నయన మనోహరం.. నారసింహుని పరిణయోత్సవం
ద్వారకాతిరుమల : భక్తజన నృసింహ నామస్మరణలు.. వేద పండితుల సుస్వర మంత్ర పఠనాలు.. ప్రతి ఘట్టాన్నీ గుర్తు చేసేలా మంగళవాయిద్య నాదాలు.. అందంగా అలంకరించిన పందిళ్లు, సుగంధభరిత పుష్పమాలికలతో శోభాయమానంగా తీర్చిదిద్దిన కల్యాణ వేదిక.. దానిపై పట్టువస్త్రాలు, సర్వాభరణాలు ధరించి, బుగ్గన చుక్కతో వరుడిగా మెరిసిపోతున్న స్వామివారు.. ఆ పక్కనే వధువులుగా కొలువుదీరిన అమ్మవార్లు.. ఒక్క మాటలో చెప్పాలంటే శ్రీదేవి, భూదేవి అమ్మవార్లతో.. జగదానంద కారకుడైన నారసింహ స్వామివారి వార్షిక దివ్య తిరుకల్యాణోత్సవం జరిగిన వేళ.. ఐఎస్ జగన్నాధపురం క్షేత్రం భూతల వైకుంఠాన్ని తలపించింది. దేదీప్యమానంగా వెలిగిపోయింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు.. నయనానందకరంగా సాగిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి కల్యాణోత్సవాన్ని కనులారా తిలకించి, పులకించిపోయారు.
కన్నులపండువగా..
ముందుగా శ్రీదేవి, భూదేవి సమేత నారసింహుని ఉత్సవ మూర్తులను సుందరగిరిపై నుంచి శనివారం ఉదయం కొండ కింద కల్యాణ మండపం వద్దకు పల్లకీ వాహనంలో తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను వేంచేపు చేసి, అలంకరించారు. అనంతరం పరిణయ వేడుకల్లో ఒక్కో ఘట్టాన్ని పండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. విశ్వక్సేన ఆరాధన, పుణ్యహవాచనం, కన్యాదానం జరిపి, సరిగ్గా 11.10 గంటల సుముహూర్త సమయంలో స్వామి, అమ్మవార్ల శిరస్సులపై జీలకర్ర, బెల్లం ధరింపజేశారు. ఆ తరువాత వేద మంత్రోచ్ఛరణలతో మాంగల్యధారణ, తలంబ్రాల వేడుకను పండితులు అట్టహాసంగా జరిపారు. ప్రభుత్వం తరుఫున గోపాలపురం ఏఎంసీ చైర్మన్ వై.బ్రహ్మరాజు, దేవస్థానం తరుఫున ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్‌వీఎన్‌ఎన్ నివృతరావు, ఈఓ యర్రంశెట్టి భద్రాజీ అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. వేడుక అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలతో పాటు, స్వామివారి అన్నప్రసాదాన్ని అందించారు. ఈ వేడుకలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
కల్యాణ ఘడియలో స్వామి, అమ్మవార్లు, కల్యాణ వేడుకను వీక్షిస్తున్న భక్తులు
ఐఎస్ జగన్నాధపురంలో అట్టహాసంగా వేడుక
కనులారా తిలకించి, పులకించిన భక్తజనం
భక్తులతో పోటెత్తిన సుందరగిరి
నయన మనోహరం.. నారసింహుని పరిణయోత్సవం
నయన మనోహరం.. నారసింహుని పరిణయోత్సవం


