోవడం వల్ల బాగా దాహం వేసి ఒక చెట్టు కిందకు చేరాడు. కానీ అక్కడ నవ్వుతూ అదే మృత్యుదేవత కనిపించింది.
‘‘ఎక్కడికి పరిగెడుతున్నావు? ఎంత దూరం వెళతావు. నువ్వు ఎక్కడికి వెళ్లినా నేను నీ వెంటే ఉంటాను. నీ మృత్యువు ఎప్పుడూ నీ నీడలా నీ వెంటే ఉంటుంది. అటువంటి నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. నా చేతులు కబంధుడిలా చాలా పెద్దవి’’ అంది ఆమె నవ్వుతూ.

అప్పుడు అతను ‘‘దయచేసి నన్ను వదిలెయ్యి. నేను కూడా చనిపోతే ఈ భూమ్మీద మనిషి అన్నవాడి ఆనవాలు లేకుండా పోతుంది. ‘I am the Last Man! ... No king, no lord, no slave, no master; but aman, alone in the world!’’ (నేను ఆఖరి మనిషిని!... రాజును కాదు, ప్రభువును కాదు, బానిసను కాదు, యజమానిని కాదు; కేవలం మనిషిని, ఈ ప్రపంచంలో ఏకాకిని) అనీ అతను వేడుకున్నాడు.
అప్పుడు మృత్యువు నవ్వింది.

You were never meant to last forever’’ (ఎల్లకాలం మనుగడ సాగించడానికి నువ్వు లేవు)  మీ జాతి తన పరిమితిని దాటి వెళ్లింది. ఇక మిమ్మల్ని ఉపేక్షించే ప్రశ్నే లేదు’’ అంది అతని దగ్గరకు వస్తూ. 
‘‘అమ్మా! దయచేసి నా దగ్గరకు రావద్దు. మేము తప్పు చేశాము. అంత మాత్రాన మా జాతి ఉనికి లేకుండా చేస్తావా? ఇది న్యాయమా చెప్పు?’’ అని ఆమెకు రెండు చేతులెత్తి దండం పెట్టాడు.

క్షణం తరువాత ఆమె చేయి అతన్ని తాకింది. ఆ స్పర్శ చలిగా లేదు, వేడిగా లేదు; అతనికి స్పర్శ తెలియటం లేదు. అతను కళ్ళు మూసుకున్నాడు. ఇప్పుడతనికి భయం పోయింది. అహంకారం కరిగిపోయింది. మృత్యువు అతనిని తాకింది. ఆఖరి మనిషి చరిత్ర పుటల్లో చివరి పంక్తిగా మిగిలిపోయాడు. 
గాలి మళ్లీ స్వచ్ఛమైంది. వర్షం మళ్లీ మృదువుగా కురిసింది. ప్రకృతి మళ్లీ మొదలైంది. మనిషి లేకుండా కూడా ఆమె సంపూర్ణమే. ‘All the world's a stage, and all the men and women merely players.’’ (ప్రపంచమంతా నాటకరంగం. స్త్రీ పురుషులంతా నటీనటులు) అని విలియం షేక్‌స్పియర్‌ చెప్పాడు. కానీ భూమ్మీద మనిషి ఆడే నాటకంలో మనిషి పాత్ర ముగిసింది. కానీ వేదిక ఇంకా ఉంది. నిశ్శబ్దం. ఆ చెట్టు కింద గాలి కూడా ఊపిరి బిగబట్టి నిలిచినట్టుంది.
ఆఖరి మనిషి ఆమె ముందు అచేతనుడై పడివున్నాడు. ఆ రాత్రి ఒక మనిషి చనిపోలేదు, ఒక జాతి కథ ముగిసింది. మనిషి శాశ్వతం కాదు. మనిషి తన మూలాన్ని మరచిపోయిన క్షణమే అతని వినాశనం ప్రారంభమైంది. మనిషి ఆలోచించాడు. 

ఆ ఆలోచన అతనికి శక్తి ఇచ్చింది. కానీ ఆ శక్తి అతని మితిమీరిన ఆకాంక్షలకు ఆయుధమైంది. ఆకాశాన్ని తాకాడు, సముద్ర గర్భాన్ని చీల్చాడు. కానీ, తన అంతర్ముఖంలో ఉన్న లోపలి అంతరాత్మను మాత్రం జయించలేకపోయాడు. మనిషికి జ్ఞానం పెరిగింది, వివేకం తగ్గింది.
కొద్ది క్షణాల తరువాత ఆమె ఒక పుస్తకం తీసి అందులో ఆఖరి మనిషి అన్న వాక్యం దగ్గర ఒక ఇంటూ మార్కు పెట్టింది. ఇప్పుడు ఆ పుస్తకం నిండా ఎర్రటి ఇంటూ మార్కులే. అది ఆ పుస్తకం చివరి పేజీ.

గన్నవరపు నరసింహ మూర్తి 

Advertisement
 
Advertisement
Advertisement