అగ్నిప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి
● వేసవిలో పొంచి ఉన్న అగ్ని ప్రమాదాల ముప్పు
● ఏడాదిగా జిల్లాలో 362 అగ్నిప్రమాదాలు
భీమవరం(ప్రకాశం చౌక్): జిల్లాలో ఎండలు మండుతున్నాయి. సూర్యుడు తన ప్రతాపాన్ని ఏప్రిల్‌లోనే చూపిస్తున్నాడు. ప్రస్తుతం జిల్లాలో రోజుకు 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఎండల తీవ్రత బట్టి వడగాల్పులపై వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. అయితే వేసవిలో అగ్ని ప్రమాదాల ముప్పు పొంచి ఉంటుంది. వేసవిలో అగ్ని ప్రమాదాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అగ్ని ప్రమాదాల్లో ప్రాణాలతో పాటు కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరుగుతుంది. సకాలంలో స్పందించి ప్రాణాలు రక్షించినా అగ్నికి ఆస్తి ఆహుతి కావడం వల్ల సర్వం కోల్పుతున్నారు. నిర్లక్ష్యం, సరైన అవగాహన లేకపోవడంతో వేసవిలో అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వేసవిలో జరిగే అగ్ని ప్రమాదాలపై ప్రజలను అప్రమత్తం చేసేందుకు ప్రతి ఏడాది ఏప్రిల్ 14 నుంచి 20 వరకూ అగ్ని మాపక వారోత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది కూడా ఏప్రిల్ 14 తేదీ నుంచి జిల్లా వ్యాప్తంగా అగ్నిమాపక వారోత్సవాలు ప్రారంభించారు. 20 తేదీ వరకు జిల్లాలోని ఏడు అగ్నిమాపక కేంద్రాల పరిధిలో వారోత్సవాల నిర్వహణకు సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేశారు.
గతేడాది జిల్లాలో 362 ప్రమాదాలు
గతేడాది పశ్చిమగోదావరి జిల్లాలో ఏడు అగ్నిమాపక కేంద్రాల పరిధిలో మొత్తం 362 అగ్ని ప్రమాదాలు సంభవించాయి. వాటిలో అతి ప్రమాదకరమైనవి 2, మధ్యస్థాయి అగ్ని ప్రమాదాలు 21, చిన స్థాయి ప్రమాదాలు 339 జరిగాయి. రూ.18 కోట్ల మేర ఆస్తి నష్టం ఏర్పడింది. రూ.120 కోట్ల ఆస్తి ,30 మంది ప్రాణాలను రక్షించారు.
వారోత్సవాలు ఇలా
● ఈ నెల 14న అగ్నిమాపక దళ పతాకావిష్కరణ, విధి నిర్వహణలో అసువులు బాసిన సిబ్బందికి నివాళి, కరపత్రాల ఆవిష్కరణ.
● 15న బస్టాండ్, మాల్స్, మార్కెట్లు, సినిమా థియేటర్లు, మురికివాడల్లో అగ్నిమాపక పరికరాల ప్రదర్శన, అవగాహన కల్పించడం.
● 16న నివాస ప్రాంతాల్లో ముఖ్యంగా అపార్ట్‌మెంట్‌ల వద్ద, ఎల్పీజీ సేఫ్టీ, అగ్నిమాపక నియంత్రణ పరికరాల వినియోగం, అగ్ని ప్రమాదాల నివారణపై అవగాహన
● 17న విద్యా సంస్థల్లో మాక్ డ్రిల్, 18న ఎల్పీజీ నిల్వ ఉంచే విధానం, పరిశ్రమల్లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన,
● 19న ఆస్పత్రుల్లో వైద్యులు, స్టాఫ్ నర్సులు, రోగు లకు అగ్నిమాపక నియంత్రణపై అవగాహన,
● 20న అంగన్‌వాడీ కేంద్రాలు, స్వచ్ఛంద సంస్థల్లో అగ్నిప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తారు.
