ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): పదో తరగతి పబ్లిక్ పరీక్షల మూల్యాంకన ప్రక్రియలో కీలక పాత్ర పోషిస్తున్న స్పెషల్ అసిస్టెంట్ల (ప్రత్యేక సహాయకులు)కు ఈనెల 4వ తేదీన నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి సంబంధించిన తగిన పారితోషికం చెల్లించాలని ఫ్యాప్టో నాయకత్వం ప్రభుత్వాన్ని కోరింది. ఈ మేరకు జిల్లా విద్యా శాఖ అధికారి ఎం. వెంకట లక్ష్మమ్మకు, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ ఆర్.ఆశకు ఫ్యాప్టో తరఫున మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఫ్యాప్టో చైర్మన్ జీ మోహన్, కో చైర్మన్ జీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మూల్యాంకన ప్రక్రియలో స్పెషల్ అసిస్టెంట్లు సమర్థవంతంగా పని చేయడానికి శిక్షణ ఎంతో అవసరమని, అయితే శిక్షణలో పాల్గొన్న రోజుకు పారితోషికం చెల్లించకపోవడం అన్యాయమన్నారు. ఇతర పరీక్షా బాధ్యతల మాదిరిగానే శిక్షణ రోజుకూ సముచిత రెమ్యునరేషన్ ఇవ్వవలసిన అవసరం ఉందన్నారు.
దెందులూరు: కోకో, కొబ్బరి పంటలలో చీడపీడలను గుర్తించి వెంటనే నివారణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఉద్యాన పంటల సలహాదారు డాక్టర్ పీ.కాళిదాస్ రైతులకు సూచించారు. మంగళవారం పెదవేగి మండలం తాళ్ల గోకవరం గ్రామంలోని కొబ్బరి, కోకో పంట తోటలను మైక్రో ఇరిగేషన్ జిల్లా అధికారి ఎస్.రామ్మోహన్, జిల్లా ఉద్యాన అధికారి కె.షాజానాయక్, అభ్యుదయ రైతు ఇంజనీర్ ప్రసాద్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కోకో పంటలో పలు చీడ పీడలను గుర్తించి నివారణ చర్యలు సూచించారు.
ద్వారకాతిరుమల: పురాతన ఆలయమైన లక్ష్మీపురంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీనివాసుని కల్యాణ మహోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం ఆలయ ఆవరణలో శ్రీచక్రవార్యూత్సవం కన్నులపండువగా నిర్వహించారు. ఈ వేడుకను పండితులు, అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణాన్ని సుగంధ భరిత పుష్పమాలికలు, మామిడి తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. శ్రీచక్రవార్యూత్సవం అనంతరం స్వామి, అమ్మవార్లను ఒక వేదికపై ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి ఆలయ ధ్వజస్తంభం వద్ద ధ్వజ అవరోహణను ఘనంగా జరిపారు. బుధవారం రాత్రి జరుగనున్న ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీపుష్ప యాగోత్సవంతో ఉత్సవాలు పరిసమాప్తం కానున్నాయి.
ఏలూరు టౌన్: అగ్ని ప్రమాదాలపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా అగ్నిమాపక అధికారి సీహెచ్ రత్నబాబు అన్నారు. అగ్ని ప్రమాదాల్లో అమరులైన అగ్నిమాపక సిబ్బంది త్యాగాలను స్మరించుకుంటూ మంగళవారం ఏలూరులో అమరవీరుల సంస్మరణ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా డిప్యూటీ చీఫ్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కృష్ణమూర్తి హాజరయ్యారు. అగ్నిప్రమాదాల నివారణకు సిబ్బంది చేపట్టే చర్యలు, యంత్రపరికరాలు వంటి వాటిని ఆయన పరిశీలించారు. ఈనెల 14 నుంచి 20 వరకూ అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహిస్తున్నట్లు డీఎఫ్‌వో చెప్పారు.


