యథేచ్ఛగా మట్టి తవ్వకాలు | - | Sakshi
Sakshi News home page

యథేచ్ఛగా మట్టి తవ్వకాలు

Apr 15 2026 8:02 AM | Updated on Apr 15 2026 8:02 AM

కుక్కునూరు: మండలంలో గ్రావెల్‌ తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఎటువంటి అనుమతులు లేకుండా పట్ట పగలే దర్జాగా జేసీబీలతో గ్రావెల్‌ ని తవ్వి అమ్మకాలు చేపడుతున్నారు. ఒక ట్రాక్టర్‌ లోడ్‌ కు రూ. 600 వసూలు చేస్తున్నట్టు సమాచారం. జిల్లాలో అక్రమ గ్రావెల్‌, ఇసుక తోలకాలు జరగకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌ ఇటీవల అధికారుల సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్‌ ఆదేశాలను మండల స్థాయిలో రెవెన్యూ యంత్రాంగం పటిష్టంగా అమలు చేయకపోవడంతోనే మట్టి అక్రమ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయిందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

వింజరం, కుక్కునూరులో మట్టి తవ్వకాలు

మంగళవారం వింజరం, కుక్కునూరు గ్రామాల్లో గ్రావెల్‌ తవ్వకాలు కొనసాగాయి. వింజరంలో జరిగిన మట్టి తోలకాలపై స్థానికులు 112 టోల్‌ ఫ్రీ నెంబర్‌కి కాల్‌ చేసి ఫిర్యాదు చేయగా వీఆర్‌ఓ, పోలీసులు వచ్చి ఆపారు. ఆపిన కొద్దిసేపటికే మళ్లీ మట్టి తోలకాలు ప్రారంభించినట్టు గమనార్హం. ఈ విషయం అధికారులకు తెలిసిన ఆపే ప్రయత్నం చేయకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి . మట్టితోలకాలు జరుగుతున్న ప్రాంతం ప్రభుత్వ భూమని స్థానికులు అంటుండగా, అధికారులు మాత్రం రైతుకు చెందిన పట్టా భూమని చెబుతుండడంపై గందరగోళం నెలకొంది. వింజరం గ్రామంలో గ్రావల్‌ తోలకాలపై వీఆర్వో నాగేశ్వరరావుని వివరణ కోరగా, వింజరం గ్రామంలో మట్టి తవ్వకాలకు ఎలలాంటి పర్మిషన్‌ లేదన్నారు. రైతు తన పట్టా భూమిలో మట్టిని తవ్వుకుంటున్నట్టు వత్తాసు పలికారు.

Advertisement
 
Advertisement
Advertisement