గొంతు తడవాలంటే ట్రాక్టర్‌ తోయాల్సిందే! | - | Sakshi
Sakshi News home page

గొంతు తడవాలంటే ట్రాక్టర్‌ తోయాల్సిందే!

Apr 15 2026 8:02 AM | Updated on Apr 15 2026 8:02 AM

సమస్యను పరిష్కరిస్తాం

పాలకొల్లు సెంట్రల్‌: పాలకొల్లు శివారు ప్రాంతాల్లో మంచినీటి సమస్య వేధిస్తుంది. అయితే ఈ ప్రాంత మహిళలకు నీటి కష్టాలతో మరో బంపర్‌ ఆఫర్‌ తగిలింది. నీరు కావాలంటే దాన్ని సరఫరా చేసే వాటర్‌ ట్యాంకర్‌ తోయాల్సిన పరిస్థితి నెలకొంది. పట్టణంలోని అచ్చుగట్లపాలెం శివారు చిత్రావిచెరువుగట్టు ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలకు తాగునీటి కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. ఇటీవల మండలంలోని యాళ్లవాని గరువు రూరల్‌ పంచాయతీ చిత్రావిచెరువు గట్టు ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రజలు పంచాయితీ అందించే తాగునీరు వాడకానికి మాత్రమే ఉపయోగిస్తుంటారు. అలా ఉపయోగించిన కలుషితమైన తాగునీటి వల్ల ఒంటిపై దద్దుర్లు, దురదలు రావడంతో ప్రజల్లో కలకలం రేగింది. జిల్లా కలెక్టర్‌ వెంటనే స్పందించి మెడికల్‌ అధికారులను పంపించి వైద్య పరీక్షలు చేయించారు. అలాగే రూరల్‌ ఓహెచ్‌ఆర్‌ ట్యాంక్‌ను శుభ్రం చేయించారు. అయితే ఈ ప్రాంత ప్రజలకు ఎప్పటి నుండో మునిసిపల్‌ వాటర్‌ ట్యాంకర్‌ ద్వారా తాగునీరు అందిస్తున్నారు. ట్యాంకర్‌ వచ్చిందంటే చాలు ఆ ప్రాంతం మహిళలందరూ క్యూలైన్లో నిలబడి బిందెలు, గిన్నెల్లో ట్యాంకర్‌ వద్ద నీటిని పట్టుకుని తీసుకుకెళ్తుంటారు. క్యూలో నిలబడి నీళ్లు పట్టుకోవడం ఒక ఎత్తయితే నీళ్లు పట్టుకున్న తరువాత ఆ ట్యాంకర్‌ను మహిళలే గెంటాల్సి వస్తుంది. లేదంటే ఆ ట్యాంకర్‌ మొరాయిస్తు అక్కేడే ఉంటుంది.

45 ఏళ్ల ట్రాక్టర్‌

ఈ ట్యాంకర్‌ ట్రాక్టర్‌ సుమారు 1981లో కొనుగోలు చేసినట్లు సమాచారం. అంటే ఇప్పటికి దాదాపు 45 ఏళ్ల నుండి ఎన్ని మరమ్మతులు వచ్చినా ఆ ట్రాక్టర్‌నే తిప్పుతున్నారు. ఈ ట్యాంకర్‌ ద్వారా పట్టణంలో సుమారు పది ట్రిప్పులు వరకూ వేస్తుంటారు. పట్టణంలో అచ్చుగట్లపాలెం, సత్యసాయి కాలని, అన్నా క్యాంటీన్‌, నాగరాజు పేట, ఛాంబర్స్‌ కళాశాల ప్రాంతం, న్యూ జర్నలిస్ట్‌ కాలనీ వంటి పట్టణ శివారు ప్రాంతాలకు ట్యాంకర్‌ ద్వారా తాగునీటిని అఽందిస్తున్నారు. కానీ ఈ ఓల్డ్‌ ట్యాంకర్‌ ట్రాక్టర్‌ చాలా ప్రమాదకరంగా ఉంటుంది. బ్రేకులు, టైర్లు, ఇంజన్‌ ఆయిల్‌ కారడం, సెల్ఫ్‌ లేకపోవడం వంటి అనేక సమస్యలతో సతమతమవుతున్నా ఈ ట్రాక్టర్‌నే ఉపయోగిస్తున్నారు.

అలంకారప్రాయంగా కొత్త ట్రాక్టర్‌

ట్రాక్టర్‌పై పర్యవేక్షణ చేయాల్సిన ఇంజనీరింగ్‌ అధికారులు ఇంకా ఎదురుచూస్తున్నారు. ఉగాది పర్వదినానికి ముందు రోజు తాడేపల్లిగూడెం నుండి మునిసిపల్‌ కార్యాలయానికి నూతన ట్రాక్టర్‌ తీసుకువచ్చి భద్రవరిచారు. ఈ ట్రాక్టర్‌ వాటర్‌ వర్క్స్‌కు వచ్చి సుమారు నెల రోజులు కావస్తుంది. మరి ఈ నూతన వాహనాన్ని ఇంకా ఎన్నిరోజులకు ప్రారంభిస్తారో ఆ ఇంజనీరింగ్‌ అధికారులకే తెలియాలి. ఇప్పటికై నా అధికారులు స్పందించి కొత్త ట్రాక్టర్‌ ద్వారా నీటిని సరఫరా చేయాలని మహిళలు కోరుతున్నారు.

పాలకొల్లు శివారు ప్రాంతాల్లో మంచినీటి సమస్య

ట్యాంకర్‌ ద్వారా నీటి సరఫరా

మొరాయిస్తున్న ట్రాక్టర్‌తో ఇబ్బందులు

కొత్త ట్రాక్టర్‌ అందుబాటులోనే ఉంది. ఇంకా ట్యాంకర్‌ రావాల్సి ఉంది. రావడానికి మరో నాలుగు రోజులు సమయం పడుతుంది. ఈ వారంలో నూతన వాటర్‌ ట్యాంక్‌ వాహనాన్ని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తాం. పాత వాహనం మొరాయిస్తుంది. ఈ సమస్యను అతి త్వరలోనే పరిష్కరిస్తాం.

– రాజ్‌కుమార్‌, మునిసిపల్‌ ఇంజనీర్‌, పాలకొల్లు

Advertisement
 
Advertisement
Advertisement