Asia Power Businesswomen List 2022: పవర్‌కు కేరాఫ్‌ అడ్రస్‌

3 Indians featured in Asias 20 Asia Power businesswomen - Sakshi

‘అవకాశం అనేది మీ తలుపు తట్టకపోతే కొత్త తలుపు తయారు చేసుకోండి’ అనే మాట ఉంది. అవును. కొత్తగా ఆలోచించినప్పుడు మాత్రమే కొత్తశక్తి వస్తుంది. ఆ శక్తి ఈ ముగ్గురు మహిళలలో ఉంది. ‘ఆసియాస్‌ పవర్‌ బిజినెస్‌ ఉమెన్‌’ జాబితాలో చోటు సంపాదించిన గజల్‌ అలఘ్, నమితా థాపర్, సోమా మండల్‌ల గురించి... ఫోర్బ్స్‌ ‘ఆసియాస్‌ పవర్‌ బిజినెస్‌ ఉమెన్‌’ జాబితాలో మన దేశానికి చెందిన గజల్‌ అలఘ్, నమితా థాపర్, సోమా మండల్‌లు చోటు సంపాదించారు. కోవిడ్‌ కష్టాలు, నష్టాలను తట్టుకొని తమ వ్యాపార వ్యూహాలతో సంస్థను ముందుకు తీసుకెళ్లిన వారికి ఈ జాబితాలో చోటు కల్పించారు.

‘హొనాసా కన్జూమర్‌’ కో–ఫౌండర్‌ గజల్‌ అలఘ్‌ చండీగఢ్‌లోని ఉమ్మడి కుటుంబంలో పెరిగింది. ఆ పెద్ద కుటుంబంలో మహిళల నోట ఉద్యోగం అనే మాట ఎప్పుడూ వినిపించేది కాదు. అయితే తల్లి మాత్రం గజల్‌కు ఆర్థిక స్వాత్రంత్యం గురించి తరచు చెబుతుండేది. పదిహేడు సంవత్సరాల వయసులో కార్పోరేట్‌ ట్రైనర్‌గా తొలి ఉద్యోగం చేసిన గజల్‌ ఆ తరువాత కాలంలో సక్సెస్‌ఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్, ఇన్నోవేటర్‌ అండ్‌ ఇన్వెస్టర్‌గా పేరు తెచ్చుకుంది. ప్రణాళికాబద్ధంగా పని చేయడం తన విజయరహస్యం. మూడురోజుల తరువాత చేయాల్సిన పని అయినా సరే ఈ రోజే పక్కాగా ప్లాన్‌ చేసుకుంటుంది. ధ్యానంతో తన దినచర్య మొదవుతుంది.

కోవిడ్‌ ఉధృతి సమయంలో వ్యాపారం కుప్పకూలిపోయింది. అందరిలో భయాలు. ఆ భయం ఆఫీసు దాటి ఇంట్లోకి కూడా వచ్చింది. తల్లిదండ్రుల మౌనం పిల్లలపై పడింది. దీంతో వెంటనే మేల్కొంది గజల్‌. సరదాగా భర్త, పిల్లలతో యూట్యూబ్‌ వీడియోలు చేయడం మొదలుపెట్టింది. అలా ఇంట్లో మళ్లీ సందడి మొదలైంది. ఆ ఉత్సాహవంతమైన సందడిలో విచారం మాయమై పోయింది. తన సరికొత్త వ్యూహాలతో వ్యాపారం పుంజుకుంది. ‘విచారంలో మునిగిపోతే ఉన్న కాస్తో కూస్తో ఆశ కూడా మాయమైపోతుంది. పరిస్థితులు మరింత దిగజారిపోతాయి. ఇలాంటి సమయంలోనే మానసికంగా గట్టిగా ఉండాలి’ అంటుంది గజల్‌.

 ‘ఎమ్‌క్యూర్‌ ఫార్మా’ ఇండియా ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ నమితా థాపర్‌ రచయిత్రి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ కోచ్, యూ ట్యూబ్‌ టాక్‌షో ‘అన్‌కండీషన్‌ యువర్‌సెల్ఫ్‌ విత్‌ నమితా థాపర్‌’ నిర్వాహకురాలు. సక్సెస్‌ఫుల్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌గా రాణిస్తున్న నమితా ‘థాపర్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌ అకాడమీ’ ద్వారా ఎంతోమంది ఔత్సాహికులకు విలువైన పాఠాలు చెబుతోంది. తన తాజా పుస్తకం ‘ది డాల్ఫిన్‌ అండ్‌ ది షార్క్‌: లెస్సెన్స్‌ ఇన్‌ ఎంటర్‌ప్రెన్యుర్‌షిప్‌’కు మంచి ఆదరణ లభించింది.

‘ప్రపంచం కోసం నువ్వు మారాలని ప్రయత్నించకు.  నువ్వు నీలాగే ఉంటే ప్రపంచమే సర్దుబాటు చేసుకుంటుంది’ ‘నిన్ను నువ్వు ప్రేమించుకోవడం ద్వారా మాత్రమే నీలోని శక్తి నీకు కనిపిస్తుంది’...ఇలాంటి ఉత్తేజకరమైన వాక్యాలు ఈ పుస్తకంలో కనిపిస్తాయి. ‘మొదట్లో నాలో ఆత్మవిశ్వాసం ఉండేది కాదు. లావుగా ఉండడం వల్ల చిన్నప్పుడు తోటి పిల్లలు వెక్కిరించేవారు. వారి మాటలను సీరియస్‌గా తీసుకొని ఉంటే నిస్పృహ అనే చీకట్లోనే ఉండేదాన్ని. నన్ను నేను తెలుసుకోవడానికి సమయం పట్టింది. ఆ తరువాత మాత్రం ఆత్మ విశ్వాసాన్ని ఎప్పుడూ కోల్పోలేదు’ అంటుంది నమితా థాపర్‌.

భువనేశ్వర్‌కు చెందిన సోమా మండల్‌ చదువులో ఎప్పుడూ ముందుండేది. తాను ఇంజనీరింగ్‌లో చేరడానికి తండ్రి ఒప్పుకోలేదు. ఇంజనీరింగ్‌లాంటి వృత్తులు అమ్మాయిలు చేయలేరు అని ఆయన అనుకోవడమే దీనికి కారణం. అయితే కుమార్తె పట్టుదలను చూసి తండ్రి తన నిర్ణయాన్ని మార్చుకోక తప్పలేదు. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌లో పట్టా తీసుకున్న సోమా మండల్‌ అల్యూమినియం తయారీ సంస్థ ‘నాల్కో’లో ట్రైనీగా తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాకు తొలి మహిళా చైర్‌పర్సన్‌గా చరిత్ర సృష్టించింది. నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట పట్టించి జేజేలు అందుకుంది.

Read latest Family News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top