నక్కల డ్రెయిన్‌లో అర్ధరాత్రి తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

నక్కల డ్రెయిన్‌లో అర్ధరాత్రి తవ్వకాలు

Apr 15 2026 8:02 AM | Updated on Apr 15 2026 8:02 AM

పెనుగొండ: ఆచంట నక్కల డ్రెయిన్‌లో మట్టి అక్రమ తవ్వకాలు ఆగడం లేదు. రైతులు గగ్గోలు పెట్టినా, ప్రతిపక్షం అడ్డుకున్నా టీడీపీ నేతలు, అధికారుల అండదండలతో మట్టి మాఫియా పేట్రేగిపోతోంది. ఎవడ్రా మనల్ని అపేదంటూ అర్ధరాత్రి వేళా తవ్వేస్తున్నారు. నక్కల డ్రెయిన్‌లో ఆచంట వద్ద అక్రమ తవ్వకాలను వారం రోజులుగా అడ్డుకుంటూ పరిసర ప్రాంత రైతులు పోరాటం చేస్తున్నా, మట్టి మాఫియా దూకుడుకి అడ్డుకట్ట పడడం లేదు.

అదే మంత్రం.. అదే సూత్రం

అక్రమ తవ్వకాలకు కొందరు నాయకులను అడ్డం పెట్టుకుని మట్టి మాఫియా ముందకు సాగుతోంది. ఆచంట వేమవరంలో తవ్వకాలను ఆ ప్రాంత రైతులు, నాయకులు అడ్డుకోవవడంతో కొందరు టీడీపీ నేతలు మరో వ్యూహరచన చేశారు. మేటలను తొలగించాలంటూ అధికారులకు వినతిపత్రం సమర్పించి, ఆ ముసుగులో తవ్వకాలు యథేచ్చగా కొనసాగించారు. దీనికి అధికారులు సైతం కొమ్ము కాయడం విశేషం. అదే మంత్రం, అదే సూత్రం ఆచంటలోనూ ప్రయోగించడానికి మట్టి మాఫియా టీడీపీ నాయకులతో కలసి వ్యూహరచన చేసింది. తవ్వకం జరుపుతున్న గట్టువైపు మేటలు వేయడం వలన అవతలి గట్టు బలహీన పడుతుందని అక్రమ తవ్వకాలు ప్రారంభించిన మూడు రోజులకు ఓ వినతి పత్రం సమర్పించారు. ఈ వినతిపత్రాన్ని రెవెన్యూ అధికారులు డ్రెయినేజీ అధికారులకు పంపించి చేతులు దులుపుకొన్నారు. అయితే డ్రెయినేజీ అధికారులు మాత్రం తవ్వకాలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదంటూ ప్రకటించడం గమనార్హం.

రైతులపై పోలీసుల ప్రతాపం

సోమవారం రాత్రి నుంచి మట్టి తవ్వకాలు భారీ స్థాయిలో నిర్వహించడంతో మంగళవారం రైతులు అడ్డుకుని నిరసన వ్యక్తం చేశారు. దీంతో టీడీపీ నాయకుల ఒత్తిడితో పోలీసులు రంగంలోకి దిగారు. రైతులను అదుపులోకి తీసుకొని ఆచంట పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు.

ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం

ఏడు దశాబ్ధాలుగా నక్కల డ్రయిన్‌ లంకలో ఎటువంటి మెరకలు వేయలేదని రైతులు తేల్చి చెబుతున్నారు. కేవలం అక్రమ తవ్వకాల కోసమే టీడీపీ నాయకులు కుయుక్తులు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు. మట్టి మాఫియా ఆగడాలను ఎదుర్కొనేందుకు రైతులు ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అవుతున్నారు. ఆచంటలోఽ బుధవారం ధర్నా నిర్వహించేందుకు నిర్ణయించారు.

Advertisement
 
Advertisement
Advertisement