హైవేపై ‘నంబర్‌’ నిఘా | - | Sakshi
Sakshi News home page

హైవేపై ‘నంబర్‌’ నిఘా

Oct 8 2026 1:06 AM | Updated on Oct 8 2026 1:06 AM

హైవేపై ‘నంబర్‌’ నిఘా హైవేపై నిఘా పటిష్టం ●

నేరాల ఛేదనలోనూ కీలకం

ద్వారకాతిరుమల : హైవేపై వాహనం వేగంగా దూసుకెళ్లినా.. నంబర్‌ మాత్రం కెమెరా కంటికి చిక్కాల్సిందే! రోడ్డు ప్రమాదాల నియంత్రణతో పాటు నేరాలకు పాల్పడి వాహనాల్లో పరారయ్యే వారిని గుర్తించేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఏలూరు జిల్లా పోలీసుల ప్రత్యేక చర్యల్లో భాగంగా ద్వారకాతిరుమల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని జాతీయ రహదారి–16పై రెండు ప్రాంతాల్లో అత్యాధునిక ఆటోమేటిక్‌ నంబర్‌ ప్లేట్‌ డిటెక్షన్‌ (ఏఎన్‌పీఆర్‌) కెమెరాలు ఏర్పాటు చేశారు. ఎం.నాగులపల్లి, లక్ష్మీనగర్‌ ప్రాంతాల్లో సుమారు రూ.2 లక్షల విలువైన కెమెరాలను స్థానిక శ్రీనిధి ఫీడ్స్‌ కంపెనీ యాజమాన్యం సహకారంతో ఏర్పాటు చేశారు. జిల్లా ఎస్పీ కె.ప్రతాప్‌ శివకిషోర్‌ ఆదేశాల మేరకు ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్‌కుమార్‌, భీమడోలు సీఐ పి.కృష్ణ, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్‌ ఆధ్వర్యంలో ఈ చర్యలు చేపట్టారు. కెమెరాల ఏర్పాటు పనులు పూర్తవడంతో వాటి పనితీరును బుధవారం వారు పరిశీలించారు.

నంబర్‌ ప్లేట్‌.. కదలికల రికార్డు

హైవేపై నిరంతరం రాకపోకలు సాగించే వాహనాల నంబర్‌ ప్లేట్లను ఈ కెమెరాలు స్కాన్‌ చేసి నమోదు చేయగలవు. దీంతో అనుమానాస్పద లేదా నేరాల్లో వినియోగించిన వాహనం ఏ మార్గంలో వెళ్లిందన్న దానిపై పోలీసులకు కీలక ఆధారాలు లభించే అవకాశం ఉంటుంది. ప్రమాదం జరిగిన తర్వాత వాహనం ఆగకుండా వెళ్లిపోయినా.. కెమెరా ఫుటేజీ, నంబర్‌ ఆధారంగా దాని కదలికలను వెనక్కి అనుసరించడం దర్యాప్తులో ఉపయోగపడుతుంది. రాంగ్‌రూట్‌ డ్రైవింగ్‌, అతివేగం, ఇతర ట్రాఫిక్‌ ఉల్లంఘనలను గుర్తించి చర్యలు చేపట్టేందుకు ఆధునిక ఎలక్ట్రానిక్‌ ఎన్‌న్‌ఫోర్స్‌మెంట్‌ పరికరాలను వినియోగించాలని కేంద్ర నిబంధనల్లోనూ పేర్కొన్నారు. వాటిలో ఈ ఏఎన్‌పీఆర్‌ కెమేరాలు ఒకటి.

హైవేపై ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాం. వాహనదారులు హెల్మెట్‌, సీట్‌బెల్ట్‌ తప్పనిసరిగా వినియోగించాలి. అతివేగం, రాంగ్‌రూట్‌ డ్రైవింగ్‌ వంటి ఉల్లంఘనలను అరికట్టడంలో ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు ఉపయోగపడతాయి. ప్రజల ప్రాణాల రక్షణకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘిస్తే నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటాం.

– డి.శ్రావణ్‌కుమార్‌, ఏలూరు డీఎస్పీ

ద్వారకాతిరుమల మండలం లక్ష్మీనగర్‌ వద్ద హైవేపై ఏర్పాటు చేసిన ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు,

కెమెరాల పనితీరును పరిశీలిస్తున్న ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్‌

వాహనం నంబర్‌ ఆధారంగా అనుమానితుల కదలికలను గుర్తించడం పోలీసుల దర్యాప్తులో కీలకంగా మారుతోంది. ఏపీ ఆర్టీజీకి చెందిన సీసీటీవీ 360 వ్యవస్థను ఉపయోగించి ఇటీవల తాడేపల్లిగూడెంలో హత్య–దోపిడీ కేసులో అనుమానితుల కదలికలను గుర్తించి కేసు ఛేదించగా, ఏలూరు జిల్లా పోలవరం పరిధిలో చోరీకి గురైన ద్విచక్ర వాహనాన్ని కూడా నిఘా వ్యవస్థ ద్వారా ట్రేస్‌ చేశారు. ద్వారకాతిరుమల–భీమడోలు మార్గంలో ఏర్పాటుచేసిన ఈ కెమెరాలు ట్రాఫిక్‌ నియంత్రణతో పాటు భవిష్యత్తులో నేర దర్యాప్తుల్లోనూ ఉపయోగపడే అవకాశం ఉంది. ముఖ్యంగా హైవే మార్గాన్ని ఉపయోగించే దొంగలు, నేరస్తుల వాహనాల కదలికలను గుర్తించడంలో పోలీసులకు అదనపు సాంకేతిక ఆధారంగా దోహదపడనున్నాయి.

ఎన్‌హెచ్‌–16పై రెండు చోట్ల ఏఎన్‌పీఆర్‌ కెమెరాలు

రూ. 2 లక్షలతో ఏర్పాటు.. ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై నిఘా

ప్రమాదాల నివారణతో పాటు నేరాల ఛేదనకూ సాంకేతిక అస్త్రం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement