తాళం వేసి ఉన్న ఇంటిలో చోరీ
పాలకొల్లు సెంట్రల్: తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగతనం జరిగిన ఘటన పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలని రామాలయం సమీపంలో చోటుచేసుకుంది. బాధితురాలు సయ్యపురాజు పద్మ తెలిపిన వివరాల ప్రకారం ఆమె భర్త అర్ధకట్ల గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తూ ఆరు నెలల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు అమెరికాలో ఉంటుండగా కుమార్తె ఇటీవల బ్లడ్ కేన్సర్‌తో మృతి చెందింది. జనవరి 26వ తేదీన పద్మ ఇంటికి తాళాలు వేసుకుని ఉండిలో ఉన్న అమ్మగారి ఇంటికి వెళ్లారు. శనివారం ఉదయాన్నే స్థానికులు ఫోన్‌చేసి ఇంటి తాళాలు తీసి ఉన్నాయని సమాచారం ఇవ్వడంతో ఆమె ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటిలోని మూడు బీరువాలు పగల గొట్టి ఉన్నాయి. పది కాసుల బంగారు, రూ.50 వేలు నగదు, ద్విచక్ర వాహనం చోరీ జరిగినట్లు గుర్తించినట్లు చెప్పారు. శుక్రవారం రాత్రి 12 గంటల సమయంలో దొంగ ఇంటి ముందు గునపంతో తిరుగుతుండగా సీసీ కెమెరాలో రికార్డయ్యిందన్నారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయాల్సి ఉందన్నారు.


