గణపవరం (నిడమర్రు): రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ జయంతి వేడుకలు జిల్లావ్యాప్తంగా వాడవాడలా ఘనంగా జరిగాయి. వివిధ నియోజకవర్గాల్లోని ప్రజాప్రతినిధులు, వైఎస్సార్‌సీపీ కన్వీనర్లు అంబేడ్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ దేశానికి చేసిన సేవలను వారు స్మరించుకున్నారు.
రాజ్యాంగ స్ఫూర్తితో సాగాలి: వాసుబాబు
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి దిశానిర్దేశం చేసిన అంబేడ్కర్ ఆలోచనలు అన్ని వర్గాలకు మార్గదర్శకాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు అన్నారు. నిడమర్రు వైఎస్సార్ కాలనీలో అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంబేడ్కర్ ఆశయాలను ఆచరించడమే మనందరి కర్తవ్యమని పేర్కొన్నారు.
అణగారిన వర్గాల ఆశాజ్యోతి: తెల్లం బాలరాజు
బుట్టాయగూడెం: భారత రాజ్యాంగ నిర్మాత ఆశయాలకు అనుగుణంగానే మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలన సాగిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు కొనియాడారు. ముప్పినవారిగూడెం ఎస్సీ కాలనీలో జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు. అంబేడ్కర్ ప్రపంచ మేధావి అని, అణగారిన వర్గాల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు.
చింతలపూడిలో ఘనంగా ర్యాలీ: కంభం విజయరాజు
చింతలపూడి: నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో అంబేడ్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇంచార్జ్ కంభం విజయరాజు ముఖ్య అతిథిగా పాల్గొని చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. యువత అంబేడ్కర్ ఆలోచనలను కేవలం పుస్తకాలకే పరిమితం చేయకుండా ఆచరణలో పెట్టాలని కోరారు.
ఏలూరులో..
ఏలూరు టౌన్: సమాజంలో అసమానతలను తొలగించేందుకు పోరాటం చేసి అణగారిన వర్గాలకు అండగా నిలబడుతూ ప్రతి ఒక్కరికీ సమాన హక్కులను కల్పించిన యోధులు, స్పూర్తి ప్రదాత బీఆర్ అంబేడ్కర్ అని వైఎస్సార్‌సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ అన్నారు. అంబేద్కర్ జయంతి వేడుకలను ఏలూరు వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో నగర ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.


