నూజివీడు: రాష్ట్రంలోని నూజివీడు, ఇడుపులపాయ (ఆర్కే వ్యాలీ), ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్‌ఐటీలను నిర్వహిస్తున్న ఆర్జీయూకేటీ అధికారుల నిర్ణయాలపై వ్యతిరేకత వ్యక్తమవుతోంది. 2008లో ట్రిపుల్‌ఐటీలు ఏర్పాటైనప్పటి నుంచి విజయవంతంగా కొనసాగుతున్న సెమిస్టర్ విధానాన్ని తొలగించి వార్షిక పరీక్షల విధానాన్ని తీసుకురావడంపై విద్యార్థులు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. నాలుగు ట్రిపుల్‌ఐటీల్లో మొత్తంగా 8,800 మంది పీయూసీ విద్యార్థులు ఉన్నారు. వీరంతా సెమిస్టర్ విధానాన్ని కోరుతున్నారు.
ఏకపక్షంగా వార్షిక పరీక్షల విధానం
పీయూసీ మొదటి ఏడాది నుంచి ఇంజనీరింగ్ పూర్తయ్యే వరకూ సెమిస్టర్ విధానం ఉండగా.. గత విద్యా సంవత్సరంలో పీయూసీ (రెండేళ్లు)కి సెమిస్టర్ విధానాన్ని ఎత్తేసి వార్షిక పరీక్షల విధానాన్ని ప్రవేశపెట్టారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, ఫ్యాకల్టీ అభిప్రాయం తీసుకుకోకుండా ఏకపక్షంగా అమల్లోకి తెచ్చారు. అప్పటి నుంచి వార్షిక పరీక్షల విధానంపై అసంతృప్తి ఉన్నా అధికారుల నియంతృత్వ ధోరణి కారణంగా ఎవరూ బహిరంగంగా మాట్లాడలేకపోయారు. ఫ్యాకల్టీ ఇచ్చే సూచనలు, సలహాలను పరిగణనలోకి తీసుకునే సంప్రదాయం అధికారుల్లో లేకపోవడంతో అందరూ మిన్నకుండిపోయారు.
ఆడిట్ కమిటీ ముందు గళం
ఇటీవల ట్రిపుల్‌ఐటీల్లో నిర్వహించిన అకడమిక్ ఆడిట్ సందర్భంగా తమకు సెమిస్టర్ విధానమే కావాలని పీయూసీ విద్యార్థులు కమిటీ దృష్టికి తీసుకుచ్చారు. అనంతరం దీనిపై ఆడిట్ కమిటీ బృందం ఫ్యాకల్టీతో సమావేశం నిర్వహించగా వారు కూడా సెమిస్టర్ విధానమే ఉత్తమమని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సెమిస్టర్ విధానమే ఉండగా ఇక్కడ వార్షిక పరీక్షల విధానం వృథా ప్రయాస అని వివరించారు. ట్రిపుల్‌ఐటీల్లో అమలు చేస్తున్నది ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు కావడంతో మొదటి నుంచి చివరి వరకు ఒకే మూ ల్యాంకన విధానం ఉండటం సమంజసమని పేర్కొన్నారు. సెమిస్టర్ విధానాన్ని పునరుద్ధరించాలని, ఇ కపై విద్యా విధానాలకు సంబంధించి నిర్ణయం తీసుకునే ముందు విద్యార్థులు, ఫ్యాకల్టీ అభిప్రాయాన్ని తీసుకోవాలనే డిమాండ్ వినిపిస్తోంది.
సెమిస్టర్ విధానం కావాలంటున్న పీయూసీ విద్యార్థులు
ఫ్యాకల్టీదీ అదే అభిప్రాయం
ట్రిపుల్‌ఐటీల్లో అకడమిక్ ఆడిట్ కమిటీ దృష్టికి సమస్య


