ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): గత ఏడాది కాలంలో ఏలూరు జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీని ఎంతో అభివృద్ధి చేశామని డీసీఎంఎస్ చైర్మన్ చాగంటి మురళీకృష్ణ తెలిపారు. శనివారం స్థానిక డీసీఎంఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను బాధ్యతలు స్వీకరించిన తరువాత జిల్లాలో డీసీఎంఎస్ ఆధ్వర్యంలో నరసాపురం, ఉండి, భీమడోలు, కొయ్యలగూడెం, టి.నరసాపురంలలో నూతనంగా ఎరువుల డిపోలు ప్రారంభించి ఆ ప్రాంత రైతులకు కూడా ఎంఆర్‌పీ కంటే తక్కువ ధరలకే ఎరువులు అందించే ఏర్పాటు చేశామన్నారు. అలాగే సీతానగరంలో మరో ఎరువుల డిపోను ప్రారంభించడానికి ఏర్పాటు చేశామన్నారు. జిల్లా ప్రజల ఆరోగ్య పరిరక్షణ కోసం తక్కువ ధరలకే మందులు విక్రయించడానికి జనరిక్ మందులు షాపులు నిర్వహిస్తున్నామని, కొత్తగా మరిన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. అలాగే ప్రజలకు తక్కువ ధరలకే నిత్యావసర వస్తువులు అందించడానికి ఏలూరులో ఏర్పాటు చేసిన సూపర్ మార్కెట్‌కు విశేష ఆదరణ లభిస్తోందని, దీంతో ఏలూరులోని సత్రంపాడు, నిడదవోలు, భీమవరంలలో కూడా సూపర్ మార్కెట్లు ఏర్పాటుకు చర్యలు తీసుకున్నామన్నారు. అలాగే డీసీఎంఎస్‌లో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న 8 మంది ఉద్యోగులను రెగ్యులర్ చేశామని, కొత్తగా మరో 15 మందికి ఉద్యోగావకాశాలు కల్పించామన్నారు. రానున్న రోజుల్లో డీసీఎంఎస్ ద్వారా జిల్లాలోని రైతులకు సామాన్య, మధ్యతరగతి ప్రజల అభివృద్ధి కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టడానికి కార్యాచరణ రూపొందించామన్నారు.


