ఏలూరు టౌన్: ఏలూరు ఆర్‌టీసీ బస్టాండ్‌లో బంగారు ఆభరణాల చోరీ చేస్తున్న మహిళను మంగళవారం పోలీసులను అరెస్ట్ చేశారు. బస్టాండ్ సమీపంలో అనుమానస్పదంగా తిరుగుతున్న మహిళను అదుపులోకి తీసుకుని విచారించగా... చోరీలకు పాల్పడుతున్నట్లు ఒప్పుకోవటంతో అరెస్ట్ చేశారు. ఈ మేరకు ఏలూరు త్రీటౌన్ పోలీస్‌స్టేషన్‌లో సీఐ కోటేశ్వరరావు విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. మార్చి 23న మచిలీపట్నానికి చెందిన కోసి కృష్ణవేణి తన కుమార్తెతో కలిసి ఆర్‌టీసీ బస్సులో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి నుంచి మచిలీపట్నం వెళ్తూ... ఏలూరు కొత్తబస్టాండ్‌లో వేరొక బస్సు మారేందుకు కిందికి దిగారు. వేరే బస్సు ఎక్కుతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి ఆమె చేతి బ్యాగులోని బంగారు ఆభరణాలను అపహరించారు. బాధితురాలు ఫిర్యాదు చేయగా ఏలూరు త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. విచారణ చేపట్టగా తూర్పుగోదావరి జిల్లా కాటేరు గ్రామానికి చెందిన ముప్పవరపు సత్యనారాయణమ్మ (62) అనే మహిళ బంగారు ఆభరణాలను చోరీ చేస్తున్నట్లు గుర్తించారు. నిందితురాలి నుంచి 14 కాసుల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. కేసును ఛేదించటంలో ప్రతిభ చూపిన ఎస్సై రాంబాబు, క్రైమ్ సిబ్బందిని జిల్లా ఎస్పీ శివకిషోర్ ప్రత్యేకంగా అభినందించారు.


