
ఆపరేషన్ సిందూర్‌లో ఎయిర్‌ఫోర్స్ కీలక పాత్రపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తంచేశారు. ఈ రోజు ప్రధాని మోదీ పంజాబ్‌లోని అదంపూర్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి..ఎయిర్ ఫోర్స్ సిబ్బందితో ముచ్చటించి వారిని అభినందించారు. అలాగే పాక్‌కు ఇండియా ఎయిర్‌ఫోర్స్ సత్తా చూపించారంటూ ప్రశంసలు కురిపించారు కూడా. ఈ నేపథ్యంలో 1971 ఇండియా-పాక్ యుద్ధంలో ధ్వంసమైన భుజ్ వైమానిక దళ స్థావరాన్ని గంటల వ్యవధిలో పునర్నిర్మించి.. పాక్ దాడులను తిప్పిగొట్టిన గాథ గురించి తెలుసుకుందామా..!.
1971 ఇండియా-పాక్ యుద్ధంలో..డిసెంబర్‌లో ఒక రాత్రి గుజరాత్‌లోని భుజ్ వైమానిక స్థావరంపై 14 ప్రాణాంతకమైన నాపామ్ బాంబులను జారవిడిచి కల్లోలం సృష్టించింది. ఆబాంబుల ధాటికి భుజ్ రన్‌వే ధ్వంసమైపోయింది. దాంతో భారత్ యుద్ద విమానాలు ఎగరలేని పరిస్థితి ఎదురైంది. మరోవైపు యుద్ధ కొనసాగుతోంది. ఈ విపత్కర పరిస్థితిలో వైమానికి దళాలకు ఏం చేయాలో పాలిపోలేదు.
అదీగాక ఆ స్థావరంపై కేవలం రెండు వారాల్లోనే 35 సార్లకు పైగా బాంబు దాడులు జరిగాయి. మరోవైపు పాక్ శత్రు మూకలు ఆస్థావరాన్ని ఆక్రమించుకునేంత చేరువలో ఉన్నారు. చెప్పాలంటే..రన్‌వే లేకపోతే మొత్తం భారతవైమానిక రక్షణ వ్యవస్థ నేలమట్టం అయినట్లేనని పేర్కొనచ్చు. అలాగే అక్కడ ఉన్న సైన్యం, ఇంజనీర్లు కూడా తక్కువే మందే.
సరిగ్గా అప్పుడే భుజ్ ఎయిర్‌బేస్‌కు ఇన్‌ఛార్జ్‌గా ఉన్న స్క్వాడ్రన్ లీడర్ విజయ్ కార్నిక్ మెరుపులాంటి ఆలోచన తట్టింది. అది ఫలిస్తుందా లేదా అన్న అనుమానం వ్యక్తం చేసే వ్యవధిలేని సంకటస్థితి. పైగా ప్రతి సెకను అత్యంత అమూల్యమైనది. దాంతో ఆయన సమీపంలోని మాదాపూర్ గ్రామంలోని మహిళలను సాయం తీసుకున్నారు. మొత్తం 300 మంది మహిళలు సాయం చేసేందుకు ముందుకొచ్చారు. వారిలో తల్లులు, కుమార్తెలు, వితంతువులు కూడా ఉన్నారు.
ఆకుపచ్చ చీరలే ఎందుకంటే..
వారంతా శత్రు విమానాలకు కనపడకుండా ఆకుపచ్చ చీరలు ధరించి రన్‌వే నిర్మాణంకు పూనుకున్నారు. బరువైన రాళ్లను, సిమెంట్ బకెట్లను మోసుకెళ్లారు. చేతులతో మెర్టార్ కలిపారు. తమ ఇంటిని నిర్మించినంత శ్రద్ధతో రన్‌వేని తిరిగి నిర్మించారు. అయితే వైమానిక దాడి సైరన్లు మోగినప్పుడల్లా పొదల్లోకి వెళ్లి దాక్కునేవాళ్లు.
ఆ ఆకుపచ్చని వస్త్రం ప్రకృతిలో కలిసిపోవడానికి ఉపయోగపడుతుందని..ఆ వస్త్రం ధరించే ఈ పనికి పూనుకున్నట్లు సమాచారం. ఆ మహిళలంతా ఆకలి, భయం, నిద్రలేని రాత్రులతో ఆహర్నిశలు కష్టపడ్డారు. పగుళ్లు మూపివేసేలా ఆవుపేడ ఉపయోగించారు. అలా వారంతా కేవలం 72 గంటల్లోనే రన్‌వేని తిరిగి నిర్మించారు. దాంతో గగనంలో కూడా యుద్ధం చేయగల శక్తిని భారత్ అందుకోగలిగింది. నిజానికి ఆ మహిళలకు ఆ నిర్మాణ పనిలో శిక్షణ లేదు, అలాగే యుద్ధ అనుభం, రక్షణాయుధాలు కూడా లేకుండా అజేయమైన ధైర్యమైన సాహసాలతో ముందుకొచ్చిన వీర వనితలు.

ఆ రాత్రి ఏం జరిగిందంటే..
నాటి రన్‌వే పునర్నిర్మాణంలో పాలుపంచుకున్న మహిళల్లో ఒకరైన కనాబాయి శివ్‌జీ హిరానీ మాట్లాడుతూ..1971 భారత్-పాక్‌కి యుద్ధం జరుగుతున్నప్పుడూ..నాకు 24 ఏళ్లు. డిసెంబర్‌లో ఒక రోజు రాత్రి భుజ్‌లోని విమానాశ్రయం రన్‌వేపై బాంబు దాడి చేసింది పాక్. రాత్రిపూట దాడి చేయడంతో అక్కడున్న ప్రతిదీ నాశనమైపోయింది. ఏం చేయాలో తోచని స్థితి. కాని యావత్తు దేశాన్ని ప్రమాదంలో పెట్టే పరిస్థితి కాబట్టి మా గ్రామంలోని మహిళ ఇందుకు తమ వంతుగా సహకరించేందుకు ముందుకొచ్చారు అని నాటి ఘటనను గుర్తు చేసుకున్నారు". హిరానీ.
దశాబ్దాలు గడుస్తున్న పాక్ తీరులో మార్పురావడంలో లేదు. కచ్చితంగా ప్రధాని మోదీ దీనిపై గట్టి చర్య తీసుకోవాలి. అలాగే పాక్‌కు నీరు, ఆహార సరఫరాను పూర్తిగా నిలిపివేయాలి. అప్పుడుగానీ వారికి తాము ఏం తప్పు చేశామన్నాది తెలియదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారామె. పైగా తాను పాక్‌పై ద్వేషంతో ఇలా అనడం లేదని..తన జీవితానుభవంతో చెబుతున్న ఆవేధనభరితమైన మాటలని అన్నారు హిరానీ.
(చదవండి: Indian Army soldier: మనసును కదిలించే సైనికుడి రియల్ స్టోరీ..నటుడు మోహన్ లాల్ సైతం ఫిదా..!)