అగ్ని ప్రమాదాలు సంభవించకుండా
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
● గ్యాస్ స్టౌను సిలిండర్ కన్నా ఎత్తులో ఉంచాలి. వంట గ్యాస్‌కు కిరోసిన్, డీజిల్, దూరంగా ఉంచాలి.
● చిన్నారులకు అగ్గిపెట్టెలు, లైటర్లు అందుబాటులో ఉంచకూడదు.
● వంట పూర్తయిన వెంటనే రెగ్యులేటర్‌ను తప్పనిసరిగా ఆపివేయాలి.
● ఐఎస్‌ఐ మార్కు ఉన్న ఎల్పీజీ సురక్ష ట్యూబులనే వాడాలి.
● గ్యాస్ లీక్ అయితే కిటికిలు, తలుపులు వెంటనే తెరవాలి. ఎలక్ట్రికల్ స్విచ్ ఆన్, ఆఫ్ చేయకూడదు.
● ఇళ్లు వదిలి దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు విద్యుత్ మెయిన్ ఆఫ్ చేయాలి.
● విద్యుత్ పరికరాలకు నిప్పు అంటుకుంటే మెయిన్ ఆఫ్ చేసి పొడి ఇసుక లేదా డ్రై కెమికల్ పౌడర్ జల్లాలి.
● కాల్చిన సిగరెట్లు, బీడీలు, అగ్గిపుల్లలు ఆర్పివేసి పారేయాలి.
● ఎలక్ట్రిక్ పాయింట్లను ఓవర్ లోడు చేయకూడదు.
● గడ్డివాములను ఇళ్లకు తప్పనిసరిగా 60 అడుగుల దూరంలో వేసుకోవాలి. లాగే గడ్డివాములను సరైన గాలివాటంలో ఏర్పాటు చేసుకోవాలి.
● పశువుల పాకలో పొగ పెట్టె సమయంలో అప్రమత్తంగా ఉండాలి.
● కర్మాగారాల్లో కార్మికులు పని చేసే స్థలాల్లో కనీసం రెండు ఫైర్ ఎగ్జిట్స్ ఏర్పాటు చేయాలి.
● చెత్తచెదారం తగలబెట్టె ముందు నీళ్లు దగ్గర ఉంచుకోవాలి.
● ఇళ్లు, విద్యుత్ వైరు,ట్రాన్స్‌ఫార్మర్లు వద్ద చెత్తచెదారం తగలబెట్టరాదు.
● ఆరుబయట ఉపయోగించే పోయ్యిల వద్ద వంటలు పూర్తి అయిన వెంటనే పూర్తిగా మంటను ఆర్పివేయాలి.
● మందు గుండు సామాగ్రి వంటివి ఎండలో ఆరబెట్టకూడదు.
● ఇంటిలో బాణసంచా నిల్వ చేయకూడదు. అలాగే అనుమతులు లేకుండా బాణసంచా తయారు చేయకూడదు.
జిల్లాలో ఫైర్ స్టేషన్ల నంబర్లు
భీమవరం: ల్యాండ్ నంబర్ 08816 233299,
సెల్: 9963725882
పాలకొల్లు :ల్యాండ్ నెంబరు 08814 222299,
సెల్: 9963726039
నరసాపురం: ల్యాండ్ నెంబరు 08814 275399, సెల్: 9963726487
ఆకివీడు : ల్యాండ్ నెంబరు 088816 252044, సెల్:9963726735
అత్తిలి : ల్యాండ్ నెంబరు 08819 257977,
సెల్: 9963726771
తణుకు : ల్యాండ్ నెంబరు 08819 222101,
సెల్: 9963725758
తాడేపల్లిగూడెం: ల్యాండ్ నెంబరు 08818 221299 సెల్: 9963725443.
వేసవిలో అగ్నిప్రమాదాలకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రజలు అగ్ని ప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. ఏటా మాదిరిగానే ఏప్రిల్‌లో 14 నుంచి 20 వరకూ అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహిస్తాం. వారోత్సవాల సందర్భంగా అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పిస్తాం.
– బి. శ్రీనివాసరావు జిల్లా విపత్తు స్పందన, అగ్నిమాపక అధికారి


