ట్రిపుల్‌ ఐటీలో ముగ్గురు అధ్యాపకుల సస్పెన్షన్‌ | - | Sakshi
Sakshi News home page

ట్రిపుల్‌ ఐటీలో ముగ్గురు అధ్యాపకుల సస్పెన్షన్‌

Apr 15 2026 8:02 AM | Updated on Apr 15 2026 8:02 AM

ట్రిపుల్‌ ఐటీలో ముగ్గురు అధ్యాపకుల సస్పెన్షన్‌ ప్రేమ విఫలం కావడంతో యువకుడి ఆత్మహత్య రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి ఉపాధి పనుల్లో యాప్‌ కష్టాలను తొలగించాలి మహిళ అదృశ్యంపై ఫిర్యాదు విద్యార్థిని అదృశ్యం వడ్డీ లేని రుణాల పంపిణీ

నూజివీడు: విద్యార్థినులపై అనుచితంగా ప్రవర్తించిన ముగ్గురు అధ్యాపకులను విధుల నుంచి సస్పెండ్‌ చేసినట్లు డైరెక్టర్‌ ఆచార్య ఎస్‌ఎస్‌ఎస్‌వీ గోపాలరాజు తెలిపారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. వీరిపై ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో విచారణ ముగిసే వరకు ప్రాథమిక చర్యలలో భాగంగా సస్పెండ్‌ చేశామని పేర్కొన్నారు. కమిటీ తుది నివేదిక సమర్పించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

భీమవరం: ప్రేమ విఫలం కావడంతో తన సోదరుడు గడ్డి మందుసేవించి మృతిచెందినట్లు ఏలూరు జిల్లా అరిగిపల్లి గ్రామానికి చెందిన జంగం శిరీష ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదుచేసినట్లు భీమవరం వన్‌టౌన్‌ హెడ్‌కానిస్టేబుల్‌ వెంకటేశ్వరరావు చెప్పారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం మల్లంపూడి గ్రామానికి చెందిన ఎస్‌ రాజేష్‌(23) ప్రేమలో విఫలం కావడంతో ఈనెల 3వ తేదిన భీమవరం బస్టాండ్‌ దగ్గరలో గడ్డి మందు సేవించాడు. దీనిని గమనించి 108 వాహనంలో భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా మెరుగైన చికిత్స కోసం ఏలూరు, విజయవాడ తరలించారు. పరిస్థితి విషమించడంతో ఈనెల 13వ తేది మృతి చెందాడు. దీంతో మృతుడి సోదరి శిరీష పోలీసులను ఆశ్రయించింది.

భీమవరం: రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు భీమవరం రైల్వే ఎస్సై సుబ్రహ్మణ్యం మంగళవారం విలేకరులకు తెలిపారు. భీమవరం పట్టణంలోని ఉండి రైల్వేగేటు వద్ద సోమవారం రాత్రి పట్టాలు దాటుతుండగా గుంటూరు ఫాస్ట్‌ ప్యాసింజర్‌ రైలు ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించామన్నారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారన్నారు. మృతుని వయస్సు సుమారు 40 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామనిచ, మృతుడి వివరాలు తెలియాల్సి ఉందని సుబ్రహ్మణ్యం చెప్పారు.

ఏలూరు (టూటౌన్‌): జిల్లాలో ఉపాధి హామీ పనిలో తలెత్తుతున్న యాప్‌ కష్టాల వలన ఉపాధి హామీ కూలీలు పనులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు మంగళవారం ఆయనఒక ప్రకటన విడుదల చేశారు. మార్చి 1 నుండచి జాతీయ మొబైల్‌ పర్యవేక్షణ విధానం అమల్లోకి తీసుకువచ్చి, ముఖ హాజరు నమోదు చేసి పని కల్పిస్తూ వేతనం అందిస్తున్నారని తెలిపారు. అయితే యాప్‌ ఎర్రర్‌ వచ్చి హాజరు నమోదు కావడంలేదని వాపోయారు. వెంటనే యాప్‌ ద్వారా హాజరు పద్ధతి రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.

ఏలూరు టౌన్‌: ఏలూరు కండ్రికగూడెం టైటస్‌నగర్‌ ప్రాంతానికి చెందిన ఒక మహిళ తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఇంటినుంచి వెళ్లి తిరిగి రాలేదని ఆమె అత్త పిల్లనగ్రోవి నవమ్మ ఏలూరు టూటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాల ప్రకారం కండ్రికగూడెం టైటస్‌నగర్‌ ప్రాంతానికి చెందిన పిల్లనగ్రోవి ఝాన్సీ (25) కుమారుడు అశ్విత్‌ ముఖిల్‌ అలియాస్‌ జాషువా (3), కుమార్తె గ్లోరియా (8నెలలు)తో ఈనెల 11న ఇంటినుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె కోసం ఎంత వెదికినా అచూకీ లేకపోవటంతో అత్త నపమ్మ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

ఏలూరు టౌన్‌: ఏలూరు త్రీటౌన్‌ పరిధిలో ఒక విద్యార్థిని హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని త్రీటౌన్‌ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విశాఖపట్నం మధురవాడకు చెందిన ఎస్‌ దీక్షిత (19) తల్లిదండ్రి మరణించడంతో మేనమామ ఆకుల రాజశేఖర్‌ కుటుంబంతో కలిసి ఉంటుంది. దీక్షితను ఏలూరు సమీపంలోని ఒక డెంటల్‌ కళాశాలలో చేర్పించగా, ప్రస్తుతం మొదటి ఏడాది విద్య అభ్యసిస్తోంది. ఈ నెల 12న కాలేజీహాస్టల్‌ నుంచి బయటకు వెళ్లి తిరిగి రాకపోవటం, వెతికినా ఆచూకీ లభించకపోవటంతో విశాఖపట్నం నుంచి వచ్చిన మేనమామ రాజశేఖర్‌ ఏలూరు త్రీటౌన్‌ పోలీసులను ఆశ్రయించారు.

భీమవరం (ప్రకాశంచౌక్‌): స్థానిక కలెక్టరేట్‌ కార్యాలయ ఆవరణలో మంగళవారం ఏపీ షెడ్యూల్‌ క్యాస్ట్‌ కో–ఆపరేటివ్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పథకం పీఎంఏజేఏవై పథకాన్ని గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సర్ఫ్‌) సమన్వయంతో లబ్ధిదారులకు ఆర్థిక సహాయం అందజేశారు. 135 మంది ఎస్సీ ఎస్‌ హెచ్‌ జి లబ్ధిదారులకు 1 కోటి 58 లక్షల రూపాయల కార్పొరేషన్‌ సబ్సిడీతో కూడిన ఉన్నతి, వడ్డీ లేని రుణాలను కలెక్టర్‌ చదలవాడ నాగరాణి పంపిణీ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement